KRMB : ఆరు ప్రాజెక్టులకు కేఆర్‌ఎంబీ నిబంధనల సడలింపు….
అనుమతులు లేకుండా కృష్ణానదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంక్షల్ని సడలించింది. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ప్రాజెక్టులకు ఏడాదిలోగా అనుమతులు తీసుకోకుంటే వాటిని నిలిపివేయాలంటూ కేఆర్‌ఎంబీ గతంలో విధించిన ఆంక్షల్ని సవరిస్తూ తాజా గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది.
ఆంధప్రదేశ్ విభజన చట్టాన్ని అనుసరించి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు నిబంధనల్ని సడలించారు. తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు కొత్తగా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. కేఆర్‌ఎంబి జ్యూరిస్ డిక్షన్, ఏపీ విభజన చట్టానికి మధ్య తేడాలను గుర్తించిన కేంద్రం విభజన చట్టానికి అనుగుణంగా ప్రాజెక్టులను కొనసాగించేందుకు అనుమతించింది.
కృష్ణానదిపై నిర్మిస్తున్న హంద్రీనీవా ఎత్తిపోతల, తెలుగు గంగ ప్రాజెక్టు, గాలేరు నగరి, వెలిగొండ, కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలకు అనుమతులు లేకపోయినా కొనసాగించేందుకు కేంద్ర జలశక్తి శాఖ అనుమతించింది. కేఆర్‌ఎంబి నిబంధనలు సడలించి అనుమతులు మంజూరు చేసింది. తాజా నిర్ణయం ప్రకారం హంద్రీనీవా ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్ అనుబంధ పనులకు అమోదం లభించింది. తెలుగు గంగ ప్రాజెక్టు హెడ్ వర్క్స్, గాలేరు నగరి హెడ్ వర్క్స్ అనుబంధ పనులు, వెలిగొండ హెడ్ రెగ్యులేటర్, టన్నెల్, అనుబంధ పనులు, నల్లమల సాగర్ పనులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో పంప్ హౌస్, అనుబంధ పనులు, నెట్టెంపాడులో పంప్‌హౌస్, అనుబంధ పనులకు కేంద్రం అనుమతించింది.
కృష్ణానది యాజమాన్య బోర్డు 2014 జూన్ 2 నుంచి అమల్లోకి వచ్చింది. విభజన చట్టం ప్రకారం కృష్ణా నది పరిధిలో ఉన్న ప్రాజెక్టులపై కేఆర్‌ఎంబీకి పర్యవేక్షక అధికారాలు లభిస్తాయి. కృష్ణా నదిపై ఉన్న బ్యారేజీలు, డ్యామ్‌లు, రిజర్వాయర్‌లు, రెగ్యులేటరీ నిర్మాణాలతో పాటు కెనాల్ నెట్‌వర్క్, నీటి పంపిణీ వ్యవస్థల ద్వారా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన ప్రకారం నీరు, విద్యుత్ పంపిణీ చేయాలి. 2021 జులై 15న కేఆర్‌ఎంబీ పరిధిని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కేఆర్‌ఎంబీ నిబంధనల ప్రకారం అనుమతులు లేని ప్రాజెక్టులకు ఏడాది లోపు తీసుకోకపోతే వాటిని నిలిపివేయాల్సి ఉంటుంది. విభజన చట్టంలో ఇప్పటికే కొనసాగుతున్న ప్రాజెక్టులను యథావిధిగా కొనసాగించేందుకు అనుమతించడంతో కేఆర్ఎంబీ నిబంధనలు నడలించారు. విభజన చట్టం 11వ షెడ్యూల్ 10వ పేరాను అనుసరించి హంద్రీనీవా, తెలుగు గంగ, గాలేరు నగరి, వెలిగొండ, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే నోటిఫై చేసి ఉండటంతో వాటిని యథావిధిగా కొనసాగించేందుకు నిబంధనలు సడలించారు.
టాపిక్