Rajahmundry News : రైలులో బిర్యానీ తిని 9 మందికి తీవ్ర అస్వస్థత, రాజమండ్రి జీజీహెచ్ కు తరలింపు
Rajahmundry News : రైలులో ఆహార పదార్థాలు నాణ్యత ఉండవని మరోసారి రుజువైంది. విశాఖ రైల్వే స్టేషన్ తో సహా, ఆ మార్గంలో వచ్చిన పలు రైళ్లలో బిర్యానీ తిన్న ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. వారిని రాజమండ్రి జీజీహెచ్ కు తరలించారు.
Rajahmundry News : రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు...రకరకాల ఫుడ్ ఐటమ్స్ వస్తుంటాయి. ముఖ్యంగా టీ, కాఫీ, డ్రింక్స్, బిర్యానీ, సమోసాలు ఒకరి తర్వాత ఒకరు వస్తూ ప్రయాణికులను ఉక్కిరిబిక్కి చేస్తుంటారు. దూర ప్రాంతాలకు ప్రయాణించే వారు మరో మార్గం లేక ఆ ఆహారాలు తింటుంటారు. ఈ ఆహార పదార్థాల్లో నాణ్యత ఉండదని మరోసారి రుజువైంది. విశాఖ రైల్వేస్టేషన్ తోపాటు పలు రైళ్లలో కొనుగోలు చేసిన బిర్యానీ తిన్న తొమ్మిది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు తరలించారు. దీంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. పట్నా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలులో పట్నా నుంచి తమిళనాడు సేలంకు వెళ్తున్న 15 మంది విశాఖపట్నం రైల్వేస్టేషన్ లో బిర్యానీలు కొనుగోలు చేసి తిన్నారు. బిర్యానీ తిన్న అరగంట తర్వాత వారిలో ఐదుగురికి వాంతులు, విరేచనాలు మొదలై తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. రైలు రాజమండ్రి రైల్వేస్టేషన్ కు చేరుకోగానే అక్కడ సిద్ధంగా రైల్వే, పోలీసు సిబ్బంది ఆ ఐదుగురిని 108 వాహనంలో రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందించారు.
మరో రైలులో
దిబ్రూగఢ్-కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌లో కేరళలోని పాలక్కడ్‌కు వెళ్తున్న 7గురు ప్రయాణికులు విశాఖ రైల్వేస్టేషన్ దాటిన తర్వాత రైలులో బిర్యానీలు కొనుగోలు చేశారు. ఈ బిర్యానీ తిన్న నలుగురు ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో నలుగురిని రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌లో దించి జీజీహెచ్ కు తరలించారు. విశాఖ వైపు నుంచి వచ్చిన రైళ్లలో బిర్యానీ తిన్న 9 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. ప్రయాణ సమయాల్లో ఎక్కడి పడితే అక్కడ ఆహారం తినకపోవడమే మంచిదని వైద్యులు అంటున్నారు. రైల్వేలో పరిశుభ్రత ఉండదని మరోసారి ఈ ఘటన రుజువు చేసిందని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఆహార పదార్థాలు నాణ్యత లేకుండా తయారు చేసి ప్రయాణికుల ప్రాణాలతో ఆటలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అధికారులు తాత్కాలిక చర్యలు తీసుకుంటున్నారు తప్ప తరచూ తనిఖీలు చేయడంలేదంటున్నారు. అపరిశుభ్రమైన ఆహారాలతో ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, ఇప్పటికైనా అధికారులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైల్వే ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.