AP Financial Problems: నిధుల సమీకరణ, విభజన సమస్యల నేపథ్యంలోనే సిఎం విదేశీ పర్యటన రద్దైందన్న సిఎస్-cs said that the chief minister canceled his foreign visit only to solve the division problems and release ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Financial Problems: నిధుల సమీకరణ, విభజన సమస్యల నేపథ్యంలోనే సిఎం విదేశీ పర్యటన రద్దైందన్న సిఎస్

AP Financial Problems: నిధుల సమీకరణ, విభజన సమస్యల నేపథ్యంలోనే సిఎం విదేశీ పర్యటన రద్దైందన్న సిఎస్

HT Telugu Desk HT Telugu
Apr 19, 2023 07:51 AM IST

AP Financial Problems: విభజన సమస్యల పరిష్కారం, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విడుదల కోసం ఢిల్లీ వెళ్లాల్సి ఉండటంతోనే ముఖ‌్యమంత్రి విదేశీ పర్యటన రద్దు చేసుకున్నారని సిఎస్ జవహార్ రెడ్డి ప్రకటించారు. నిధుల కొరత వల్లే వసతి దీవెన వాయిదా పడినట్లు సిఎస్ స్పష్టత ఇచ్చారు.

నిధుల కొరతపై వివరణ ఇస్తున్నసిఎస్‌, ఆర్ధిక శాఖ కార్యదర్శి
నిధుల కొరతపై వివరణ ఇస్తున్నసిఎస్‌, ఆర్ధిక శాఖ కార్యదర్శి

AP Financial Problems: ‘విభజన సమస్యలపై కేంద్రంతో చర్చించేందుకు సిఎస్‌, ఆర్థికశాఖ కార్యదర్శి, మరో రెండు, మూడు శాఖల కార్యదర్శులు దిల్లీ వెళుతున్నట్లు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్ రెడ్డి తెలిపారు. కేంద్రంలో ఉన్నత స్థాయిలో మాట్లాడేందుకు ముఖ్యమంత్రి అవసరం ఉన్నందున సిఎం కూడా అందుబాటులో ఉంటే బాగుంటుందని కోరామని, వ్యక్తిగత పర్యటనలు ఉన్నా వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేయడంతో సిఎం తన విదేశీ పర్యటనను వాయిదా వేసుకున్నారని చెప్పారు.

ఏపీ అధికారుల బృందం దిల్లీ వెళ్లిన తర్వాత అక్కడ అవసరాన్ని బట్టి ముఖ్యమంత్రికి సమాచారం ఇస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి వెల్లడించారు. షెడ్యూల్‌ ప్రకారం సోమవారం వసతి దీవెన నిధులు విడుదల చేయాల్సి ఉన్నా, ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో అంచనా వేసిన స్థాయిలో నిధులు సమకూరకపోవడంతో కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే జరిగాయన్నారు. వీటిపై మీడియాలో రకరకాలుగా కథనాలు వస్తున్నాయని, అందుకే వివరణ ఇస్తున్నట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి అనంతపురం జిల్లా పర్యటన రద్దు చేసుకోవడం, శుక్రవారం నుంచి మొదలు కావాల్సిన విదేశీ పర్యటన రద్దు కావడంపై రకరకాల ప్రచారం జరిగింది. ఓ వైపు అవినాష్ రెడ్డి కేసులో సిబిఐ దూకుడు పెంచడం, భాస్కర్‌ రెడ్డిని అరెస్ట్ చేయడం, మరిన్ని అరెస్టులు ఉంటాయనే ప్రచారాల నడుమ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రి పర్యటనల రద్దుకు కారణాలను వివరించారు. మరోవైపు సంక్షేమ పథకాల అమలుకు నిధుల కొరత ఉందనే విషయాన్ని కూడా సిఎస్‌ అంగీకరించారు.

విభజనే సమస్యల కోసమే వెళుతున్నాం….

రాష్ట్ర విభజనకు చెందిన పలు ప్రధాన అంశాల్లో చాలా వరకూ పరిష్కార దశకు చేరాయని వాటిపై చర్చించడానికి వెళుతున్నట్లు సిఎస్ చెప్పారు. రెవెన్యూ లోటు కింద రాష్ట్రానికి ఇప్పటి వరకూ 4వేల కోట్ల రూ.లు వచ్చాయని సిఎస్ వివరించారు. తెలంగాణా నుండి ఎపి జెన్కోకు రావాల్సిన బకాయిలు రాబట్టేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి ఫ్యాకేజి కింద నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు వివరించారు. పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు.

రాష్ట్ర విభజన అంశాల పరిష్కారానికి సంబంధించి రెండేళ్ళుగా ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి పలు దపాలు ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రికి వినతిపత్రాలు అందించి వాటి పరిష్కారానికి విజ్ణప్తి చేశారని వివరించారు. 2022 జనవరి 24న సియం పోలవరం,రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూ లోటు,తెలంగాణా నుండి ఎపి జెన్కోకు రావాల్సిన బాకాయిలు, అప్పులకు అనుమతులు వంటి 10 ప్రధాన అంశాలు పరిష్కారంపై ప్రధానమంత్రికి లేఖలు ఇచ్చారని గుర్తు చేశారు.వాటి పరిష్కారంపై కేంద్రం స్థాయిలో ఆర్ధికశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో కార్యదర్శులతో ఒక కమిటీని కూడా వేశారని ఆకమిటీకి ఈఅంశాలను రిఫర్ చేశారని తెలిపారు.

సిఎం విజ్ఞప్తి చేసిన కొన్ని అంశాలపై కొన్ని ఆర్డర్సు కూడా ఇచ్చారని ముఖ్యంగా తెలంగాణా నుండి ఎపి జెన్కోకు రావాల్సిన బకాయిలపై కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ తెలంగాణా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిందన్నారు బకాయిల విషయంలో తెలంగాణా ప్రభుత్వం కోర్టు నుండి స్టే తేగా ప్రస్తుతం కోర్టు స్టే కూడా తొలగి పోయినందున నిధులు రాబట్టేలా ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు.రాష్ట్ర విభజనకు సంబంధించి కొన్ని కీలక అంశాలపై ఈ ఏడాది మార్చి నెలాఖరుకు కేంద్ర ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని ఆశించామని కాని కొన్ని సాంకేతిక కారణాల వల్ల అవి అపరిష్కృతంగా ఉండిపోయాయన్నారు.

తుది దశకు చేరిన విభజన సమస్యల పరిష్కారం…

రాష్ట్ర విభజన అంశాల్లో కొన్ని ముఖ్యమైన అంశాలు పరిష్కార దశకు చేరిన నేపధ్యంలో తన నేతృత్వంలో సీనియర్ అధికారుల బృందం ఢిల్లీ వెళ్ళి కేంద్ర కార్యదర్శులతో సమావేశం కానున్నామని చెప్పారు. అవసరమైతే ముఖ్యమంత్రి కూడా ఢిల్లీ రావాలని విజ్ణప్తి చేయగా కొన్ని పరిపాలనా పరిమైన,ఇతర కారణాలు దృష్ట్యా ముఖ్యమంత్రి వ్యక్తిగత విదేశీ పర్యటను,సోమవారం జరగాల్సిన వసతి దీవెన కార్యక్రమాన్నికూడా రద్దు చేసుకున్నారని సిఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.

మార్చి 17వ తేదీన సియం ఢిల్లీ వెళ్ళినపుడు ప్రధానిని కలిసి ముఖ్యమైన విభజన అంశాలపై మరొకసారి విజ్ణప్తి చేశారన్నారు.ఆ తర్వాత ఆర్ధిక తదితర శాఖల సీనియర్ అధికారులం నాలుగైదు రోజులు ఢిల్లీలోనే ఉండి కేంద్ర మంత్రులు, కార్యదర్శులతో సమావేశం అయిన నేపధ్యంలో వాటిలో నాలుగైదు ప్రధాన అంశాలు పరిష్కార దశకు చేరుకున్న నేపధ్యంలో బుధవారం సీనియర్ అధికారుల బృందం ఢిల్లీ వెళుతోందని సిఎస్.జవహర్ రెడ్డి వివరణ ఇచ్చారు.

ఉత్తరాంధ్ర,రాయలసీమ వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులను అభివృద్ధి ఫ్యాకేజి కింద ఇవ్వాలని నీతిఆయోగ్ ను కోరామని సిఎస్ చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులు ఇతర ముఖ్యమైన అంశాలపైన మే 5న జరగనున్న దక్షిణ మండల జోనల్ కౌన్సిల్ సమావేశంలో కూడా ప్రస్తావించనున్నట్టు సిఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.

రాబోయే రోజుల్లో కేంద్రం నుండి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పధకం,స్థానిక సంస్థలకు రావాల్సిన పెండింగ్ నిధులు వస్తాయని ఆశిస్తున్నామని సిఎస్ పేర్కొన్నారు. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు కూడా తగిన నిధులు వస్తాయని ఆశిస్తున్నట్టు తెలిపారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం…

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.ఇప్పటికే జిపిఎఫ్,ఎపిజిఎల్ఐ తదితర పెండింగ్ బిల్లులకు సంబంధించి సుమారు 5వేల కోట్ల రూ.లు వరకూ చెల్లించినట్టు తెలిపారు.

పిఆర్శీ డిఏ బకాయిలు,లీవ్ ఎన్క్యేష్మెంట్,కరువు భత్యం మంజూరుకు సంబంధించి ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ సమావేశమై చర్చించామన్నారు. ఎంప్లాయిస్ ఆరోగ్య పధకం అమలుకు సంబంధించి కొన్ని మార్పులు, చేర్పులు అడిగారని వాటికి అంగీకరించినట్లు చెప్పారు. వీటిని త్వరలో పరిష్కరిస్తామని సిఎస్ స్పష్టం చేశారు.ఉద్యోగుల జీతాలను సకాలంలో చెల్లించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.ఈసమావేశంలో పాల్గొన్న ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ మాట్లాడుతూ మార్చినెల జీతాలను సకాలంలో చెల్లించామని రానున్న మాసాల్లో కూడా ఆవిధంగా చెల్లించే ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు.

ప్రాధాన్య క్రమంలో కాంట్రాక్టర్లకు చెల్లింపులు….

'కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు చెల్లింపులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వాటాలు క్రమం తప్పకుండా విడుదల చేస్తామని, ఈ పథకాల కింద చేసే పనులకు బిల్లుల చెల్లింపులో ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. కేంద్ర నుంచి కొన్ని నిధులు వస్తాయని ఆశిస్తున్నామని, అవి వచ్చిన వెంటనే నరేగా, స్థానిక సంస్థలకు సంబంధించి బకాయిలను చెల్లిస్తామన్నారు.

సాధ్యమైనంత వరకు ఉద్యోగులకు జీతాలు సకాలంలో ఇచ్చేందుకే ప్రయత్నిస్తున్నామని, కొన్ని ఇబ్బందులున్నాయని, వాటిని అధిగమించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామని చెప్పారు. 'రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు, మరమ్మతు పనులకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక ఉందని, దీనిని పక్కాగా అమలు చేస్తామన్నారు. ఉద్యోగ సంఘాల నేతలతో వారి సమస్యలపై దఫదఫాలుగా చర్చించాం. జీపీఎఫ్‌, జీఎల్‌ఐ, ఇతర బకాయిలు సుమారు 4-5 వేల కోట్లు చెల్లించాం. లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ అరియర్స్‌, డీఏ బకాయిలపై చర్చిస్తున్నాం. త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయడం లేదన్న మాట వాస్తవం కాదని, ప్రాధాన్యక్రమంలో బిల్లులు చెల్లిస్తున్నామని చెప్పారు.

IPL_Entry_Point