AP HIGH COURT : ఐఆర్‌ఎస్ అధికారిపై కేసు కొట్టివేత…..
ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సీఈఓగా పనిచేసిన జాస్తి కృష్ణ కిషోర్‌పై నమోదైన కేసులు ఏపీ హైకోర్టు కొట్టేసింది. కేసుల నమోదు అక్రమమని రాష్ట్ర హైకోర్టు తేల్చి చెప్పింది. కక్ష సాధింపులో భాగంగా కేసులు పెట్టారన్న పిటిషనర్ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది.
ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్‌పై నమోదు చేసిన కేసును ఏపీ హైకోర్టు కొట్టేసింది. కృష్ణ కిషోర్ పై రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసు అక్రమం అని న్యాయస్థానం తేల్చింది. ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సీఈఓగా కృష్ణ కిషోర్ ఎక్కడా అక్రమాలకు పాల్పడలేదని హైకోర్టు నిర్ధారించింది. సీనియర్ ఐటి అధికారి జాస్తి కృష్ణ కిషోర్ పై ఏపీ సర్కారు పెట్టిన కేసును హైకోర్టు తోసిపుచ్చింది. 2019లో వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర సర్వీసులో ఉన్న కృష్ణ కిషోర్‌ను సస్పెండ్ చేశారు. ఏపీ ఈడీబీ ద్వారా అక్రమాలకు పాల్పడ్డారంటూ క్రిమినల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తనను సస్పెండ్ చేయడంపై కృష్ణ కిషోర్ క్యాట్‌ను ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులపై కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. ఆ తర్వాత కృష్ణ కిషోర్‌పై సస్పెన్షన్ చెల్లదని జస్టిస్ నరసింహారెడ్డి అధ్యక్షత విచారించిన క్యాట్ హైదరాబాద్ బెంచ్ తీర్పు నిచ్చింది. క్యాట్ తీర్పు వెలువడిన తర్వాత ఈ వ్యవహారంపై ఎపి హైకోర్టులో విచారణ జరిగింది. కేసులో పెట్టిన సెక్షన్ లు చెల్లవని కేసును హైకోర్టు క్వాష్ చేసింది. విధి నిర్వహణలో భాగంగా వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకున్నట్లు గాని, లాభ పడినట్లు గాని ఎక్కడా అధారాలు లేవని తేల్చి చెప్పింది.
ముఖ్యమంత్రి జగన్‌పై నమోదైన కేసులను దర్యాప్తు చేసిన నాటి సిబిఐ అధికారి లక్ష్మీనారాయణతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే కారణంగా, దురుద్దేశపూర్వకంగా కృష్ణ కిషోర్‌పై కేసు పెట్టినట్లు హైకోర్టు నిర్థారణకు వచ్చింది. భజన్ లాల్ కేసులో సుప్రీం కోర్టు నిర్థేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా కేసును కొట్టి వేయదగినదిగా హైకోర్టు అభిప్రాయపడింది.
హైదరాబాద్ ఆదాయపు పన్ను శాఖ సర్కిల్‌లో పని చేసిన సమయంలో జగన్ కు చెందిన జగతి పబ్లికేషన్‌పై వస్తున్న ఆదాయానికి పన్నులు కట్టాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని అధికారంలోకి వచ్చిన తనను తరువాత సస్పెండ్ చేసి, తప్పుడు కేసు బనాయించినట్లు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సుదీర్ఘ విచారణ తర్వాత ఈ వ్యవహారంలో ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది.
టాపిక్