Rain Alert AP: మరో అల్పపీడనం... ఏపీకి భారీ వర్ష సూచన!
Rains in Andhrapradesh: గురువారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
Weather Updates of Andhrapradesh: నైరుతి బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాలను ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో బంగాళాఖాతంలో నవంబర్ 10న అల్పపీడనం ఏర్పడనుందని తెలిపింది. ఫలితంగా ఈ నెల 11, 12 తేదీల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది.
అల్పపీడనం ఫలితంగా కోస్తా తీరం వెంబడి గంటకు 45–55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఫలితంగా సముద్రం అలజడిగా మారుతుందని... మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది.
ఏపీ వెదర్ మ్యాన్ వివరాల ప్రకారం....
అల్పపీడనం ప్రభావంతో నవంబర్ 11 నుంచి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయని తెలిపింది. అత్యధిక వర్షాలు తిరుపతి, నెల్లూరు జిల్లాల మీదుగా ఉంటాయని పేర్కొంది. నవంబర్ 11, 12 మరియు 13 తేదీలల్లోనే భారీ వర్షాలు ఉంటాయని వివరించింది.
నవంబర్ 12 నుంచి తర్వాత.. తిరుపతి, నెల్లూరు జిల్లాలతో పాటు కడప, అన్నమయ్య, చిత్తూరు, బాపట్ల జిల్లా (కోస్తా భాగాలు మాత్రమే), ప్రకాశం జిల్లాలోని దక్షిణ భాగాల మీదుగా వర్ష ప్రభావం ఉంటుందని పేర్కొంది. నవంబర్ 14 - 16 మధ్య వర్షాల ప్రభఊావం తగ్గుతుందని చెప్పింది. రాష్ట్రంలోని మిగిలిన అన్ని ప్రాంతాల్లో తక్కువగా వర్షాలుంటాయని.. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో మాత్రం తేలికపాటి తుంపర్లు, కొద్ది సేపు వర్షాలు మాత్రమే ఉంటాయని స్పష్టం చేసింది.
మరోవైపు ఈ అల్పపీడనం ప్రభావం విశాఖపట్నం, విజయవాడ నగరాలపై ఉండకపోవచ్చని అభిప్రాయపడింది. తేలికపాటి వర్షాలు కురిసినప్పటికీ... భారీ వర్షాలు ఉండవని తెలిపింది.