Mla Anil Kumar Yadav : ఇకపై పాత అనిల్ ను చూస్తారు, ఎవడు అడ్డొచ్చినా బుల్లెట్ ట్రైన్ స్పీడ్ తో గుద్దేస్తా
Mla Anil Kumar Yadav : 2024 ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని, ఎన్ని వందల కోట్లు ఖర్చుపెట్టినా తన విజయాన్ని ఆపలేరని మాజీ మంత్రి అనిల్ కుమార్ అన్నారు. ఇకపై పాత అనిల్ ను చూస్తారని, ఎవడు అడ్డొచ్చినా బుల్లెట్ ట్రైన్ స్పీడ్ తో గుద్దేస్తానన్నారు.
Mla Anil Kumar Yadav : చాలా రోజులుగా సైలెంట్ గా ఉన్న నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్... మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. ఇన్నాళ్లూ మీరు ఆడుకున్నారు, ఇకపై అనిల్ ఆట చూపిస్తానంటూ ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. పిల్లాడోగిగా ఉన్నప్పుడే ఓ పెద్ద కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేశానన్నారు. ఇకపై అనిల్ కుమార్ సత్తా ఏంటో చూపిస్తానంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. అనిల్ కుమార్ పార్టీ మారుతున్నట్లు గతకొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. శుక్రవారం తన అనుచరులతో అనిల్ భేటీ అవ్వడంతో...కీలక ప్రకటన ఉంటుంని అందరూ భావించారు. శనివారం ప్రెస్ మీట్ లో ఎన్ని కుట్రలు చేసినా తనను జగన్ కు దూరం చేయలేరన్నారు. తన గుండె కోస్తే అందులో కూడా ఉండేది జగన్ బ్లడ్ అన్నారు. జగన్ కు తాను మిలిటెంట్ స్క్వాడ్ లాంటోడినని అనిల్ కుమార్ అన్నారు. తన కంఠంలో ఊపిరి ఉన్నంత వరకూ సీఎం జగన్ తోనే ఉంటానని ఆయన స్పష్టంచేశారు.
ఆత్మీయ సమావేశంతో అలజడి
నిన్న సిటీ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో అనిల్ కుమార్ ఆత్మీయ సమావేశం పెట్టుకున్నారు. ఆ సమావేశంలో సొంత పార్టీ నేతలపై మండిపడ్డారు. అయితే ఇవాళ్టి ప్రెస్ మీట్ లో టీడీపీపై విరుచుకుపడ్డారు. నెల్లూరు జిల్లాలో యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. లోకేశ్ అసలు పాదయాత్ర చేస్తున్నారా అని ప్రశ్నించారు. జగన్ పాదయాత్రలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 వరకు ప్రజల్లోనే కలిసి ఉండేవారని గుర్తుచేశారు. లోకేశ్ నువ్వు మగాడివైతే టైమ్, ప్లేస్ చెప్పు మనిద్దరం చర్చకు కూర్చుందామని తీవ్ర స్థాయిలో అనిల్ కుమార్ ధ్వజమెత్తారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు కరోనా ప్రభావంతో ప్రాజెక్టులు పూర్తి చేయడానికి సమయం పట్టిందన్నారు. అయినా కూడా ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు కృషి చేశానన్నారు. వైసీపీ ప్రభుత్వమే నెల్లూరు, సంగం బ్యారేజ్ పూర్తి చేసిందన్నారు.
ఇకపై పాత అనిల్ ను చూస్తారు
టీడీపీకి దగ్గరైనా ఆనం రామనారాయణ రెడ్డిపై అనిల్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ఆనం జగన్ దయతో ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి గురించి అందరూ మర్చిపోయారన్నారు. ఆనం కుటుంబాన్ని ఆనం విజయ్ కుమార్ రెడ్డి వల్లే గుర్తుపెట్టుకున్నారన్నారు. గతంతో మంత్రిగా చేసిన ఆనం నెల్లూరు జిల్లాకు ఏం చేశారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఆనం ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓటమి తథ్యమని జోస్యంచెప్పారు. నెల్లూరు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడినంత మాత్రాన వైసీపీకేం నష్టం లేదన్నారు. ముగ్గురు స్క్రాప్ ఎమ్మెల్యేలను తామే పార్టీ నుంచి విసిరేశామని అనిల్ అన్నారు. ఆనం రామనారాయణ రెడ్డికి సిగ్గు, శరం ఉంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ఇకపై పాత అనిల్ ను చూస్తారన్న ఆయన... 2024లో మళ్లీ తానే పోటీచేస్తానని స్పష్టంచేశారు. ఇకపై తనను ఎవ్వడు ఆపుతాడో చూస్తానంటూ వ్యాఖ్యానించారు. తనకు ఎవ్వడు అడ్డొచ్చినా బుల్లెట్ ట్రైన్ స్పీడ్‌తో గుద్దేస్తానన్నారు.