Kishanreddy On lokesh: లోకేష్ పదేపదే అపాయింట్‌మెంట్ అడిగారన్న కిషన్ రెడ్డి
Kishanreddy On lokesh: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్ విషయంలో టీడీపీ నాయకుడు నారా లోకేష్ వ్యాఖ్యలను కిషన్ రెడ్డి ఎట్టకేలకు ఖండించారు. అమిత్ షా పిలిచి చంద్రబాబు అరెస్ట్ వ్యవహారాన్ని అడిగి తెలుసుకున్నారని లోకేష్ గతంలో చేసిన వ్యాఖ్యల్ని కిషన్ రెడ్డి తోసి పుచ్చారు.
Kishanreddy On lokesh: ఓ వైపు బీజేపీకి దగ్గర కావాలని ప్రయత్నిస్తునే తమదే పైచేయిగా ఉండాలని భావిస్తోన్న టీడీపీ ప్రయత్నాలపై బీజేపీ పెద్దలు అసహనంతో ఉన్నారు. తాజాగా కేంద్ర హోమంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్ విషయంలో లోకేష్ చేసిన వ్యాఖ్యలతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇరుకున పడాల్సి వచ్చింది. దీనిపై బీజేపీ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో కిషన్ రెడ్డి వివరణ ఇచ్చారు. అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం పదేపదే అడిగిన తర్వాతే అది ఖరారైందని చెప్పారు.
అమిత్‌షాను నారా లోకేష్ కలవడంలో తన పాత్ర లేదని కిషన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్న ఏకైక మంత్రి తానేనని కిషన్ గుర్తు చేశారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేష్ పలుమార్లు అమిత్‌షా, మోదీల అపాయింట్ మెంట్ కోరారని ఆ సమయంలో బీజేపీ పెద్దలు బిజీగా ఉన్నారని చెప్పారు. పార్లమెంటులో మహిళాబిల్లు, జి20 సమావేశాల నేపథ్యంలో అమిత్ షా అపాయింట్‌మెంట్ ఇవ్వలేకపోయారని, వీలు కుదిరినపుడు తానే పిలిపించుకుంటానని చెప్పారన్నారు. చివరకు తన ద్వారా లోకేష్‌కు సమాచారం అందించారని చెప్పారు.
రాజకీయాల్లో ఎవరు ఎవరినైనా కలుస్తారని, కాంగ్రెస్ వారిని కూడా తాము కలుస్తామని కిషన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. అమిత్ షా.. టీడీపీ నాయకుడు లోకేష్‌ను కలవడంలో ఎలాంటి ప్రత్యేకత లేదని, హోంమంత్రిగానే అమిత్‌షా లోకేష్‌ను కలిశారని చెప్పారు.
అమిత్ షా తన బిజీ షెడ్యూల్ కారణంగా తొలుత లోకేశ్‌ను కలవలేదని చెప్పారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్న ఏకైక కేంద్రమంత్రిని తానే అని, దీంతో ఆ సమావేశానికి తాను కూడా హాజరయ్యానని చెప్పారు. అమిత్‌షా భేటీ తర్వాత తాను అపాయింట్‌మెంట్ కోరలేదని, తనకు కిషన్ రెడ్డి నుంచి ఫోన్ వచ్చిందని, అమిత్ షా తనను కలుస్తానని చెప్పినట్లు ఫోన్ చేసి చెప్పారని నారా లోకేశ్ చెప్పారు.
ఏం జరిగిందంటే….
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్టైన తర్వాత సెప్టెంబర్ 14 నుంచి లోకేష్ ఢిల్లీలోనే ఉంటున్నారు.న్యాయవాదులతో సంప్రదిస్తున్నారు. ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టులో జరుగుతున్న విచారణలపై న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ పెద్దల్ని కలిసేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరిగినా లోకేష్ వాటిని ఖండించారు. ఈ క్రమంలో అక్టోబర్ 11న సిఐడి విచారణకు వచ్చిన లోకేష్ అదే రోజు సాయంత్రం హుటాహుటిన ఢిల్లీ బయల్దేరి వెళ్లారు.
ఆ రోజు రాత్రి పొద్దుపోయిన తర్వాత అమిత్‌షాతో లోకేష్ భేటీ అయ్యారు. ఈ భేటీలో లోకేష్‌తో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉన్నారు. అమిత్‌షాతో భేటీ ముగిసిన వెంటనే ఆ విషయాన్ని పురంధేశ్వరి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఆ తర్వాత నారా లోకేష్ ఫోటోలను విడుదల చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా, అమిత్‌షాతో భేటీపై గురువారం ఢిల్లీలో మాట్లాడిన లోకేష్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద్వారా తనకు సమాచారం అందినట్టు వెల్లడించారు.
అమిత్ షాతో జరిగిన భేటీ విషయంలో పెద్దమ్మ ప్రమేయం ఎందుకు ఉండాలనుకున్నారో, మరో కారణం ఏమైనా ఉందో కాని కిషన్ రెడ్డి పేరును బయటపెట్టడంతో ఆయన ఇరకాటంలో పడ్డారు.కొద్ది రోజులుగా ఒకప్పటి బీజేపీ అగ్రనేతల సహకారంతో అమిత్‌షా అపాయింట్‌మెంట్ కోసం లోకేష్ ప్రయత్నిస్తున్నాడని పొలిటికల్ సర్కిల్స్ విస్తృత ప్రచారం జరిగింది. సొంత సామాజిక వర్గానికి మాజీ కేంద్ర మంత్రి సాయంతో బీజేపీ పెద్దల్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇందుకు ప్రస్తుత కేంద్ర మంత్రి ఒకరు సాయపడ్డారని ప్రచారం జరిగింది.
ఈ క్రమంలో కిషన్ రెడ్డి ద్వారా అమిత్‌షా అపాయింట్‌మెంట్ లభించినట్టు లోకేష్ వెల్లడించడంతో ఆయన ఇరకాటంలో పడ్డారు. 11వ తేదీ మధ్యాహ్నం వరకు కిషన్ రెడ్డి మేడారంలో ఉన్నారని ఆయన కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి.కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గిరిజన యూనివర్శిటీకి సంబంధించిన కార్యక్రమంలో భాగంగా మేడారం పర్యటనలో ఉన్న కిషన్ రెడ్డికి ఢిల్లీ రావాల్సిందిగా సమాచారం వచ్చినట్టు చెబుతున్నారు.
లోకేష్ అపాయింట్ మెంట్ వ్యవహారంలో కేంద్రమంత్రి ప్రమేయం లేదని అప్పట్లోనే ఆయన కార్యాలయం స్పష్టం చేసింది. తాజాగా కిషన్ రెడ్డి కూడా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
సంబంధిత కథనం