Nagarjuna Sagar Water: నాగార్జున సాగర్ నిండా నీరున్నా, సాగు నీటి కోసం రైతులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు?
Nagarjuna Sagar Water: నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి నెల రోజులుగా ఇప్పటికే వందలాది టీఎంసీల నీరు దిగువ కృష్ణాలోకి వెళుతోంది.ఈ నెల 2వ తేదీన ఎడమ కాల్వకు సాగునీటిని విడుదల చేశారు.మేజర్లు, డిస్టిబ్యూటరీలకు నీటి విడుదల షెడ్యూలును ప్రకటించలేదు.ప్రధాన కాల్వల్లో మినహా ఆయకట్టు చివరి భూములకు నీరందడం లేదు.
Nagarjuna Sagar Water: నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి నెల రోజులుగా వందలాది టీఎంసీల నీరు దిగువ కృష్ణాలోకి వెళుతోంది. ఈ నెల 2వ తేదీన రాష్ట్ర మంత్రులు ఎడమ కాల్వకు సాగునీటిని విడుదల చేశారు. ఇంకా మేజర్లు, డిస్టిబ్యూటరీలకు నీటి విడుదల షెడ్యూలును ప్రకటించలేదు.
దీంతో ప్రధాన కాల్వల్లో మినహా ఆయకట్టు చివరి భూములకు నీరు అందడం లేదు. ప్రధానంగా నాగార్జున సాగర్ వెనుక జలాలపై ఆధారపడి నిర్మించి ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఎ.ఎం.ఆర్.పి) కింద ఆయకట్టుకూ నీరందడం లేదు. సాగర్ నిండుగా ఉన్నప్పుడు ఏఎమ్మార్పీ లోని నాలుగు మోటార్లతో నీటిని ఎత్తిపోసి అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయరు (ఎ.కె.బి.ఆర్)లో నింపాలి.
ఏఎమ్మార్పీలోని 4 మోటార్లు నడిస్తే 6వందల క్యూసెక్కుల చొప్పున ఏకేబీఆర్ లోకి 2400 క్యూసెక్కులు వస్తాయి. కానీ, నాలుగింటిలో ఒక మోటార్ మరమ్మతుకు గురికావడంతో 18వందల క్యూసెక్కుల నీరు మాత్రమే లిఫ్ట్ చేస్తున్నారు.
ఏకేబీఆర్ నుంచి 600 క్యూసెక్కులు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు, ప్రధాన కాల్వ ద్వారా మరో 1000 క్యూసెక్కుల నీటిని జిల్లా కేంద్ర సమీపంలోని ఉదయ సముద్రం జలశాయన్ని నింపుతున్నారు. ప్రధాన కాల్వల్లో నీరు పారుతున్నా అది డిస్టిబ్యూటరీలకు ఎక్కడం లేదు. దాంతో పాటే వీటి కింద ఉన్న చెరువులకూ నీరు చేరడం లేదు.
రైతుల ఆందోళన ఎందుకు?
రెండు సంవత్సరాలుగా జిల్లాను వెంటాడిన వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలమట్టం దారుణంగా పడిపోయింది. అధికారిక సమాచారం మేరకే 250 మీటర్ల లోతులోకి భూగర్భ జలం పడిపోయింది. బోర్లు వేసిన రైతులూ నష్ట పోయారు.
జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన చెరువులు, చిన్న చెరువుల, కుంటలు తదితర నీటివనరులన్నీ పూర్తిగా ఎండిపోయాయి. ఈ సీజన్ లోనూ సైన వర్షాలు లేని కారణంగా ఒక్క చెరువు కూడా నిండలేదు. ఇపుడు నాగార్జున సాగర్ నిండుకుండను తలపిస్తోంది.
జలాశం నిండా నీరుండడం, ఎగువ నుంచి వరద ఎక్కువగా వస్తుండడంతో ప్రాజెక్టుకు ఉన్న మొత్తం 26 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలేస్తున్నారు. ఇదంతా సముద్రం పాలవుతోంది. ఏఎమ్మార్పీ కాల్వపై ఆధారపడి 2.20లక్షల ఆయకట్టు, సాగర్ లోలెవ్ కెనాల్ (ఎల్.ఎల్.సి) పై ఆధారపడి మరో 80 వేల ఎకరాలు మొత్తంగా... నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టుతో నిమిత్తం లేకుండా సాగర్ వెనుక జలాలతో ఏఎమ్మార్పీ, ఎల్.ఎల్.సిపై ఆధారపడిన ఆయకట్టు 3 లక్షల ఎకరాలు.
ప్రస్తుతం దీనికి సాగునీరు అందడం లేదు. ఈ కాల్వల కింద 200 చెరువులు సాగునీటి కోసం నోళ్లు తెరుచుకుని చూస్తున్నాయి. 36 డిస్టిబ్యూటరీల ద్వారా ఆయకట్టుకు నీరు అందాలి. అదే మాదిరిగా తాగునీరు అందాల్సిన 250 గ్రామాలు కూడా ఉన్నాయి. ఏఎమ్మార్పీ కాల్వల్లో సామర్ధ్యం మేరకు నీరు పారకపోవడం, కాల్వలకు గండ్లు పడడం, చెట్లు, పిచ్చి మొక్కలు పెరిగిపోయి మరమ్మతులకు నోచుకోక పోవడం వల్ల నీరు వరవడితో పారడం లేదు.
అరకొర నీరు వల్ల డిస్టిబ్యూటరీలకు ఎక్కడం లేదు. దీంతో ఆయకట్టు చివరి భూములు ఉన్న రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. ఇప్పటికి రెండు పర్యాయాలు, నార్కెట్ పల్లి - అద్దంకి ప్రధాన రహదారిపై రైతులు ధర్నాలకు దిగుతున్నారు. వరద కాల్వలకు నెల రోజుల కిందటే నీరు విడుదల చేసినా ఒక్క చెరువూ నిండిన పాపాన పోలేదు.
ఫలితంగా టెయిల్ ఎండ్ లో ఉన్న మాడ్గులపల్లి, దాచారం, చెరువుపల్లి, ఇందుగుల, కుక్కడం, మర్రిగూడెం తోపుచర్ల వంటి గ్రామాల రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. ఏకేబీఆర్లో 1.5 టిఎంసిల నీరుండాలి. కనీసం 1 టిఎంసి నిల్వ కూడా లేదు. అదే మాదిరిగా ఉదయసముద్రం జలాశయంలో 1.5 టిఎంసీల నీరుండాలి. కానీ, ప్రస్తుతం 0.5 టిఎంసీ మాత్రమే ఉంది.
దీంతో డిస్టిబ్యూటరీలకు నీటిని విడుదల చేయలేక పోతున్నారు. ఏఎమ్మార్పీ ద్వారా నేరుగా చెరువులు నింపాలన్న రైతుల డిమాండ్ అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధుల చెవికి ఎక్కడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. గురువారం నల్గొండ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన పలువురు రైతులు చెరువుల నింపాలని డిమాండ్ చేశారు.
( రిపోర్టింగ్: క్రాంతిపద్మ, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ ప్రతినిధి )