IBPS Clerical: ఐబిపిఎస్ క్లరికల్ నోటిఫికేషన్ వచ్చేసింది,దరఖాస్తు చేసుకోండి ఇలా..
IBPS Clerical: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లరికల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఐబిపిఎస్ కామన్ రిక్రూట్‌మెంట్ ప్రోగ్రాం-14 షెడ్యూల్ విడుదలైంది. జూలై1 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.
IBPS Clerical: నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే ఐబిపిఎస్ క్లరికల్ రిక్రూట్‌మెంట్ షెడ్యూల్ విడుదలైంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లరికల్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఐబిపిఎస్ సిర్పీ-14 షెడ్యూల్‌ను విడుదల చేశారు.
ఐబిపిఎస్‌లో భాగస్వామ్యులైన ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు తాజా నోటిఫికేషన్ విడుదలైంది. ఐబిపిఎస్ తాజా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల వివరాలను రాష్ట్రాల వారీగా అందుబాటులో ఉన్న ఖాళీలను నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు తక్కువగానే ఉండటంతో ఈసారి పోటీ తీవ్రంగా ఉండనుంది.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు IBPS అధికారిక వెబ్‌సైట్ https://www.ibps.in/ లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్షల నిర్వహణ మరియు తాత్కాలిక కేటాయింపు ప్రక్రియ, అర్హత ప్రమాణాలు, ఆన్‌లైన్ నమోదు ప్రక్రియలు, నిర్దేశిత దరఖాస్తు రుసుము / సమాచార రుసుము చెల్లింపు, పరీక్ష విధానం, కాల్ లెటర్‌ల జారీ మొదలైనవి జాగ్రత్తగా చదివిన తర్వాత దరఖాస్తు చేసుకోవాలి మరియు నిర్ణయించబడిన ప్రమాణాలను పూరించడానికి మరియు నిర్ణయించిన ప్రక్రియలను అనుసరించడానికి ఖచ్చితంగా పాటించాలి.
ఐబిపిఎస్ క్లరికల్ సిఆర్పీ షెడ్యూల్...
- 2024 జూలై1వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తుల ఎడిట్ అవకాశం కల్పిస్తారు.
- జూలై 1నుంచి 21వ తేదీ వరకు ఫీజు చెల్లింపుకు అవకాశం ఉంటుంది.
- ఆగష్టు 12 నుంచి 17వ తేదీ వరకు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఇస్తారు.
- ఆగష్టులో ఆన్‌లైన్‌లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు.
- సెప్టెంబర్ ప్రాథమిక పరీక్షల ఫలితాలు వెలువరిస్తారు.
- 2024 సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మెయిన్స్ పరీక్షల హాల్ టిక్కెట్లను జారీ చేస్తారు. అక్టోబర్‌లో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. 2025 నాటికి ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తారు. ఐబిపిఎస్ క్లరికల్ రిక్రూట్‌మెంట్‌లో ప్రాథమిక పరీక్షల్ని ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ పద్ధతిలో నిర్వహిస్తారు.
- దరఖాస్తు చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్‌లో కనీస పరిజ్ఞానం ఉండాలి. రక్షణ బలగాల్లో పనిచేసిన వారు కనీసం 15ఏళ్ల సర్వీసుతో పాటు సంబంధిత కోర్సులు పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు ఎంచుకున్న రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషలో పరిజ్ఞానం ఉండాలి.
పరీక్ష ఫీజు..
క్లరికల్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైన అభ్యర్థులు రూ.175 చెల్లిచాల్సి ఉంటుంది. ఇతరులు రూ.850 చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష ఫీజులు ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది.
పరీక్ష విధానం...
ప్రాథమిక పరీక్షను 100మార్కులకు నిర్వహిస్తారు. గంట వ్యవధిలో పరీక్ష పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్‌లలో పరీక్ష ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఇంగ్లీష్‌కు 30మార్కులు, మిగిలిన సబ్జెక్టులకు 35 చొప్పున ఉంటాయి. ఐబిపిఎస్ నిర్దేశిత కటాఫ్ మార్కులు సాధించిన వారికి మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షలో 200 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ ఆప్టిట్యూడ్,క్వాంటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటాయి. పరీక్ష కేంద్రాల జాబితా రాష్ట్రాల వారీగా నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 105 ఖాళీలను తాజా నోటిఫికేషన్‌లో భర్తీ చేయనున్నారు. బ్యాంకుల వారీగా ఖాళీలు రిజర్వేషన్ల వివరాలు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కర్ణాటకలో 45 పోస్టులను భర్తీ చేయనున్నారు. క్లరికల్ ఉద్యోగాలకు స్థానిక భాషలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాలకు దరఖాస్తు చేసుకునే వారు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలో 104 ఖాళీలు ఉన్నాయి.
తాజా రిక్రూట్‌మెంట్‌లో పాల్గొంటున్న బ్యాంకులు ఇవే…
బ్యాంక్ ఆఫ్ బరోడా, కేనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూసీ ఓ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ & సింధ్ బ్యాంక్ లలో ఉద్యోగాలను తాజా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు.
అభ్యర్థులు అధికారిక IBPS వెబ్‌సైట్ https://www.ibps.in/ ని వివరాలు మరియు నవీకరణల కోసం క్రమం తప్పకుండా సందర్శించాలని సలహా ఇస్తున్నారు.