YS Jagan: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసమే “జగనన్నకు చెబుదాం”
YS Jagan: అర్హత ఉండి పథకాలు రాని పరిస్థితులు ఉన్నా, న్యాయం ప్రజల వైపున ఉన్నా, న్యాయం జరగని పరిస్థితులు ఉన్నా, ప్రయత్నం చేసినా సత్ఫలితం ఇవ్వని పరిస్థితులు ఉంటే ప్రభుత్వ సేవలకు సంబంధించి మెరుగైన పరిష్కారం చూపేలా నేరుగా మీ జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చామని సిఎం జగన్ ప్రకటించారు.
YS Jagan: ప్రభుత్వ సేవలకు సంబంధించి వ్యక్తిగత సమస్యలకు మరింత మెరుగైన పరిష్కారం చూపేందుకు పుట్టుకొచ్చిన ఆలోచనతో "జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చినట్లు సీఎం జగన్ తెలిపారు. తాడేపల్లి సిఎం క్యాంపు కార్యాలయంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని సిఎం లాంఛనంగా ప్రారంభించారు.
జగనన్నకు చెబుదాం కార్యక్రమం మిగతా కార్యక్రమాలకంటే భిన్నమైనదని, ప్రతి సమస్యకు పరిష్కారం చూపేందుకు నాలుగు ఏళ్ల పాలన సాగిందని సిఎం తెలిపారు. 3648 కి.మీ పాటు సాగిన పాదయాత్రలో ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాల్లో కనిపించిన సమస్యలకు పరిష్కారం వెతికే క్రమంలో అడుగులు వేస్తూ నాలుగేళ్లుగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.
చాలా వరకు సమస్యలు అన్నీ మానవ తప్పిదాలేనని, ప్రభుత్వం పలకాల్సిన పరిస్థితుల్లో పలికితే, ప్రభుత్వం న్యాయంగా, ధర్మంగా ఉంటే ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం అవుతాయని పాదయాత్రలో కనిపించిందన్నారు. ఈ పద్ధతిలో ప్రభుత్వం లేకపోతే 90 నుంచి 95శాతం సమస్యలు వస్తాయన్నారు.
పింఛన్లు రాలేదని పాదయాత్రలో నా దగ్గరకు వచ్చేవారని, జన్మభూమి కమిటీలు చెబితే కాని పెన్షన్లు ఇవ్వని పరిస్థితి ఆనాడు ఉండేదన్నారు. మీరు ఏ పార్టీకి సంబంధించిన వారని అడిగేవారని, ప్రతి పనికి నాకెంత ఇస్తావు అని అడిగే గుణం ఉండేదన్నారు.
పెన్షన్ల దగ్గర నుంచి ఇళ్ల కేటాయింపులు వరకూ ఇదే పరిస్థితి ఉండేదన్నారు. ఏ ప్రభుత్వ పథకం తీసుకున్నా, ప్రతి అడుగులోనూ వివక్ష, లంచాలు కనిపించేవని చెప్పారు. తాము ఇవ్వగలిగింది ఇంతేనని, ఊర్లో ఇంత మందికే ఇస్తామని చెప్పేవారని, ఎవరైనా తప్పుకుంటేనో, చనిపోతేనే మిగతావాళ్లకి వచ్చే పరిస్థితి ఉండేదన్నారు. సుదీర్ఘ పాదయాత్రలో ఇవన్నీ చూశానని చెప్పారు.
అర్హత ఉన్నవాళ్లు ఎంతమంది ఉంటే, అంతమందికి ఇవ్వడం, తన పార్టీ, వేరే పార్టీని చూడకుండా ఇవ్వడం, వివక్ష లేకుండా ఇవ్వడం, లంచాలు లేకుండా ఇవ్వడం, సంతృప్తి స్థాయిలో ఇవ్వడం, గ్రామస్థాయిలో ఇవ్వగలిగితే.. అన్ని పరిష్కారాలూ దొరుకుతాయని పరిపాలనలో మార్పులు తీసుకు వచ్చామని జగన్ తెలిపారు.
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చామని, వ్యవస్థల్లోకి లంచాలు, వివక్షలేని గొప్ప మార్పులను తీసుకు వచ్చామని చెప్పారు. రైతు భరోసాకేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, ఆస్పత్రుళ్లలో వైద్యసేవలు, పిల్లలు చదువుతున్న స్కూళ్లు, ఇతరత్రా ఎదుర్కొంటున్న సమస్యలు ప్రజలకు మరింత చేరువగా పరిపాలనను తీసుకువచ్చేలా ఈ నాలుగేళ్లలో అడుగులు పడ్డాయని ముఖయమంత్రి తెలిపారు.
దేశంలో కూడా ఎక్కడా జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా మార్పులు తీసుకు వచ్చామని, ఇందులో భాగంగా ఇప్పటికే స్పందన అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చామని, గ్రామ సచివాలయాలనుంచి కలెక్టర్ల వరకూ ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయ్యారన్నారు. దీనికోసం ఒక యంత్రాంగాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చామని, ప్రజలకు హక్కుగా అందాల్సిన సేవలను బాధ్యతగా అందించేలా, ఎలాంటి జాప్యంలేకుండా చూడగలిగామని చెప్పారు.
