Anam Vs Anil Kumar : నెల్లూరులో రాజీనామా రాజకీయం, ఆనం వర్సెస్ అనిల్ ఎపిసోడ్ లో మరో సవాల్-nellore politics anam vs anil kumar episode anil kumar challenges anam resign to mla post contest from nellore city ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Anam Vs Anil Kumar : నెల్లూరులో రాజీనామా రాజకీయం, ఆనం వర్సెస్ అనిల్ ఎపిసోడ్ లో మరో సవాల్

Anam Vs Anil Kumar : నెల్లూరులో రాజీనామా రాజకీయం, ఆనం వర్సెస్ అనిల్ ఎపిసోడ్ లో మరో సవాల్

Bandaru Satyaprasad HT Telugu
Jun 25, 2023 03:44 PM IST

Anam Vs Anil Kumar : నెల్లూరు జిల్లా సవాళ్ల రాజకీయాలు నడుస్తున్నాయి. రాజీనామా చేయాలని ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకుంటున్నారు. ఆనం వర్సెస్ అనిల్ కుమార్ ఎపిసోడ్ ఇంకా కొనసాగుతోంది.

అనిల్ వర్సెస్ ఆనం
అనిల్ వర్సెస్ ఆనం

Anam Vs Anil Kumar : నెల్లూరు జిల్లా రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలో ఎంటర్ అవ్వడంతో వైసీపీ నేతలు విమర్శలు స్టార్ట్ చేశారు. గత కొద్దికాలంగా సైలెంట్ గా ఉన్న మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ లోకేశ్ పై విరుచుకుపడ్డారు. శనివారం ప్రెస్ మీట్ పెట్టిన అనిల్ కుమార్... పనిలోపనిగా వైసీపీ నుంచి టీడీపీలో జంప్ అయిన వాళ్లనూ టార్గెట్ చేశారు. ఆనం రామనారాయణ రెడ్డిపై విమర్శలు చేశారు. జగన్ దయతో గత ఎన్నికల్లో గెలిచారని, వచ్చే ఎన్నికల్లో ఆనం ఓటమి తథ్యమన్నారు. ఆనం రామనారాయణ రెడ్డికి సిగ్గు, శరం ఉంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అనిల్ కుమార్ యాదవ్ సవాల్ చేశారు. అనిల్ సవాల్ పై స్పందించిన ఆనం...తాను వెంకటగిరిలో రాజీనామా చేస్తానని, అనిల్ నెల్లూరు సిటీలో రాజీనామా చేసి ఇద్దరం నీకు నచ్చినచోట నుంచి పోటీ చేద్దాం, నీ నాయకుడు ఒప్పుకుంటాడేమో చెప్పు అంటూ అనిల్ కి సవాల్ విసిరారు ఆనం రామనారాయణ రెడ్డి. మీ నాయకుడే సైలెంట్ గా ఉన్న సమయంలో నువ్వేందుకు మొరుగుతున్నావని బదులిచ్చారు.

మరోసారి అనిల్ కుమార్ హాట్ కామెంట్స్

ఆనం ప్రతిసవాల్ పై అనిల్ కుమార్ యాదవ్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దమ్ముంటే తనపై పోటీ చేయాలని, ఒకవేళ తాను ఓడితే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని అనిల్ కుమార్ మరోసారి సవాల్ విసిరారు. లోకేశ్ చేత నెల్లూరు టికెట్ కన్ఫర్మ్ చేసుకుని తనపై పోటీ చేయాలన్నారు. అప్పుడు ఎవరి సత్తా ఏంటో తేలిపోతుందన్నారు. నెల్లూరు సిటీలో పోటీ చేసే దమ్ము ఆనం రామనారాయణ రెడ్డికి లేదని అనిల్ ఎద్దేవా చేశారు. ఆనం రాజకీయం ఎక్కడ స్టార్ట్ చేశారో అక్కడే ఆయన రాజకీయం క్లోజ్ చేస్తానని అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరించారు. అలా చేయకపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. లోకేశ్ పాదయాత్రతో అధికారంలోకి వస్తామని టీడీపీ నేతలు పగటి కలలు కంటున్నారని అనిల్ విమర్శించారు.

చర్చకు సిద్ధమా?

గత ఎన్నికల్లో జగన్ చరిష్మాతో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆనం రామనారాయణ రెడ్డికి ఆ పదవిలో కొనసాగడానికి సిగ్గుండాలని అనిల్ విమర్శించారు. వైసీపీ నుంచి సస్పెండ్ చేసినా వెంకటగిరి ఎమ్మెల్యే పదవికి ఆనం రాజీనామా చేయడంలేదని అన్నారు. టీడీపీ హయాంలో నెల్లూరు అభివృద్ధి జరిగిందని అంటున్న నేతలు... ఏ ప్రభుత్వంలో ఎంత ఖర్చుపెట్టారో చర్చకు సిద్ధమా అని అనిల్ సవాల్ విసిరారు. ఒక్కసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవని బీద రవిచంద్ర తనపై విమర్శలు చేయడం కామెడీగా ఉందన్నారు. టీడీపీ హయాంలో కావలిలో జరిగిన అవినీతి, అక్రమాలపై చర్చకు సిద్ధమా? అని అనిల్ కుమార్ ఛాలెంజ్ విసిరారు. ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము బీద రవిచంద్రకు లేదన్నారు. ఒకవేళ టికెట్ ఇస్తానన్నా భయపడి పారిపోయే పిరికివాడని ఎద్దేవా చేశారు.

అనిల్ కుమార్ కు బీద కౌంటర్

అనిల్ కుమార్ వ్యాఖ్యలపై బీద రవిచంద్ర కౌంటర్ ఇచ్చారు. ఓ ఎమ్మెల్యేగా అనిల్ భాష చూస్తుంటే అసహ్యమేస్తుందన్నారు. సీఎం జగన్ వారంలో నాలుగు రోజులు పాదయాత్ర చేస్తే, మూడు రోజులు కోర్టు యాత్రలు, చీకటి యాత్రలు చేశారని బీద ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు పనిచేసిన నీటిపారుదల శాఖ మంత్రుల్లో అనిల్ అంతటి అసమర్థుడు మరొకరు లేరన్నారు. పోలవరం మట్టి అమ్ముకోవడం తప్ప వైసీపీ ప్రభుత్వం... ప్రాజెక్టు పనులు పూర్తి చేయలేకపోయిందన్నారు.

Whats_app_banner