Chandrababu Delhi Tour : దిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు భేటీ- పొత్తుల ప్రస్తావన వచ్చిందా?-delhi tdp chief chandrababu meets bjp amit shah jp nadda discuss political situation in ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chandrababu Delhi Tour : దిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు భేటీ- పొత్తుల ప్రస్తావన వచ్చిందా?

Chandrababu Delhi Tour : దిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు భేటీ- పొత్తుల ప్రస్తావన వచ్చిందా?

Bandaru Satyaprasad HT Telugu
Jun 04, 2023 05:37 AM IST

Chandrababu Delhi Tour : టీడీపీ అధినేత చంద్రబాబు దిల్లీలో పర్యటించడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. శనివారం రాత్రి బీజేపీ పెద్దలు అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు సమావేశం అయ్యారు.

అమిత్ షాతో చంద్రబాబు భేటీ
అమిత్ షాతో చంద్రబాబు భేటీ

Chandrababu Delhi Tour : ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు దిల్లీలో బీజేపీ నేతలతో భేటీ అయ్యారు. శనివారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీ అయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు పలు అంశాలపై చర్చించారు. 2018లో ఎన్డీయే కూటమి నుంచి బయటికొచ్చిన తర్వాత అమిత్‌షాతో చంద్రబాబు భేటీ అవ్వడం ఇదే తొలిసారి. త్వరలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్న సందర్భంలో చంద్రబాబు... బీజేపీ నేతలతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్‌, కేశినేని నాని, రామ్మోహన్‌ నాయుడు, మాజీ ఎంపీ కంభంపాటి రామమోహనరావులతో కలిసి శనివారం సాయంత్రం దిల్లీకి వచ్చిన చంద్రబాబుకు ఎయిర్ పోర్టులో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు స్వాగతం పలికారు. అనంతరం వీరంతా ఎంపీ గల్లా జయదేవ్‌ నివాసానికి చేరుకున్నారు. రాత్రి 8.55 గంటలకు చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నివాసానికి వచ్చారు. కొద్దిసేపటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అక్కడికి వచ్చారు. వీరు ముగ్గురు రాత్రి 9.49 గంటల వరకు వివిధ అంశాలపై చర్చించారు. ఏపీలో పొత్తులపై ఈ సమావేశంలో చర్చించారా? భవిష్యత్తులో కలిసి పనిచేయడంపై సమాలోచనలు చేశారా? అనే విషయం తెలియాల్సి ఉంది.

రాజకీయ భేటీ

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో చంద్రబాబు దిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో భేటీ అవ్వడంతో చర్చ మొదలైంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో మళ్లీ పాత మిత్రులను ఎన్డీయే కూటమిలోకి బీజేపీ ఆహ్వానిస్తుందని సమాచారం. అధికారంలో లేని చంద్రబాబు బీజేపీ పెద్దలను కలవడంపై రాజకీయ భేటీగా విశ్లేషకులు భావిస్తున్నారు. సీఎం జగన్ ఇటీవల దిల్లీ పర్యటనకు వచ్చారు. ఈ పర్యటనలో కేంద్రంలోని పెద్దలను కలిశారు. ఏపీకి సంబంధించిన నిధులు, విభజన సమస్యలు, అమరావతి, పోలవరం లాంటి అంశాలపై కేంద్ర మంత్రులతో సీఎం జగన్ చర్చించారు. అయితే ఇటీవల అమిత్ షా భేటీ అయిన సీఎం జగన్... టీడీపీని ఎన్డీయేలోకి ఆహ్వానించవద్దని, అవసరమైతే వైసీపీ ఏన్డీయే కూటమిలోకి చేరుతోందని హామీ ఇచ్చారని ప్రచారం జరిగింది. కానీ సీఎం జగన్ వెళ్లిన వారం వ్యవధిలోనే చంద్రబాబు దిల్లీ వెళ్లి బీజేపీ కీలక నేతలతో భేటీ అవ్వడంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

కూటమిలో లేకపోయినా వైసీపీ మద్దతు

ఏపీలో బీజేపీ, జనసేన పొత్తు కొనసాగుతోంది. ఇటీవల దిల్లీ వెళ్లిన జనసేన అధినేత పవన్.... ఏపీలో పొత్తులపై బీజేపీ అధిష్ఠానంతో మాట్లాడారు. జనసేన, బీజేపీ కూటమిలోకి టీడీపీని ఆహ్వానిస్తే మరింత బలం చేకూరుతోందని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా వైసీపీ విముక్త ఏపీ అంటూ ప్రకటన చేసిన పవన్....బీజేపీతో కలిసి ఉంటామని స్పష్టం చేస్తున్నారు. అయితే సీఎం జగన్ ఏన్డీయేలో చేరకపోయినా... ముందునుంచి బీజేపీకి బయటనుంచి సపోర్టు చేస్తున్నారు. పార్లమెంట్ లో కీలక బిల్లులకు వైసీపీ ఎంపీలు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రత్యక్ష పొత్తు లేకపోయినా.. వైసీపీ ఎన్డీయేలో భాగస్వామిగా మెలుగుతోంది. ఈ తరుణంలో చంద్రబాబు మరోసారి బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నించడంతో వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఏపీలో బీజేపీకి కలిసొచ్చే అంశమేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ బీజేపీ అధిష్ఠానం వైసీపీ వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో చంద్రబాబు దిల్లీలో పర్యటించడంతో... పొత్తులపై చర్చ జరిగి ఉంటుందన్న ప్రచారం లేకపోలేదు. త్వరలో ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏపీలో చంద్రబాబు దిల్లీ టూర్ సక్సెస్ 2014 కాంబో మళ్లీ రిపీట్ కానుంది.

IPL_Entry_Point