Visakha Railway Zone : నవంబర్ 12న విశాఖ రైల్వేజోన్ శంకుస్థాపన-mp vijaya sai reddy said visakha railway zone foundation on november 12 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Visakha Railway Zone : నవంబర్ 12న విశాఖ రైల్వేజోన్ శంకుస్థాపన

Visakha Railway Zone : నవంబర్ 12న విశాఖ రైల్వేజోన్ శంకుస్థాపన

HT Telugu Desk HT Telugu
Oct 28, 2022 07:02 PM IST

Visakha Railway Zone నవంబర్‌ 12న విశాఖ రైల్వే జోన్‌కు శంకుస్థాపన జరుగనుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. నవంబర్ 11,12 తేదీలలో విశాఖలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు.

నవంబర్ 12న రైల్వే జోన్‌కు శంకుస్థాపన అని ప్రకటించిన సాయిరెడ్డి
నవంబర్ 12న రైల్వే జోన్‌కు శంకుస్థాపన అని ప్రకటించిన సాయిరెడ్డి

Visakha Railway Zone రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం విశాఖ రైల్వేజోన్ నెరవేరే సమయం వచ్చేసిందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి చెప్పారు. ట్విటర్ వేదికగా శుక్రవారం పలు అంశాలు వెల్లడించారు. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటుకానున్న దక్షిణ కోస్తా రైల్వేజోన్ కు ప్రధాని మోదీ సీఎం జగన్మోహన్ రెడ్డితో కలిసి నవంబర్ 12న శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. దీంతోపాటు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారని అన్నారు. నవంబర్ 11, 12 తేదీల్లో విశాఖలో ప్రధాని పర్యటించనున్నారని అన్నారు.

విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటుపై రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి పోరాటాలు జరుగుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వేలో భాగంగా ఉన్న కోస్తా ప్రాంతాన్ని ప్రత్యేకంగా కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. దీనిపై ఒడిశా అభ్యంతరాల నేపథ్యంలో అడుగులు ముందుకు పడటం లేదు. కొత్త జోన్‌లో విశాఖ రైల్వే డివిజన్‌ విలీనంపై ఒడిశా అభ్యంతరాల నేపథ్యంలో కొన్నేళ్లుగా రైల్వే జోన్‌ ఏర్పాటు ముందుకు సాగడం లేదు. తాజాగా రైల్వే జోన్ ఏర్పాటుకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని విజయసాయిరెడ్డి ప్రకటించారు.

నెల్లూరు జిల్లాలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ 3వ యూనిట్ ను సీఎం జగన్ గారు జాతికి అంకితం చేశారని చెప్పారు. థర్మల్ పవర్ స్టేషన్‌కు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ 2008లో శ్రీకారం చుట్టగా, నేడు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పూర్తి సామర్థ్యంతో దాన్ని ప్రారంభించడం గొప్ప విషయమన్నారు.

టీడీపీ నేతలపై సాయిరెడ్డి విమర్శలు…

టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు గొలుసులు తెంపుకుని మళ్లీ విమర్శలకు దిగుతున్నారని మండి పడ్డారు.తెలుగు దొంగల పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లక్ష కోట్ల భూ ఆక్రమణలు జరిగాయని అన్న అయ్యన్న దమ్ముంటే వాటి సంగతి బయటపెట్టాలని డిమాండ్ చేశారు . అయ్యన్న పిచ్చి కూతలే అతడిని ఓడించాయని అయినా అయ్యన్నకు సిగ్గు రాలేదని మండిపడ్డారు.

కాకినాడలో ఐఐఎఫ్టీ తాత్కాలిక క్యాంపస్ ప్రారంభించిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సాయిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. క్యాంపస్‌కు శాశ్వత భవనం యుధ్ధ ప్రాతిపదికన పూర్తిచేయడానికి కామర్స్ మంత్రిత్వశాఖకు తగినంత నిధులు కేటాయించాలని కోరారు.

Whats_app_banner