న్యాయంగా వారికి రావాల్సింది రాకపోతే ఎలాంటి బాధ అనుభవిస్తారో తెలిసిన ప్రభుత్వంగా అడుగులు ముందుకు వేశామన్నారు. సమస్యలకు పరిష్కారాలు చూపించేలా స్పందన ద్వారా అడుగులు వేశామని, దానికి మరింత మెరుగ్గా చేయాలనే ఉద్దేశంతో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెెప్పారు.
అర్హత ఉన్నా పథకాలు రాని పరిస్థితులు ఉన్నా, న్యాయం ప్రజల వైపున ఉన్నా, న్యాయం జరగని పరిస్థితులు ఉన్నా, ప్రయత్నం చేసినా సత్ఫలితం ఇవ్వని పరిస్థితులు ఉంటే ప్రభుత్వ సేవలకు సంబంధించి వ్యక్తిగత సమస్యలకు మరింత మెరుగైన పరిష్కారం చూపేలా తపన, తాపత్రయంతో నేరుగా మీ జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని తీసుకు వచ్చామన్నారు.
మారుమూల గ్రామాల నుంచి జిల్లా స్థాయి వరకూ అన్ని స్థాయిల్లో అందర్నీ భాగస్వాములను చేస్తున్నాంమని, జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమం ద్వారా కొన్ని మెరుగులు తీసుకువచ్చామని వివరించారు. సమస్యకు పరిష్కారం చూపించేటప్పుడు అర్జీదారుకి సంతోషాన్ని కలిగించేలా, ఆ మనిషి ముఖంలో చిరునవ్వులు చిందించాలన్న తపన, తాపత్రయంతో ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దామని చెప్పారు.
నాణ్యతతో సమస్యల పరిష్కారానికి వేదికగా నిలుస్తుందని, ప్రభుత్వ సేవలకు సంబంధించి వ్యక్తిగత సమస్యలకు మెరుగైన పరిష్కాం చూపించడానికి వేదిక అన్నారు. ఏదైనా సమస్య ఉన్నప్పుడు అందుబాటులో ఉన్న వ్యవస్థలద్వారా గట్టిగా ప్రయత్నం చేయాలన్నారు.
ఇలా చేసిన తర్వాత కూడా మనవైపు న్యాయం ఉండి… న్యాయం జరగని పరిస్థితి ఉన్నా, అర్హత ఉన్నా కూడా రాని పరిస్థితులు ఉన్నా, ప్రయత్నం చేసినా కూడా సత్ఫలితం రాని పరిస్థితులు ఉన్నా, అప్పుడు జగనన్నకు చెబుదాం అనే ఈ కార్యక్రమం ఉపయోగపడేలా నేరుగా జగనన్నకే చెబుదాం అన్నది కార్యక్రమం సారాంశం అన్నారు.
అర్హత ఉన్న ప్రభుత్వ సేవలు అందకపోయినా, పథకాలు అందకపోయినా, ఆరోగ్యశ్రీ, పెన్షన్ కానుక, భూమి రికార్డులు… ఇలా ఎలాంటి సేవ అయినా.. మన ప్రయత్నంచేసినప్పటికీ కూడా మనకు ఫలితాలు రాని పక్షంలో నేరుగా జగన్‌కు ఫోన్ చేయొచ్చని చెప్పారు. 1902కు ఫోన్ కొడితే… నేరుగా సీఎంఓకే ఫోన్ వస్తుందని, పరిష్కారం ఈ స్థాయిలో చూపించే గొప్ప ఆలోచనకు అడుగులు వేస్తున్నామని సిఎం జగన్ తెలిపారు. ప్రజలు ప్రయత్నంచేసినా పరిష్కారం కాని సమస్యలు నేరుగా తన దృష్టికే వస్తాయన్నారు.
ప్రజలు తమ ఫిర్యాదులపై ఫోన్ చేశాక వైయస్సార్ రిఫరెన్స్ ఐడీ నంబర్ వస్తుందని, ప్రజా ఫిర్యాదుకు అంత గౌరవం ఇస్తూ వైయస్సార్ పేరు పెట్టామని చెప్పారు. ప్రజల సమస్యను తమ సమస్యగా భావించి దాన్ని ట్రాక్ చేస్తామన్నారు. నేరుగా సీఎంఓనే ఫిర్యాదును ట్రాక్ చేస్తుందని, ప్రతి అడుగులో కూడా ఎస్‌ఎంఎస్‌ద్వారా, ఐవీఆర్‌ఎస్‌ద్వారాఫిర్యాదు పరిష్కారంపై ఎప్పటికప్పుడు మెసేజ్‌లు, సందేశాలు వస్తాయన్నారు.
ఫిర్యాదుల పరిష్కారం కోసం మండలాలు, జిల్లాలు, రాష్ట్ర సచివాలయాల్లో, సీఎంఓలో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లు పెట్టామన్నారు. సీఎంఓ, సీఎస్, డీజేపీ.. ముగ్గురు సమీక్షలు చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు బలంగా నడుపుతారని చెప్పారు.
ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లలో ప్రతి చోట సమస్య పరిష్కారాన్ని మానిటరింగ్ చేస్తారని పరిష్కారం చూపేలా అడుగులు ముందుకు వేస్తారని వివరించారు. సమస్య పరిష్కారం అయ్యాక, ఫోన్‌చేసి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారన్నారు.