Andhra Cricket Association : ఏసీఏ ఎన్నికలపై రగడ…ఎంపీ సాయిరెడ్డ పాత్రపై విమర్శలు-political heat over andhra cricket association elections ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Cricket Association : ఏసీఏ ఎన్నికలపై రగడ…ఎంపీ సాయిరెడ్డ పాత్రపై విమర్శలు

Andhra Cricket Association : ఏసీఏ ఎన్నికలపై రగడ…ఎంపీ సాయిరెడ్డ పాత్రపై విమర్శలు

HT Telugu Desk HT Telugu
Nov 21, 2022 08:04 AM IST

Andhra Cricket Association ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌ పాలకమండలి ఎన్నికల్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రభావితం చేశారని ప్రత్యర్థులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. బిసిసిఐలో కీలకంగా వ్యవహరించే ఏసీఏ పాలకమండలిలో పదవులు అన్నింటిని కావాల్సిన వారికి వచ్చేలా చేయడంలో రాజకీయ నాయకులు ప్రభావితం చూపించారనే విమర్శలున్నాయి.

ఏసీఏ ఎన్నికలపై రగడ
ఏసీఏ ఎన్నికలపై రగడ

Andhra Cricket Association ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌ కార్యవర్గ ఎన్నికల్లో రాజకీయ నాయకులు చక్రం తిప్పారనే విమర్శలు ఎదురవుతున్నాయి. ఏసీఏ అధ్యక్ష పదవితో పాటు పాలకమండలిలో అన్ని పదవుల్ని తమకు కావాల్సిన వారికి దక్కేలా చేయడంలో ఎంపీ సాయిరెడ్డి ప్రభావితం చేశారనే విమర్శలున్నాయి. 2019లో సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఏసీఏ అధ్యక్ష ఎన్నికల్లో సాయిరెడ్డి అల్లుడి అన్న అరబిందో శరత్ చంద్రా రెడ్డి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మూడేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో శరత్ చంద్రా రెడ్డి తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికవడం లాంఛనం కానుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన శరత్ చంద్రా రెడ్డి తన సోదరుడి ద్వారా నామినేషన్ సమర్పించారు. ఆయన అధ్యక్షుడు కావడం ఖాయమైంది. ఆయనతో పాటు సాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి ఉపాధ్యక్షుడు కానున్నారు.

ఎంపీ సాయిరెడ్డి బంధువులతో పాటు విశాఖపట్నానికి చెందిన గోపీనాథ్ రెడ్డికి కార్యదర్శి పదవి, మరికొందరు సన్నిహితులకు కీలక పదవులు దక్కేలా చక్రం తిప్పారు. ఏసీఏ ఎన్నికలకు ముందే ఎవరికి ఏ పదవి దక్కాలనేది నిర్ణయించేశారు.రాష్ట్రంలో వైసీపీ అధికారంలో వచ్చే నాటికి నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌లో చక్రం తిప్పేవారు.ఆయన ఆడింది ఆటగా నడిచేది. అప్పట్లో ఏసీఏ కార్యాలయం విజయవాడలో ఉండేది. ప్రభుత్వం మారిన వెంటనే దానిని విశాఖపట్నానికి మార్చారు. ఏసీఏ పాలకమండలికి గడువు ముగియడంతో ఎన్నికల నిర్వహణకు సిద్ధమయ్యారు. ఎన్నికల అధికారిగా మాజీ చీఫ్ సెక్రటరీ రమాకాంత్ రెడ్డిని నియమించారు.

క్రికెట్ సంఘాల నిర్వహణలో రాజకీయ నాయకుల జోక్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సమయంలో ఏసీఏ నిర్వహణ బాధ్యతలు మొత్తం తమ కుటుంబానికే దక్కేలా వ్యవహరిస్తుండటం విమర‌్శలకు కారణమవుతోంది. క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణ విషయంలో ఏసీఏ పెద్దగా ఆసక్తి చూపడం లేదనే అపవాదు కూడా ఏసీఏపై ఉంది. ఏసీఏకు బిసిసిఐ నుంచి ఏటా భారీగా నిధులు వస్తుంటాయి. ప్రస్తుతం ఏటా రూ.40కోట్ల వరకు నిధులు వస్తున్నాయి. త్వరలో రూ.70కోట్ల వరకు నిధులు రావొచ్చని అంచనా వేస్తున్నారు. మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు నుంచి ఏసీఏను స్వాధీనం చేసుకోవడం వెనుక పక్కా వ్యూహంతో పని చేసినట్లు చెబుతున్నారు.

2019 సెప్టెంబర్ 22న ఏసీఏ అధ్యక్షుడిగా శరత్‌ చంద్రారెడ్డి ఎన్నికయ్యారు. వెంకట గిరి రాజకుటుంబానికి చెందిన వివిఎస్‌ఎస్‌కెకె. యాచేంద్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కృష్ణాజిల్లా క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన దుర్గా ప్రసాద్ కార్యదర్శిగా, కెడిసిఏకు చెందిన రామచంద్రరావు సంయుక్త కార్యదర్శిగా ఎన్నికయ్యారు. గోకరాజు వర్గానికి చెందిన వీరిద్దరిని కొన్నాళ్లకు బయటకు పంపారు. కోశాధికారిగా అష్యూర్ కంపెనీకు చెందిన గోపీనాథ్‌ రెడ్డి ఎన్నికయ్యారు. ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న ధనుంజయ్ రెడ్డిని ఏసీఏ సభ్యుడిని చేశారు.

ఎన్నికలు పేరుకేనా….?

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు సాయిరెడ్డి బంధువులకే దక్కనున్నాయి. అధ్యక్షుడిగా పెనక శరత్‌ చంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడిగా రోహిత్ రెడ్డి నామినేషన్లు వేశారు. కోశాధికారి గోపీనాథ్‌ రెడ్డిని ఈసారి కార్యదర్శి పదవికి ఎంపిక చేశారు. కోశాధికారి పదవిని ఆడిటర్ ఎ.వి.చలంకు దక్కనుంది. ఆ‍యన గోపీనాథ్‌ రెడ్డి సన్నిహితుడని ప్రచారం జరుగుతోంది. విజయవాడకు చెందిన వ్యాపారవేత్త రాకేశ్ సంయుక్త కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్నారు. ఏసీఏ సీఈఓ శివారెడ్డితో రాకేశ్‌కు సన్నిహితుడిగా ప్రచారం జరుగుతోంది. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి మిత్రుడు పురుషోత్తం కౌన్సిలర్ పదవికి పోటీ పడుతున్నారు. 2019కు ముందు ఏసీఏలో సీఈఓ పదవి లేకపోయినా శాప్ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి మేనమామ శివారెడ్డికి ఆ పదవిని కట్టబెట్టారు. శివారెడ్డి గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు

Whats_app_banner