Rain Alert To Andhra : ఐఎండీ అలర్ట్.. నవంబర్ 22, 23 తేదీల్లో భారీ వర్షాలు
Weather Update : రానున్న రెండు రోజుల్లో దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
ఏపీలో మరికొన్ని రోజులు వర్షాలు కురవనున్నాయి. నవంబర్ 22, 23 తేదీల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం ఆనుకుని అల్పపీడనం ఏర్పడిందని IMD పేర్కొంది. నవంబర్ 22, 23 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని నివేదిక పేర్కొంది. రాగల రెండు రోజుల్లో దక్షిణ కోస్తా ఆంధ్రాలో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండగా, రాయలసీమలో నవంబర్ 21 నుండి మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
IMD నవంబర్ 23 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈశాన్య రుతుపవనాలు దక్షిణ-కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమపై బలహీనంగా ఉన్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు జిల్లాలు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాలకు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం చెన్నైకి 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నందున ఆయా జిల్లాల ప్రజలు, రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వాయుగుండం మరికొన్ని గంటల్లో తమిళనాడు నుంచి దక్షిణ కోస్తా వైపు వెళ్లే అవకాశం ఉందని దీని ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లోనూ వర్షాలు కురుస్తాయని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. పిడుగులతో కూడిన వర్షాల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టుప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు చెట్ల కింద నిలబడవద్దని విజ్ఞప్తి చేశారు.
తీర ప్రాంతాలకి దగ్గరగా ఉన్న ప్రాంతాలైన సూళూరుపేట, కృష్ణపట్నం ఇలాంటి భాగాల్లో కాస్త భారీగా వర్షాలుంటాయని నిపుణులు హెచ్చరిస్తన్నారు. అల్పపీడనం బలపడుతూ బలపడుతూ వాయుగుండం, తీవ్ర వాయుగుండంగా మారి మన రాష్ట్రం తీరం వైపుగా రానుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత పొడిగాలుల ప్రభావంతో బలహీనపడుతుందని భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు మధ్య ఆంధ్ర జిల్లాల్లో తక్కువగా వర్షాలుండొచ్చు.
సంబంధిత కథనం