AP Sand Struggles: బాబొచ్చినా ఏపీలో ఇసుక భారం తగ్గలేదు, రెట్టింపైన రిటైల్ మార్కెట్ ధరలు, తెరుచుకోని రీచ్‌లు
AP Sand Struggles: సుప్రీం కోర్టు ఆదేశాలతో ఇసుక రీచ్‌లను మూసేయడంతో బహిరంగ మార్కెట్‌లో ఇసుక ధరలకు రెక్కలు వచ్చాయి. నెల రోజుల వ్యవధిలోనే ఇసుక ధరలు రెట్టింపయ్యాయి. టన్ను ధర రిటైల్ మార్కెట్ నాణ్యతను బట్టి రూ.8-10వేలకు చేరింది.
AP Sand Struggles: ఏపీలో ఇసుక ధరలు చుక్కలనంటుతున్నాయి. గత నెలన్నరగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రీచ్‌లను మూసి వేయడంతో ఇసుకకు తీవ్ర కొరత ఏర్పడింది. పేద, మధ్య తరగతి ప్రజలకు ఇసుక కొనాలంటేనే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ట్రాక్టర్ లోడ్ టన్ను ఇసుక ధర నాణ్యతను బట్టి రూ.8-10వేలకు చేరింది. సుప్రీం కోర్టు ఆంక్షలతో కృష్ణా నది పరివాహక ప్రాంతంలో తవ్వకాలను నిలిపివేయడంతో మార్కెట్లలో కొరత ఏర్పడింది.
గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం అనుసరించిన అడ్డగోలు విధానాలతో ఇసుక ధరలు భారీగా పెరిగిపోయాయి. మైనింగ్ శాఖ నామమాత్రపు ధరలకు విక్రయిస్తున్నట్టు విస్తృత ప్రచారం చేసుకున్నా యథేచ్ఛగా దోపిడీ కొనసాగింది. పేరుకు మైనింగ్ శాఖ తవ్వకాలు జరిపినా అమ్మకాలు మాత్రం ప్రైవేట్ సంస్థలకు అప్పగించారు. నది గర్భాల్లో యంత్రాలతో విచ్చలవిడిగా తవ్వేశారు. ఈ తవ్వకాలపై గుంటూరుకు చెందిన నాగేంద్ర కుమార్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. అక్రమ తవ్వకాలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో గత మేలో ఎన్నికలు ముగిసిన వెంటనే ఇసుక రీచ్‌లను మూసేశారు.
రీచ్‌లు అందుబాటులో లేకపోవడంతో ఉన్న రీచ్‌లను గుప్పెట్లో పెట్టుకున్న గత నెలన్నరగా కొరతను సృష్టిస్తున్నారు. భారీగా డంప్‌లలో నిల్వ చేసి మార్కెట్లకు తరలిస్తున్నారు. ప్రస్తుతం ట్రాక్టర్ ఇసుక ధర విజయవాడలో 10వేలకు చేరింది. నిర్మాణ పనులకు వాడే రకం రూ.8వేలు పలుకుతోంది. యూనిట్ ఇసుక హోల్‌సేల్ ధర రూ.1300 నుంచి 1500 పలుకుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. రవాణా ఛార్జీలు, అధికారులకు మామూళ్లు, ఖర్చులు కలుపుకుంటే ధరలు పెంచక తప్పడం లేదని చెబుతున్నారు.
నగరాల పరిధిలోకి టిప్పర్లకు అనుమతి లేకపోయినా రాత్రి పూట 30-35టన్నుల లోడుతో టిప్పర్‌లను రవాణా చేస్తున్నారు. టిప్పర్ ధర రూ.40వేల వరకు చేరింది. ఆరు చక్రాల టిప్పర్ లోడ్ బల్క్ లో అయితే 15వేలు, రిటైల్ లో 20-23వేలు పలుకుతోంది. నెల రోజుల వ్యవధిలోనే ఇసుక ధరలు రెట్టింపు కావడంతో నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.
అసంఘటిత రంగంపై తీవ్ర ప్రభావం..
ఆంధ్రప్రదేశ్ నిర్మాణ రంగాన్ని ఇసుక కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఐదేళ్లుగా అంతంత మాత్రంగా ఉన్న భవన నిర్మాణ రంగాన్ని ఇసుక కొరత వేధిస్తోంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులతో ఇసుక తవ్వకాలపై ఆంక్షలు విధించడం, ప్రభుత్వ నిర్ణయాలు, ఇసుక విక్రయాల్లో లోప భూయిష్ట విధానాలతో ఉపాధి దొరక్క కార్మికులు విలవిల్లాడుతున్నారు.
