Amaravati Safe: సేఫ్‌జోన్‌లోనే అమరావతి, కృష్ణానదితో ఇబ్బంది లేదన్న ఏపీ సర్కార్.. విఎంసి పన్ను హెచ్చరికలపై మంత్రి వివరణ-ap government says that amaravati and krishna river are in safe zone structures to withstand floods ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Amaravati Safe: సేఫ్‌జోన్‌లోనే అమరావతి, కృష్ణానదితో ఇబ్బంది లేదన్న ఏపీ సర్కార్.. విఎంసి పన్ను హెచ్చరికలపై మంత్రి వివరణ

Amaravati Safe: సేఫ్‌జోన్‌లోనే అమరావతి, కృష్ణానదితో ఇబ్బంది లేదన్న ఏపీ సర్కార్.. విఎంసి పన్ను హెచ్చరికలపై మంత్రి వివరణ

Bolleddu Sarath Chandra HT Telugu
Sep 17, 2024 01:53 PM IST

Amaravati Safe: అమరావతిలో 2015-19 మధ్య ప్రారంభించిన నిర్మాణాలు పటిష్టంగానే ఉన్నాయని, పునాదులు కూడా పనుల్ని కొనసాగించడానికి అనుకూలంగానే ఉన్నాయని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. కృష్ణానది వరదల్ని తట్టుకునేలా నిర్మాణాలు చేపట్టనున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

ఏపీ పురపాలశాఖ మంత్రి నారాయణ
ఏపీ పురపాలశాఖ మంత్రి నారాయణ

Amaravati Safe: కృష్ణా తీరంలో నిర్మిస్తోన్నఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నగరం పూర్తిగా సేఫ్ జోన్ లో ఉందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల కృష్ణానదికి వచ్చిన వరదల నేపథ్యంలో అమరావతి ముంపుకు గురవుతుందనే ప్రచారం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కృష్ణానది వల్ల రాజధానికి ఎలాంటి ఇబ్బంది లేదని, వైసీపీ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని చెబుతున్నారు.

రాజధాని నిర్మాణంలో కాలువలు,రిజర్వాయర్ల నిర్మాణంతో నీటి నిల్వ చేపట్టనున్నట్టు చెబుతున్నారు. గతంలో నిర్మించిన ఐకానిక్ భవనాలు,క్వార్టర్లకు ఎలాంటి ఇబ్బంది లేదని ఐఐటి నిపుణులు నివేదిక ఇచ్చారని ఏపీ ప్రభుత్వం వివరణ ఇస్తోంది.

వైసీపీ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో అమరావతి మునిగిపోతుందని విష ప్రచారం చేసిందని పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ నారాయణ అన్నారు.అమరావతి పూర్తిగా సేఫ్ జోన్ లో ఉందని, నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బందీ లేదన్న మంత్రి, భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

అమరావతి రాజధానికి పనికిరాదని గత ప్రభుత్వం ప్రచారం చేయడంతో పాటు ప్రపంచబ్యాంకు కు కూడా నిధులు ఇవ్వొద్దని లేఖలు రాసిందని,...కృష్ణా నదికి రికార్డు స్థాయిలో 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ఎలాంటి ఇబ్బందీ కలగలేదన్నారు.

అమరావతి డిజైన్ సమయంలోనే వరద ఇబ్బందులు లేకుండా కాల్వలు, రిజర్వాయర్లు ప్రతిపాదించారని, కొండవీటి వాగు,పాల వాగుల ప్రవాహంతో పాటు గ్రావిటీ కెనాల్స్ డిజైన్ చేసినట్టు వివరించారు.

చ్చే వర్షాకాలం నాటికి ఈ మూడు కెనాల్స్ ను పూర్తి చేసేలా త్వరలోనే టెండర్లు పిలుస్తామని, అనంతవరం నుంచి ఉండవల్లి వరకూ 23.6 కిమీలతో కొండవీటి వాగు, దొండపాడు నుంచి కృషాయపాలెం వరకూ 16.7 కి.మీ మేర పాల వాగు, వైకుంఠపురం గ్రావిటీ కెనాల్‌ను 8 కిమీ మేర అభివృద్ధి చేయనున్నారు.

మొత్తం 48.3 కి.మీ మేర మూడు కాలువలు అభివృద్ధి చేస్తామని వాగులు కొన్ని చోట్ల ఉండాల్సిన దానికంటే కూచించుకు పోవడంతో గత వందేళ్లలో కృష్ణా నదికి వచ్చిన వరద ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకుని మూడు కాల్వలు అభివృద్ధి చేయనున్నారు.

అమరావతిలో ఆరు రిజర్వాయర్లు…

అమరావతి నిర్మాణంలో భాగంగా 6 రిజర్వాయర్ల నిర్మాణం కూడా చేపడుతున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. సీడ్ కేపిటల్ లోపల నీరు కొండ వద్ద 0.4 టీఎంసీలు, కృష్ణాయపాలెం వద్ద 0.1టీఎంసీ లు,శాఖమూరు వద్ద 0.01టీఎంసీలు సామర్థ్యంతో రిజర్వాయర్లు,సీడ్ కేపిటల్ వెలుపల లాం వద్ద 0.3 టీఎంసీ లు,పెద పరిమి వద్ద 0.2 టిఎంసి ల,వైకుంఠపురం వద్ద 0.3 టిఎంసి ల సామర్థ్యం తో మొత్తం 6 రిజర్వాయర్లు నిర్మాణం చేపడుతున్నారు.

అమరావతిలో ఎంత వర్షం వచ్చినా సరే కాలువలు,రిజర్వాయర్లు సరిపోతాయన్నారు. ఇవి నిండిపోయినా సరే కృష్ణా నదిలోకి పంపింగ్ చేసేందుకు కూడా ప్రతిపాదనలు ఉన్నట్లు మంత్రి చెప్పారు.

12,350 క్యూసెక్కుల కెపాసిటీ తో ఉండవల్లి వద్ద, 4000 క్యూసెక్కుల కెపాసిటీ తో బకింగ్ హాం కెనాల్ లోకి, 5650 క్యూసెక్కుల కెపాసిటీ తో వైకుంఠపురం వద్ద లిఫ్ట్ లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.అన్నీ పూర్తయితే ఎంత వర్షం పడినా ఒక్క చుక్క కూడా నీరు నిల్వ ఉండదని, .భవిష్యత్తులో కృష్ణా నడికి మరింత భారీ వరద వచ్చినప్పటికీ రాజధాని అమరావతికి ఎలాంటి డోకా ఉండదని స్పష్టం చేశారు. కృష్ణానదికి 15 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా తట్టుకునేలా కరకట్టను బలోపేతం చేసేలా రీ డిజైన్ చేస్తామన్నారు.

పటిష్టంగానే అమరావతి భవనాలు…

రాజధాని లో 2014 - 2019 మధ్య నిర్మించిన భవనాలు మధ్యలోనే నిర్మాణాలు నిలిచిపోయాయి. సెక్రటేరియట్‌ భవనాల పునాదులు నీటిలో ఉండిపోయాయి. భవనాలు సామర్థ్యం ఎలా ఉందనే దాని పై ప్రభుత్వం దృష్టి పెట్టింది.దీని కోసం ఐఐటి హైదరాబాద్,ఐఐటి చెన్నైలకు భవనాలు పరిస్థితిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కోరింది..ఈ నివేదిక ప్రభుత్వానికి అందింది.

ఐకానిక్ భవనాలైన సెక్రటేరియట్ టవర్లు, హై కోర్టు తో పాటు అధికారులు, ఉద్యోగుల కోసం నిర్మాణం చేసిన 3600 ఫ్లాట్ లకు ఎలాంటి ఇబ్బందీ లేదని...వాటి నిర్మాణం కొనసాగించుకోవచ్చని నివేదికలు అందాయి.ఆయా నిర్మాణాల పనులకు రాబోయే రెండు నెలల్లో టెండర్లు పిలుస్తామన్నారు.

ఐకానిక్ భవనాల రాఫ్ట్ ఫౌండేషన్ కూడా బలంగా ఉందని, అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులకు వర్షాల వల్ల ఇబ్బంది కలిగిందని..త్వరలో పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు.

పన్నుల చెల్లింపుకు గడువు..

విజయవాడలో వరద ప్రాంతాల ప్రజలకు పన్నుల చెల్లింపునకు గడువు పొడిగిస్తామని, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కు చెల్లించాల్సిన వివిధ రకాల పన్నులకు గడువు ఈ నెల 30 తో ముగిస్తున్నప్పటికీ వరదల కారణంగా ఆయా ప్రాంతాల వారికి వెసులుబాటు కల్పించేలా గడువును పొడిగిస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. విజయవాడ నగరంలో 32 డివిజన్లు వరద ముంపుకు గురైనా సెప్టెంబర్ 30లోగా పన్నులు చెల్లించాలిని విజయవాడ కార్పొరేషన్‌ నోటీసులు జారీ చేయడంవిమర్శలకు దారి తీసింది. దీనిపై మంత్రి నారాయణ గడువు పొడిగిస్తామని హామీ ఇచ్చారు.

Whats_app_banner