ఎర్ర చందనం విక్రయాలపై ఏపీ సర్కారు గంపెడాశలు-ap govt writes centre for cites permission ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap Govt Writes Centre For Cites Permission

ఎర్ర చందనం విక్రయాలపై ఏపీ సర్కారు గంపెడాశలు

HT Telugu Desk HT Telugu
Apr 16, 2022 06:34 PM IST

ఎర్రచందనం విక్రయాల కోసం ఏపీ సర్కారు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఐదు వేల కోట్ల రుపాయల విలువైన ఎర్రచందనం నిల్వలను విక్రయించడంలో అంతర్జాతీయ అనుమతులు దక్కడంలో సహకరించాలని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖకు ఏపీ సర్కారు లేఖ రాసింది.

ఎర్ర చందనం
ఎర్ర చందనం (AFP)

ఎర్ర చందనం విక్రయాలతో ఆర్ధిక ఇబ్బందులు కొంతవరకైనా తీరుతాయని ఏపీ సర్కారు భావిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో ఎర్ర చందనం విక్రయించాలంటే "సైట్స్‌" (అంతరించిపోతున్న జాతుల అటవీ జంతుజాలం మరియు వృక్షజాలంలో అంతర్జాతీయ వాణిజ్య సదస్సు) అనుమతులు కావాలి. గతంలో మంజూరైన సైట్స్‌ అనుమతుల గడువు ముగియడంతో రాష్ట్రంలో ఉన్న ఎర్ర చందనం నిల్వల్ని అమ్ముకోలేని పరిస్థితి ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌ అటవీ శాఖ ఉన్నతాధికారులు సైట్స్‌ అనుమతుల పునరుద్ధరణకు సహకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది.

ట్రెండింగ్ వార్తలు

వేల కోట్ల విలువైన ఎర్రచందనం నిల్వలు

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఉన్న 8 గోడౌన్లలో 5500 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయి. దాదాపు 2లక్షల లాట్లుగా వీటిని విభజించి ఉంచారు. ఖరీదైన ఎర్రచందనం భద్రత కోసం ప్రభుత్వం 24 గంటల సాయుధ పహారా కల్పిస్తోంది. దీంతో పాటు 24 సీసీటీవీ నిఘాలో నిల్వల్ని భద్రపరిచారు. దొంగతనం, అగ్నిప్రమాదం వంటి సమస్యలు తలెత్తినా నష్టపోకుండా కోటిన్నర ప్రీమియంతో ఇన్స్యూరెన్స్‌ కూడా చేశారు. ప్రస్తుతం ఉన్న ఎర్రచందనం నిల్వలకు తోడు ప్రతి నెల అదనంగా 30టన్నుల వరకు ఎర్రచందనం వచ్చి చేరుతోంది. స్మగ్లర్ల అగడాలు తగ్గకపోవడంతో, టాస్క్‌ ఫోర్స్‌, పోలీసులు తనిఖీల్లో తరచూ ఎర్రచందనం బయటపడుతూనే ఉంది. చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో విస్తరించిన శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనాన్ని అక్రమంగా నరికి తరలించే ప్రయత్నాల్లో తరచూ పట్టుబడుతూనే ఉంది. ఎర్రచందనం భద్రపరచడంపై అనేక సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో వాటిని వేలం వేసేందుకు ఏపీ సర్కారు ప్రయత్నాలు ప్రారంభించింది.

భారీగా నిల్వలు....

ఎర్రచందనం దుంగలతో పాటు అటవీ శాఖ వద్ద వేళ్లు, చిప్ప్, పౌడర్ వంటి ఎర్రచందనం బై ప్రొడక్ట్స్‌ కూడా భారీగా ఉన్నాయి. ఎర్రచందనం దుంగలు, వాటి అనుబంధ ఉత్పత్తుల విక్రయాల కోసం గతంలో సైట్స్‌ అనుమతులు మంజూరయ్యాయి. 2011లో భారత్‌ నుంచి 11,806 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం ఎగుమతులకు అనుమతులు లభించాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 8498 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం కూడా ఉంది. 2006, 2011లో కొంత విక్రయాలు జరిగినా ఏపీలో ఇప్పటికి భారీ స్థాయిలో నిల్వలున్నాయి. కొన్నేళ్ల క్రితం బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు ప్రయత్నాలు చేసినా అవి పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. రాష్ట్రంలో అటవీ శాఖ వద్ద ఉన్న ఎర్రచందనాన్ని డైరెక్టర్‌ జనరల్ ఆఫ్‌ ఫారిన్ ట్రేడ్ ఏపీలో ఉన్న నిల్వల్ని ఆర్నెల్ల గడువుతో విక్రయించుకునేందుకు 2014లో అనుమతించింది. ఆ తర్వాత దానిని 2019 ఏప్రిల్ వరకు పొడిగించారు. ఆ తర్వాత 2020 మార్చి వరకు పొడిగించారు. ఆ తర్వాత గడువు ముగియడంతో ఎర్రచందనం విక్రయాలకు అవకాశం లేకుండా పోయింది.

దక్షిణాసియా దేశాలలో ఎర్రచందనంకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో వాటి విక్రయాల కోసం ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సైట్స్‌ అనుమతులు మంజూరైతే వాటిని వేలం వేయొచ్చని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ గోడౌన్లలో ఉన్న ఎర్ర చందనాన్ని మూడు రకాలుగా విభజించారు. నాణ్యతను బట్టి ఏ,బి,సి గ్రేడ్లు వాటిని విభజించారు. టన్ను ధర రూ.50లక్షల నుంచి కోటి రుపాయల వరకు లభిస్తుందని అంచనా వేస్తున్నారు. కనీసం ఐదు వేల కోట్ల రుపాయల ఆదాయం లభిస్తుందని ఏపీ అటవీ శాఖ అంచనా వేస్తోంది. ఎర్రచందనంకు ఉన్న ప్రత్యేక గుణాలతో పాటు, ఎర్రచందనంతో తయారయ్యే ఫర్నీచర్‌కు దక్షిణాసియా దేశాలలో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో సైట్స్‌ అనుమతులపై సర్కారు గంపెడాశలు పెట్టుకుంది.

WhatsApp channel

టాపిక్