Tirupati: తిరుప‌తి జిల్లాలో మ‌ట్టి మాఫియా.. యథేచ్ఛ‌గా త‌వ్వ‌కాలు.. పట్టించుకోని అధికారులు-illegal soil mining in chandragiri mandal in tirupati district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirupati: తిరుప‌తి జిల్లాలో మ‌ట్టి మాఫియా.. యథేచ్ఛ‌గా త‌వ్వ‌కాలు.. పట్టించుకోని అధికారులు

Tirupati: తిరుప‌తి జిల్లాలో మ‌ట్టి మాఫియా.. యథేచ్ఛ‌గా త‌వ్వ‌కాలు.. పట్టించుకోని అధికారులు

HT Telugu Desk HT Telugu
Aug 30, 2024 12:47 PM IST

Tirupati: తిరుపతి జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అడ్డూఅదుపు లేకపోవడంతో అక్రమార్కులు కొండలను మింగేస్తున్నారు. రాత్రి, పగలూ లారీలు, ట్రాక్టర్లలో మట్టిని తరలించి కాసులు దండుకుంటున్నారు. వీరివైపు అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి.

తిరుపతి జిల్లాలో మట్టి మాఫియా
తిరుపతి జిల్లాలో మట్టి మాఫియా

తిరుప‌తి జిల్లాలో చంద్ర‌గిరి మండ‌లంలో మ‌ట్టి మాఫియా రెచ్చిపోతోంది. కొండ‌ల‌ను నేల‌గా మార్చేస్తున్నారు. అధికార యంత్రాంగాన్ని గుప్పెట్లో పెట్టుకొని అక్రమ మట్టి దందా సాగిస్తున్నారు. తాటికోన ఎస్టీ కాల‌నీ స‌మీపంలో గ్రావెల్ మ‌ట్టిని అక్ర‌మంగా త‌వ్వుతున్నారు. జేసీబీ, హిటాచీతో త‌వ్వ‌కాలు నిర్వ‌హించి.. ట్రాక్టర్లు, లారీల్లో త‌ర‌లిస్తున్నారు. రాత్రీ, పగలు తేడా లేకుండా యథేచ్ఛగా మట్టి అక్ర‌మ త‌వ్వ‌కాలు జ‌రుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

స్థానికుల ఫిర్యాదుతో..

స్థానికుల ఫిర్యాదుతో.. ఎట్టలేకలకు అధికారుల్లో చ‌ల‌నం వ‌చ్చింది. పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా.. అక్ర‌మంగా మ‌ట్టి త‌వ్వకాలు చేస్తున్న ప్రాంతానికి ఇద్ద‌రు వీఆర్‌వోలు, ముగ్గురు కానిస్టేబుళ్లు వెళ్లారు. నాలుగు ట్రాక్ట‌ర్లు, ఒక జేసీబీ, ఒక హిటాచీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు ట్రాక్ట‌ర్ల‌ను, లారీని వ‌దిలేసిన‌ట్లు తెలుస్తోంది. తూతూ మంత్రంగా రూ.5 వేలు చొప్పున‌ జ‌రిమానాలు విధించి చేతులు దులుపుకున్న‌ట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

డీటీ బంధువులకు 10 టిప్పర్ల మట్టి..

నాలుగు రోజులుగా గ్రావెల్ మ‌ట్టి త‌వ్వ‌కాలు జ‌రుగుతున్నాయి. రెండు ఎక‌రాల భూమిలో త‌వ్వ‌కాలు జ‌రిన‌ట్లు తెలుస్తోంది. గ్రావెల్ మ‌ట్టి త‌వ్వ‌కాలు చేప‌ట్టిన వారు.. డిప్యూటీ తహశీల్దార్ బంధువుల‌కు ఉచితంగా ప‌ది లారీలు (టిప్ప‌ర్ లోడు) తరలించిన‌ట్లు స్థానికులు చెబుతున్నారు. డిప్యూటీ తహశీల్దార్ ఆదేశాలతోనే వాహనాలను వదిలేశారంటూ ప్రజలు ఆగ్రహం వ్య‌క్తం చేస్తోన్నారు.

అప్పుడూ.. ఇప్పుడూ అంతే..

ప్ర‌భుత్వాలు మారినా.. మ‌ట్టి, ఇసుక మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. గ‌త వైసీపీ ప్ర‌భుత్వంలో మ‌ట్టి, ఇసుక మాఫియాపైనే ఎక్కువ విమ‌ర్శ‌లు చేసిన టీడీపీ, జ‌న‌సేన, బీజేపీ నేత‌లు.. ఇప్పుడు కూట‌మి ప్ర‌భుత్వంలో కూడా గ్రావెల్‌, మ‌ట్టి, ఇసుక మాఫియా యాథేచ్ఛ‌గా త‌మ కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్నాయి. వాటిని క‌ట్ట‌డి చేయ‌డంలో ప్ర‌భుత్వం విఫలం అయ్యిందనే విమర్శలు ఉన్నాయి.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner