Divyangjan DBT Pension : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, దివ్యాంగ విద్యార్థులకు డీబీటీ ద్వారా పెన్షన్-ఇలా అప్లై చేసుకోండి
Divyangjan DBT Pension : దివ్యాంగ విద్యార్థుల పెన్షన్ విధానంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పెన్షన్ నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయాలని నిర్ణయించింది. డీబీటీ విధానంలో నేరుగా విద్యార్థు అకౌంట్లలో పెన్షన్ జమ చేస్తారు. సంబంధిత పత్రాలను డీఆర్డీఏ పీడీ కార్యాలయాల్లో అందించాల్సి ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సామాజిక పెన్షన్లలో కీలక మార్పు చోటుచేసుకుంది. సామాజిక పెన్షన్ అందుకుంటున్న దివ్యాంగు విద్యార్థులకు ఇక నుంచి డీబీటీ ద్వారా పెన్షన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సుదూర ప్రాంతాల్లో హాస్టల్, గురుకులాల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులు ప్రతి నెల స్వగ్రామాలకు వచ్చి పెన్షన్ తీసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువల్ల విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొకుండా ఇక నుంచి వారి బ్యాంక్ ఖాతాలో ప్రతినెల పెన్షన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి ఈ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి?
పెన్షన్ పొందే దివ్యాంగులైన విద్యార్థులు దూర ప్రాంతంలో ఉండి చదువుకుంటున్నట్లయితే వారికి డైరెక్ట్ బెనిఫిసరీ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) ద్వారా బ్యాంకులో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీనికి అప్లై చేసుకోవడం చాలా సులవు. సంబంధిత పత్రాలతో కూడిన సెట్‌ను డీఆర్‌డీఏ పీడీ కార్యాలయంలో అందించాల్సి ఉంటుంది. వారు ఆ పత్రాలను పరిశీలించి, తదుపరి ప్రక్రియ చేస్తారు. ప్రతినెలా ఒకటో తేదీన ఇచ్చే పెన్షన్ తీసుకోవడానికి ఒక రోజు ముందే కాలేజీలు, హాస్టల్, స్కూల్‌ల్లో అనుమతి తీసుకొని అవస్థలు పడుతూ రావాల్సిన పని ఇక ఉండదు.
డీబీటీకి కావాల్సిసిన పత్రాలు
1. విద్యార్థులు స్టడీ సర్టిఫికేట్
2. బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ
3. ఆధార్ కార్డు
4. సదరం సర్టిఫికెట్
5. పెన్షన్ ఐడీ
6. స్కూల్ / కాలేజీ ఐడీ
7. పాస్‌పోర్టు సైజ్ ఫోటో
8. ఎంపీడీవో ధ్రువీకరిస్తూ పత్రం
ఈ ప్రతాలను డీఆర్‌డీవో పీడీ కార్యాలయానికి అందజేస్తే వారికి నేరుగా అకౌంట్‌లోనే పెన్షన్ డబ్బులు జమ అవుతాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని దివ్యాంగ విద్యార్థులకు అధికారులు సూచిస్తున్నారు. ప్రతినెలా ఊరికి వెళ్లి పెన్షన్ డబ్బులు తీసుకునే పని లేకుండా నేరుగా బ్యాంకు అకౌంట్‌లోనే డబ్బులు జమ అవుతాయి. వచ్చే నెల నుంచి ఈ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది.
రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల కోటాలో ఎన్‌టీఆర్ భరోసా పథకం కింద 8.50 లక్షల మంది పెన్షన్ దారులు ఉన్నారు. వీరంతా ప్రతినెల పెన్షన్ పొందుతున్నారు. వీరికి వయస్సుతో సంబంధం లేకుండా 45 శాతం వైకల్యం పైబడిన వారికి వివిధ విభాగాల్లో రూ.6 వేల నుంచి రూ.15 వేల వరకు పెన్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. వీరిలో పది వేల మంది విద్యార్థులు గురుకులాలు, హాస్టల్స్‌లో చదువుకుంటూ పెన్షన్ అందుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో అంగీకారం తెలిపిన వారికి బ్యాంక్ అకౌంట్‌లో పెన్షన్ డబ్బులను జమ చేస్తారని అధికారులు తెలిపారు.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం