ఉద్యోగుల సమ్మెతో కొత్త జిల్లాల ఏర్పాటుపై నీలినీడలు!
AP employees PRC latest news | రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను ఏప్రిల్ 2లోగా పూర్తి చేయాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ ప్రక్రియపై ఉద్యోగుల నిరవధిక సమ్మె ఎఫెక్ట్ పడే అవకాశముంది.
Employees strike in AP | ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం తలపెట్టిన జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఉద్యోగుల నిరవధిక సమ్మె ప్రభావం చూపించే అవకాశముంది. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి జూన్ 30వరకే గడువు ఉంది. ఈలోపు చాలా ప్రక్రియలు పూర్తిచేయాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులు.. విధులకు హాజరుకాకపోతే అవి ఆలస్యమవ్వచ్చు!
జూన్ 30 వరకే ఎందుకు?
New districts in AP notification | 2020లో మొదలవ్వాల్సిన జనగణన ప్రక్రియ.. కరోనా విజృంభణ కారణంగా వాయిదా పడింది. అయితే జనాభా లెక్కల నిర్వహణకు ముందు జిల్లాలకు సంబంధించిన పూర్తి వివరాలను రాష్ట్రాలు కేంద్రానికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే.. కొత్త జిల్లాల ఏర్పాటు, పాత జిల్లాల సరిహద్దులను నిర్ణయించే ప్రక్రియను పూర్తి చేసి.. జూన్ 30లోగా తమకు సమాచారం అందివ్వాలని డైరక్టర్ ఆఫ్ సెన్సెస్ రజత్ కుమార్.. డిసెంబర్లోనే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. దీని ప్రకారం.. జగన్ ప్రభుత్వం తలపెట్టిన కొత్త జిల్లాల ఏర్పాటు జూన్ 30లోగా పూర్తికావాలి. అయితే ఏప్రిల్ 2లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.
మరోవైపు పీఆర్సీతో పాటు ఇతర సమస్యలపై ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఫిబ్రవరి 6 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఉద్యోగుల సమ్మె నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే.. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశాన్ని జగన్ ప్రభుత్వం హడావుడిగా తెరపైకి తీసుకొచ్చిందని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించకపోతే కచ్చితంగా నిరవధిక సమ్మె చేపడతామని ఉద్యోగులు తేల్చిచెబుతున్నారు.
ప్రక్రియ ఆలస్యం!
కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లోగా చెప్పాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఆ తర్వాతే అసలైన ప్రక్రియ మొదలవుతుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులను బదిలీ చేయాల్సి ఉంటుంది. ఏ జిల్లాలో పనిచేసేందుకు ఇష్టపడతారు అనే విషయం ఉద్యోగాలు తెలపాల్సి ఉంటుంది. వారిచ్చిన ఆప్షన్లకు తగ్గట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం ప్రభుత్వం.. జిల్లాస్థాయిలో సబ్కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
ఉద్యోగులు సమ్మె చేపడితే ఆప్షన్లు పెట్టడం ఆలస్యమవుతుంది. ఫలితంగా ఈ పూర్తి ప్రక్రియ కూడా ఆలస్యమయ్యే అవకాశముంది.
సంబంధిత కథనం