Kodali Nani On Viveka Murder : వివేకాను చంపితే దినం ఖర్చు తప్పఏమి లాభం….
Kodali Nani On Viveka Murder ముఖ్యమంత్రి చిన్నాన్న,మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోతే దినం ఖర్చులు, కాఫీ,టీ ఖర్చులు తప్ప ఏమి లాభం ఉంటుందని మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకా చనిపోతే ఆ ఆస్తులు ఏమి జగన్‌కు రాలేదని, వివేకానందరెడ్డి జగన్‌తో కలిసి నడిచిన మనిషేమి కాదన్నారు. వైఎస్.విజయమ్మను కాంగ్రెస్ పార్టీ తరపున ఓడించేందుకు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kodali Nani On Viveka Murder వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై టీడీపీ నేతలు జగనాసుర రక్త చరిత్ర పేరుతో పుస్తకాన్ని ప్రచురించడంపై మాజీ మంత్రి కొడాలి నాని ఘాటుగా స్పందించారు. వివేకానంద రెడ్డిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వివేకా చనిపోతే దినం ఖర్చులు, కాఫీ, టీ ఖర్చులు తప్పితే ఏం లాభం ఉంటుందన్నారు. వైఎస్ వివేకా చనిపోతే ఆస్తులు ఎవరికెళ్లాయని, జగన్మోహన్ రెడ్డికి ఏమి రాలేదు కదా అని ప్రశ్నించారు.
వైఎస్ జగన్ కుటుంబం సర్వనాశనం కోరుకునే వ్యక్తులు, వైఎస్ వివేకా కుటుంబంలో ఉన్నారని, వైఎస్ భాస్కర్ రెడ్డి కుటుంబమే జగన్ వెంట నడిచారన్నారు. భాస్కర్ రెడ్డి కుటుంబానికే జగన్ టిక్కెట్టిస్తారని, టిక్కెట్ ఎవరికివ్వాలో జగన్ ఇష్టమని కొడాలి నాని తేల్చేశారు.
టీడీపీ నేతలు వివేకాపై కాదు..."ఎన్టీఆర్‌ను తడిగుడ్డతో గొంతు ఎలా కోశారు" అన్న పుస్తకం వేయాలని సూచించారు. చంద్రబాబు వేసిన పుస్తకం చలిమంటకు కూడా పనికి రాదని, మామను చంపితే చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి, పార్టీ అధ్యక్ష పదవి వచ్చిందని, వివేకా ఆస్తులు.. కూతురు, అల్లుడి పేరుమీదకు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.
రాష్ట్రంలో 9 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయని, అవన్నీ మేమే గెలుచుకుంటామని నాని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకనటువంటి పరిస్థితి ఉందని, మూడు పట్టభద్రుల నియోజకవర్గాలు, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఎన్నికలు ఉన్నాయని, వీటిలో కూడా ఎట్టిపరిస్థితుల్లో గెలవాలని మాకు దిశానిర్ధేశం చేశారన్నారు. సమన్వయ కర్తలు, జిల్లా అధ్యక్షులు దీనిపై దృష్టి పెట్టాలన్నారు.
ప్రజలకు సంబంధం లేని ఎన్నికలైనా మనం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సిఎం చెప్పారన్నారు. గడప గడపకు వెళ్తున్న నేపథ్యంలో 175 నియోజకవర్గాలు గెలిచేలా ప్రతి ఒక్క ఎమ్మెల్యే పని చేయాలని సూచించినట్లు కొడాలి నాని తెలిపారు. కొంత మంది కొంత తక్కువగా తిరుగుతున్న నేపథ్యంలో దాన్ని కూడా సరిచేసుకోవాలని చెప్పారని, ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేనపథ్యంలో 175కి 175 నియోజకవర్గాల్లో గెలవాలని ముఖ్యమంత్రి గారు దృఢ నిశ్చయంతో ఉన్నారన్నారు. పోటీ చేసే వారు, ఉన్న ఎమ్మెల్యేలు దీనిపై పూర్తి స్థాయి దృష్టి పెట్టాలని సూచించినట్లు వివరించారు.
