AP Medical Recruitment 2024 : గుంటూరు జిల్లాలో 40 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - దరఖాస్తులకు అక్టోబర్ 30 ఆఖరు తేదీ
గుంటూరు జిల్లా వైద్యారోగ్యశాఖ నుంచి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో భాగంగా 40 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్ 30వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. https://guntur.ap.gov.in/ వెబ్ సైట్లోకి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు.
గుంటూరు జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. దరఖాస్తు దాఖలకు అక్టోబర్ 30 ఆఖరు తేదీగా నిర్ణయించారు. మొత్తం 40 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి డాక్టర్ కె. విజయలక్ష్మి తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ గుంటూరు విభాగంలో జాతీయ ఆరోగ్య మిషన్‌లో ఉద్యోగ నియామకాల చేపడుతున్నట్లు తెలిపారు.
పోస్టుల వివరాలు…
మొత్తం 40 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అందులో ల్యాబ్ టెక్నీషియన్లు -3 పోస్టులు, ఫార్మసిస్టులు -11 పోస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు -11 పోస్టులు, శానిటరీ అటెండర్లు -15 పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 40 ఉద్యోగ నియామకాల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరారు.
దరఖాస్తులను అధికారికి వెబ్‌సైట్ www.guntur.ap.gov.in నుండి డౌన్‌లోడ్ చేసుకొని, పూర్తిచేసిన దరఖాస్తులు సంబంధిత రుసుముతో కూడిన డీడీని జతచేసి జిల్లా వైద్య అండ్ ఆరోగ్య శాఖ కార్యాలయానికి అక్టోబర్ 30 తేదీలోపు సమర్పించాలి. అయితే అక్టోబర్ 16 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
దరఖాస్తు ఫీజు…
దరఖాస్తు దాఖలు చేసేందుకు ఫీజును డీడీ తీయాల్సి వస్తుంది. జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.300, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.100 తీయాల్సి ఉంటుంది. డీడీని అకౌంట్ నెంబర్ 100710100054512, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ 81100070, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెడికల్ కాలేజీ గుంటూరు పేరు మీద గుంటూరు బ్రాంచ్‌లో చెల్లించాలి. డీడీ చెల్లించిన తరువాత దాన్ని దరఖాస్తుకు జత చేయాల్సి ఉంటుంది.
మంగళగిరి ఎయిమ్స్‌లో 11 ఉద్యోగాలకు నోటిఫికేషన్:
మంగళగిరి ఎయిమ్స్‌లో మరో 11 బోధనేతర ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. దరఖాస్తు దాఖలకు నవంబర్ 8 తేదీ ఆఖరు తేదీగా నిర్ణయించారు. దరఖాస్తు ముగింపు తేదీ నుండి 10 రోజుల తరువాత హార్డ్ కాపీలను సమర్పించాలి. ఈ ఉద్యోగాలను డిప్యూటేషన్ బేసిస్‌పై భర్తీ చేస్తారు.
7వ పే కమిషన్‌లో లెవల్ -14లో గ్రూప్ ఏ పోస్టు మెడికల్ సూపరింటెండెంట్ -1, లెవల్ -11లో గ్రూప్ ఏ పోస్టులు నర్సింగ్ సూపరింటెండెంట్- 2, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్)- 1, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)-1, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్-1, లెవల్-10 గ్రూప్ ఏ పోస్టు అకౌంట్స్ ఆఫీసర్-1, లెవల్ -7 గ్రూప్ బీ పోస్టులు అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-1, లైబ్రెరియన్ (గ్రేడ్-I)- 1, లెవల్ -6 గ్రూప్ బీ పోస్టు అసిస్టెంట్ (ఎన్ఎస్)- 1, లెవల్ -4 గ్రూప్ సీ పోస్టు క్యాషియర్-1 పోస్టులను భర్తీ చేస్తారు. వీటిలో క్యాషియర్ మినహా మిగిలిన అన్ని పోస్టులు మూడేళ్లు డిప్యూటేషన్ కాగా, క్యాషియర్ పోస్టుకు రెండేళ్లు డిప్యూటేషన్ ఉంది.
పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://www.aiimsmangalagiri.edu.in/wp-content/uploads/2024/10/Rolling-Advertisement-for-Recruitment-of-Various-Non-Faculty-Group-A-B-C-Posts-on-Deputation-Basis.pdf ను సంప్రదించాలి.