Nara Lokesh: ఉపాధ్యాయుల బదిలీల్లో రాజకీయ జోక్యం వద్దని, యాప్‌ల భారం తగ్గించాలని ఆదేశించిన నారా లోకేష్-nara lokesh ordered that there should be no political interference in the transfer of teachers ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nara Lokesh: ఉపాధ్యాయుల బదిలీల్లో రాజకీయ జోక్యం వద్దని, యాప్‌ల భారం తగ్గించాలని ఆదేశించిన నారా లోకేష్

Nara Lokesh: ఉపాధ్యాయుల బదిలీల్లో రాజకీయ జోక్యం వద్దని, యాప్‌ల భారం తగ్గించాలని ఆదేశించిన నారా లోకేష్

Sarath chandra.B HT Telugu
Jun 27, 2024 06:20 AM IST

Nara Lokesh: ప్రభుత్వ ఉపాధ్యాయులపై బోధన మినహా అనవసరపు పని భారం తగ్గించాలని, ఉపాధ్యాయుల బదిలీల్లో రాజకీయ జోక్యాన్ని నిరోధించాలని మంత్రి నారా లోకేష్ అధికారుల్ని ఆదేశించారు.

విద్యాశాఖపై సమీక్షిస్తున్న  మంత్రి నారా లోకేష్
విద్యాశాఖపై సమీక్షిస్తున్న మంత్రి నారా లోకేష్

Nara Lokesh: ఏపీలో ఉపాధ్యాయులపై అదనపు భారాన్ని తగ్గించాలని, బదిలీల్లో రాజకీయ జోక్యాన్ని నిరోధించాలని విద్యాశాఖ అధికారులకు మంత్రి నారా లోకేష్ ఆదేశించారు.

yearly horoscope entry point

రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలు పారదర్శకంగా జరిగాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యలో చేపట్టాల్సిన మార్పులు, ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై పాఠశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సచివాలయంలో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.

ఉపాధ్యాయుల బదిలీల విషయంలో గతంలో మాదిరి రాజకీయ ఒత్తిళ్లకు తావు లేకుండా విధివిధానాలని రూపొందించాలని కమిషనర్ ను ఆదేశించారు. ఈ విషయంలో ఉపాధ్యాయ సంఘాల సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు.

బోధనకు మాత్రమే పరిమితం చేయండి…

ఉపాధ్యాయులకు బోధనేతర పనులు, అనవసరమైన యాప్ ల భారాన్ని తగ్గించి, పూర్తిస్థాయి బోధనపైనే దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి పేరెంట్స్ కమిటీలను భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు.

రాబోయే సమీక్షలో మూసివేసిన పాఠశాలలకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ఎన్ని నిధులు అవసరమవుతాయనే అంశంపై అధికారులను వాకబుచేశారు.

గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు పెద్దఎత్తున విద్యార్థులు బదిలీ కావడానికి గల కారణాలు అన్వేషించి సమగ్ర నివేదిక అందించాలని మంత్రి ఆదేశించారు. దీంతో పాటు చిల్డ్రన్ లెర్నింగ్ అవుట్ కమ్స్, విద్యా ప్రమాణాల పెంపునకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే అంశంపై సమగ్రంగా చర్చించారు. విద్యా ప్రమాణాల పెంపునకు దేశంలో అత్తుత్తమ విధానాలు ఎక్కడ అమలవుతున్నాయో అధ్యయనం చేసి నివేదిక అందించాలని అధికారులను కోరారు.

ఈ సందర్భంగా జర్మనీ, ఆస్ట్రియాతోపాటు పలు అభివృద్ధి చెందిన దేశాల విద్యా వ్యవస్థలను మంత్రి ప్రస్తావించారు. రాయలసీమ ప్రాంతంలో ఎక్కడ పాఠశాలల కొరత ఉంది, ఎక్కన నూతన పాఠశాలలు ప్రారంభించాలనే అంశాలపైనా ఈ సమావేశంలో అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు.

ఉపాధ్యాయుల సమస్యలపై ఫోకస్…

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనలో సంస్కరణల పేరిట అమలు చేసిన నిర్ణయాలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. పాఠశాలల హేతుబద్దీకరణ పేరుతో భారీగా స్కూళ్లను మూసేయడంతో విద్యార్ధులు ప్రైవేట్ పాఠశాలలను ఆశ్రయించాల్సి వచ్చింది. ఎయిడెడ్ స్కూళ్లను విలీనం చేయడం, వాటి నిర్వహణపై ఆంక్షలు విధించడంతో పెద్ద ఎత్తున పాఠశాలలు మూతబడ్డాయి.

మరోవైపు పాఠశాలల్లో నాడు నేడు పేరుతో మౌలిక సదుపాయాల కల్పన బాధ్యతలు కూడా ఉపాధ్యాయులపై పెట్టారు.దీంతో విద్యాబోధన కుంటుపడింది. మరుగుదొడ్లను శుభ్రం చేయించే బాద్యతలు కూడా ఉపాధ్యాయులపై వేశారనే ఆరోపణలు ఉన్నాయి. వేతన బకాయిలు, పిఆర్సీ, డిఏ చెల్లింపులు, సిపిఎస్ రద్దు వంటి డిమాండ్లతో ఉద్యమించిన ఉపాధ్యాయులపై గత ప్రభుత్వంలో కేసులు పెట్టారు. విద్యారంగంలో కొన్ని సంస్కరణలపై ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. గత ఎన్నికల్లో ఫలితాలకు ఉపాధ్యాయుల పాత్ర కూడా ఉండటంతో ప్రభుత్వం వారి సమస్యలపై దృష్టి సారించింది.

Whats_app_banner