ఇసుక విక్రయాల ద్వారా ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చిందో ఖచ్చితమైన లెక్కలు లేవు కానీ సామాన్యులకు మాత్రం ఇసుక అందకుండా పోయింది. ప్రభుత్వమే ఇసుకను విక్రయిస్తోందని ప్రతి వారం పత్రికల్లో ఆర్భాటంగా ప్రకటనలు ఇచ్చుకున్నా ఆచరణలో మాత్రం ఎక్కడా జరగలేదు. ఏపీలో ప్రధాన పట్టణాలైన విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి వంటి ప్రాంతాల్లో గత ఐదేళ్లుగా నిర్మాణ వ్యయంపై ఇసుక ధరల ప్రభావం భారీగా పడింది.
2022 వరకు 25టన్నుల టిప్పర్ ధర సగటున రూ.30వేల పలికింది. ఆ తర్వాత కాస్త తగ్గినా 2019 మే నెలకు ముందున్నధరలతో పోలిస్తే రెట్టింపు అయ్యాయి. గతంలో రెండు మూడు వేల ధరకు లభించే ట్రాక్టర్ లోడ్ గత ఐదేళ్లలో ఏనాడు రూ.5వేలకు తగ్గలేదు. ప్రభుత్వం మైనింగ్ శాఖ ద్వారా తవ్వకాలు జరిపించి జేపీ వెంచర్స్ ద్వారా విక్రయించడం ద్వారా ఖజానాకు భారీగా ఆదాయం వస్తోందని చెప్పుకున్న అక్రమ తవ్వకాలు, ప్రైవేట్ అమ్మకాలు ఎక్కడా ఆగలేదు.
ఈ భారమంతా సామాన్య ప్రజలే మోయాల్సి వచ్చింది. సచివాలయాల్లో ఇసుకను విక్రయిస్తామని మొదట్లో చెప్పుకున్నా అది కొద్ది నెలల్లోనే ఆటకెక్కింది. అసలు ఇసుక ఎక్కడ కొనాలో ఎవరికి తెలియకుండా ఐదేళ్ల దందా నడిపించారు. పైకి మాత్రం ప్రతివారం ధరల్ని పత్రికల్లో ప్రటిస్తూ ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నాలు చేశారు. టన్ను ధరను సగటున రూ.450 నుంచి నియోజక వర్గాల వారీగా ధరల్ని ప్రకటించినా అది ఆచరణలో ఎక్కడా అమలు కాలేదు. ప్రభుత్వం ప్రకటించిన ధరలకు దళారులు, మధ్యవర్తులకు మాత్రమే చేరేది.
ఏపీలో వ్యవసాయం తర్వాత భవన నిర్మాణ రంగంపైనే ఎక్కువ మంది ఉపాధి పొందుతున్నారు. రోజంతా కాయకష్టం చేసే వారు సాయంత్రానికి మద్యాన్ని ఆశ్రయిస్తుంటారు. మద్యం ధరల దోపిడీతో సంపాదించిన దాంట్లో మూడో వంతు ప్రభుత్వమే లాక్కుంటుందనే అక్రోశం వారిలో ఉంది. మద్యం దుకాణాల వద్ద ఐదేళ్లుగా నిత్యం వారి ఆర్తనాదాలు వినిపించేవి.
బాబు వస్తే కష్టాలు తీరుతాయని ఎదురు చూసి….
ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి కారణమైన అంశాల్లో ఇవి కూడా ప్రభావం చూపించాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా సమస్యలు కొలిక్కి రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఇసుక సరఫరాపై ఆధారపడి లక్షలాది అసంఘటిత రంగ కార్మికులు ఉపాధి పొందుతున్నారు. నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులు, ఎలక్ట్రిషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు, డిజైనర్లు, పెయింటర్లు, ముఠా కూలీలు, సీలింగ్ పనులు చేసేవారు ఇలా ఒక్కో నిర్మాణంతో పెద్ద సంఖ్యలో ఉపాధి లభించేది. ఇసుక కొరతతో ఈ ఉపాధి రంగాలన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం అవుతున్నాయి.
సంబంధిత కథనం