Ongole Pocso Court: స్టూడెంట్ కిడ్నాప్.. ఒంగోలులో వ్యాయామ ఉపాధ్యాయుడికి బతికినంత కాలం జైలు శిక్ష
Ongole Pocso Court: పాఠశాల విద్యార్ధినిని అపహరించిన వ్యాయామ ఉపాధ్యాయుడికి ఒంగోలు పోక్సో కోర్టు బతికినంత కాలం జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చింది. సంచలనం సృష్టించిన ఈ కేసులో ఎనిమిదేళ్ల తర్వాత తీర్పు వెలువడింది. 2017 మైనర్ బాలిక పాఠశాల ఉపాధ్యాయుడు అపహరించాడు.
Ongole Pocso Court: ప్రైవేట్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికకు మాయమాటలు చెప్పి అపహరించిన పోక్సో కోర్టు కఠిన కారాగార శిక్షను విధించింది విద్యాబుద్దులు చెప్పాల్సిన ఉపాధ్యాయ వృత్తికి కళంకం తెచ్చేలా వ్యవహరించి నందుకు జీవితాంతం జైల్లో ఉండాలని పోక్సో నేరాల ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది.
చిన్నారులపై లైంగిక నేరాల నిరోధక చట్టం కింద ఒంగోలులో ఓ వ్యక్తికి న్యాయస్థానం బతికినంత కాలం జైల్లో ఉండాలని తీర్పునిచ్చింది. మాయమాటలతో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను అపహరించిన ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడికి బతికినంత కాలం జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు పోక్సో కోర్టు ఇన్ఛార్జి, ఏడో అదనపు జిల్లా జడ్జి టి.రాజావెంకటాద్రి సోమవారం తీర్పు వెలవరించారు.
ప్రకాశం జిల్లా కంభం గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ అఫ్సర్ బాషాకు పోక్సో కోర్టు శిక్షను ఖరారు చేసినట్టు పోక్సో కోర్టు స్పెషల్ పీపీ ఎన్.వసుంధర వివరించారు. కంభం గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో నిందితుడు బాషా వ్యాయామ ఉపాధ్యాయుడిగా పని చేసేవాడు. ఆ సమయంలో స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను మాయమాటలు చెప్పి లోబరచుకున్నాడు. ఈ క్రమంలో 2017 ఆగస్టు 6న ఇంటి నుంచి వచ్చేయాలని చెప్పడంతో బాలిక ఇంటి నుంచి వచ్చేసింది.
ఆ తర్వాత ఆమెను వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లిన నిందితుడు ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు. పలు మార్లు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. అన్ని చోట్ల ఆమెను తన చెల్లెలిగానే పరిచయం చేశాడు. బాలిక అదృశ్యం కావడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు జరిపి గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఉంటున్నట్లు గుర్తించారు. 2017 ఆగస్టు నెల 24న ఇద్దరినీ ఒంగోలు తీసుకొచ్చారు.
బాలిక వాంగ్మూలం ఆధారంగా నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసు విచారించిన న్యాయమూర్తి నిందితుడిపై నేరారోపణలు రుజువు కావడంతో నిందితుడికి బతికినంత కాలం జైలు శిక్ష అనుభవించాలని తీర్పు చెప్పారు. దీంతో పాటు రూ.25 వేల జరిమానా విధించారు. అత్యాచార బాధితుల పరిహార చట్టం ప్రకారం బాధితురాలికి ప్రభుత్వం నుంచి రూ.7 లక్షల సాయం అందేలా చూడాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థకు సూచించారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ అభినందించారు.