175 సీట్లు గెలవడానికి నూటికి నూరు శాతం అవకాశం ఉందని, 175కి 175 సీట్లు గెలిచి చూపిస్తామని కొడాలి నాని విశ్వాసం వ్యక్తం చేశారు. మార్చి 18 నుంచి 26 వరకు జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇప్పటికే గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు నియామకం చేపట్టినట్లు వివరించారు. వైసీపీ హాయాంలో ఎటువంటి మార్పులు చేపట్టామో ప్రజల్లోకి తీసుకెళ్లామనేది గృహ సారథులు ప్రతి ఒక్క కుటుంబానికి వివరిస్తారన్నారు.
వైసీపీని స్థాపించింది ఎవరు…?
వైసీపీని జగన్మోహన్‌రెడ్డి పెడితే.. వివేకానందరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండి... విజయమ్మ గారిపైనే పోటీ చేశారని గుర్తు చేశారు. వివేకానంద రెడ్డి గారి లాంటి మంచి మనిషిని, మనసున్న నాయకుడిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుందన్నారు. వివేకా ఆస్తులు కూతురు, అల్లుడి పేరు మీదకు ఎలా వచ్చాయని, ఆయన చనిపోయిన రోజుకి వివేకా పేరున ఐదుపైసలు ఆస్థి ఉందా అని ప్రశ్నించారు. ఆయన ఆస్థి మొత్తం కూతురు, భార్య, అల్లుడి పేర్ల మీద ఎలా బదిలీ అయ్యాయని ఎందుకు ఆ ఆస్తులన్నీ బదిలీ అయ్యాయో తెలియాలన్నారు.
చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి, కేసును తారుమారు చేస్తాడని సీబీఐ విచారణ కోరామని చెప్పారు. ప్రభుత్వం వచ్చాక మేం విచారించుకుంటాం అని సీబీఐ విచారణ వద్దన్నామని, సీబీఐ ఊళ్లోకి రావద్దంటూ చెప్పింది, జీవో ఇచ్చింది చంద్రబాబేనన్నారు. సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా వివేకానందరెడ్డి ని చంపించింది చంద్రబాబే అని అనుమానం తమకు ఉందన్నారు.
మరోవైపు కొడాలి నాని వ్యాఖ్యలకు టీడీపీకూడా కౌంటర్ ఇచ్చింది. వివేకా హత్యపై ఏదేదో మాట్లాడుతున్నారని, జగనాసుర రక్త చరిత్ర పుస్తకంపై ఓపెన్ డిబేట్‍కు రెడీ అని వర్ల రామయ్య సవాలు విసిరారు. బహిరంగ చర్చకు వైసీపీ నుంచి ముఖ్యమంత్రి ఎవరినైనా పంపిస్తారా అని నిలదీశారు. తమ పార్టీ నుండి ఇద్దరం వస్తామని, వైసీపీ నుండి ఇద్దర్ని పంపితే ముగ్గురు సీనియర్ అడ్వొకేట్ల సమక్షంలో ప్రజాక్షేత్రంలో దీనిపై చర్చిద్దామన్నారు.
వివేకా హత్య కేసులో అన్ని వేళ్లు ఆ పార్టీ నాయకుల వైపే చూపిస్తున్నాయని, మౌనం వీడి రాష్ట్ర ప్రజలకు నిజం చెప్పాలని, వివేకా హత్యపై చర్చించేందుకు ధైర్యముందా? అని నిలదీశారు. జగనాసుర రక్త చరిత్ర బుక్ చదవకుండానే ఏదేదో మాట్లాడుతున్నారని, వివేకా హత్య వెనుక భారీ కుట్ర దాగి ఉందని, జగన్, భారతీ రెడ్డి ఆ కుట్రలో భాగస్తులు కాదా అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రశ్నించారు.