Rains | రానున్న 2 రోజుల్లో ఏపీలో వర్షాలు.. బంగాళాఖాతంలో అల్పపీడనం
బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో రానున్న మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మత్సకారులను వేటకు వెళ్లొద్దని సూచించారు.
మూడు నెలల క్రితం భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్‌లో పలు రాష్ట్రాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ మధ్య కాస్త వర్షాల నుంచి కాస్త ఉపశమనం కలిగింది. అయితే తాజాగా వాతావరణ శాఖ మరోసారి ఆంధ్రప్రదేశ్‌కు హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, వచ్చే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ.. తమిళనాడు తీరానికి దగ్గరగా వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు.
అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 4వ తేదీ నుంచి రాయలసీమ, కోస్తాంద్ర తీర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలో చాలా చోట్ల వర్షాలు కురవనున్నాయి. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలులు వీచే అవకాశముంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు సూచించారు.
వేటకు వెళ్లొద్దని సూచన..
మత్సకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే సముద్రం లోపలకు వేటకు వెళ్లినవారు వీలైనంత త్వరగా తీరానికి చేరుకోవాలని సూచించారు. గతేడాది నవంబరులో కురిసిన భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గత నవంబరులో చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల్ల్లో వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. వాయుగుండం కారణంగా నాలుగు జిల్లాల్లో 24 మంది మృతి చెందారు. వేల ఏకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. పునరవాస శిభిరాల్లో ఉన్నవారికి ప్రభుత్వం కుటుంబానికి రూ.2 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించింది.