APSRTC Sankranti Revenue : ఏపీఎస్‌ఆర్టీసికి భారీగా సంక్రాంతి ఆదాయం….
APSRTC Sankranti Revenue సంక్రాంతి ప్రయాణాలు ఏపీఎస్‌ఆర్టీసికి భారీగా ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరింది. సంక్రాంతి ప్రత్యేక సర్వీసులతో దాదాపు రూ.8కోట్ల రుపాయల్ని ఆర్జించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 141కోట్ల రుపాయలు సంపాదించినట్లు ఆర్టీసి ప్రకటించింది.
APSRTC Sankranti Revenue సంక్రాంతి ప్రయాణాలు ఆర్టీసికి భారీగా ఆదాయాన్ని తెచ్చాయి. జనవరి 6 నుండి 14 వరకు ఏపీఎస్ ఆర్టీసీ రికార్డు స్థాయిలో 3,392 ప్రత్యేక బస్సులు నడిపింది. సంక్రాంతికి ముందు రోజుల్లో 3120 ప్రత్యేక బస్సులను నడపాలని యోచిస్తున్నట్లు ఆర్టీసి అధికారులు ముందే ప్రకటించారు. సాధారణ ఛార్జీలకే ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండటంతో ఏపీ, తెలంగాణ, తదితర ప్రాంతాల ప్రజలు ప్రైవేట్ బస్సుల కంటే, ఏపీఎస్ఆర్టీసీ బస్సులకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. తిరుగు ప్రయాణ టిక్కెట్ ఛార్జీపై 10శాతం రాయితీ సౌకర్యం కూడా ప్రయాణికులను ఏపీఎస్ వైపు ఆకర్షించేలా చేసింది.
గత ఏడాది ఏపీఎస్ ఆర్టీసి సంక్రాంతి ముందు రోజుల్లో 2,400 ప్రత్యేక బస్సులను మాత్రమే నడిపింది. ఈ ఏడాది సంక్రాంతి ప్రత్యేక బస్సులకు ‘సాధారణ ఛార్జీలు’ వసూలు చేయడం వల్ల ప్రయాణికులు ఇతర వాహనాలను ఆశ్రయించకుండా ఆర్.టి.సి. బస్సులకే ఎక్కువ మొగ్గు చూపారు. ఫలితంగా స్థూల ఆదాయం బాగా పెరిగింది.
గత సంవత్సరం సంక్రాంతి సీజన్‌లో సాధించిన ఆదాయం రూ . 7.17 కోట్లుతో పోలిస్తే, ఈ సంవత్సరం 50% అదనపు ఛార్జీలు లేకుండానే అదనంగా రూ. 7.90 కోట్ల ఆదాయం ఆర్జించింది. గత ఏడాది ఇవే రోజుల్లో సాధించిన రూ.107 కోట్ల ఆదాయం కంటే ఈ సంవత్సరం రూ. 141 కోట్ల ఆదాయం ఏపీఎస్ ఆర్టీసీ సాధించగలిగిందని ఏపీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమల రావు చెప్పారు.
ఏపీఎస్ ఆర్టీసీ గత ఏడాది హైదరాబాదు నుండి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు 824 బస్సులు నడపితేా, ఈ సంవత్సరం 1,483 ప్రత్యేక బస్సులను నడిపింది. హైదరాబాద్‌లో సరైన మౌలిక సదుపాయాలు లేకపోయినా పెద్ద ఎత్తున బస్సులు నడిపి, ప్రయాణికుల నుండి ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ప్రత్యేక సర్వీసులను నిర్వహించగలిగింది.
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఇతర అంతఃరాష్ట్రాలకు వెళ్లే తిరుగు ప్రయాణికుల కోసం రద్దీని బట్టి ముందస్తు సీట్ల రిజర్వేషన్ కల్పిస్తూ, బస్సులు నిరంతరం అందుబాటులో ఉంచడం వల్ల రెవిన్యూ పెరిగిందని అధికారులు చెబుతున్నారు. సంక్రాంతి ముందు రోజుల్లో ఏపీఎస్ ఆర్టీసీ సేవలను విశేషంగా ఆదరించినందుకు ప్రయాణికులందరికీ ఎండీ కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ అంతటా అన్ని ప్రదేశాల నుండి తగిన సంఖ్యలో తిరుగు ప్రయాణం కోసం ఏపీఎస్ఆర్టీసీ బస్సులను సిద్ధం చేసినందున ఏపీఎస్ ఆర్టీసీ బస్సులను ఆదరించి తమ సేవలను పొందడం కొనసాగించాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రయాణికుల తిరుగు ప్రయాణాలకు కూడా తగిన సంఖ్యలో బస్సుల్ని నేటి వరకు అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించారు.