TTD Santhi Homam: నేడు తిరుమలలో శాంతి హోమం, నెయ్యి వివాదం నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం-shanti homam in tirumala today in the back ground of the ghee dispute ttds ketydecision ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Santhi Homam: నేడు తిరుమలలో శాంతి హోమం, నెయ్యి వివాదం నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం

TTD Santhi Homam: నేడు తిరుమలలో శాంతి హోమం, నెయ్యి వివాదం నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం

Bolleddu Sarath Chandra HT Telugu
Sep 23, 2024 10:33 AM IST

TTD Santhi Homam: కోట్లాది భక్తుల మనోభావాలతో ముడిపడిన తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రసాదం నాణ్యత విషయంలో దిద్దుబాటు చర్యలతో పాటు ఆలయంలో శాంతి హోమం నిర్వహించాలని నిర్ణయించింది.నాణ్యతా లోపాలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన టీటీడీ, నేడు హోమం నిర్వహించనుంది.

తిరుమలలో నేడు శాంతి హోమం నిర్వహణ
తిరుమలలో నేడు శాంతి హోమం నిర్వహణ

TTD SanthiHomam: ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల శ్రేయస్సుతో పాటు లడ్డూ ప్రసాదాల పవిత్రత, దైవత్వాన్ని పునరుద్ధరింపజేసేందుకు తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ 23న సోమవారం శాంతి హోమం నిర్వహించనున్నట్లు టిటిడి ఈవో జె.శ్యామలరావు చెప్పారు.

తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో టీటీడీ ఈవో, అదనపు శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా శ్రీవారి నైవేద్యంలో వాడే నెయ్యిలో కల్తీ ఉందని గుర్తించామని వివరించారు.

సర్వ పాప పరిహారార్థం, భక్తుల శ్రేయస్సును ఆకాంక్షిస్తూ సోమవారం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు తిరుమలలోని బంగారు భావిష్యంత ఉన్న యాగశాలలో శాంతి హోమం నిర్వహించాలని టీటీడీ నిర్ణయించినట్లు తెలిపారు.

ఇదివరకే ఆగస్టు 15 నుండి 17వ తేదీ వరకు టీటీడీ మూడు రోజులపాటు పవిత్రోత్సవాలను ఆకమోక్తంగా నిర్వహించిందని, అయితే శ్రీవారి నైవేద్యంలో కల్తీ పదార్థాలు ఉన్నది గుర్తించినందున, అందుకు పరిహరణగా శాంతి హోమం నిర్వహించాలని ఆగమ సలహా మండలి నిర్ణయించినట్లు చెప్పారు.

లడ్డూల రుచిని మెరుగుపరిచేందుకు టీటీడీ చేపట్టిన చర్యలను వివరిస్తూ, టీటీడీ ప్రస్తుతం ఆవు నెయ్యి కొనుగోలు విధానాన్ని పూర్తిగా మార్చివేసిందని, స్వచ్ఛమైన ఆవునేయిని ఎంతో పారదర్శకంగా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఈ సంస్కరణలతో ఇప్పుడు లడ్డూ ప్రసాదం రుచి అనేక రెట్లు మెరుగుపడిందని, భక్తులు కూడా ఎనలేని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని ఈవో వివరించారు. ఈ సమావేశంలో జేఈవో వీరబ్రహ్మం, ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు, శ్రీరామకృష్ణ దీక్షితులు తదితరులు పాల్గొన్నారు.