AP Govt Employees Transfers : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్
AP Govt Employees Transfers : ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఉద్యోగుల బదిలీలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 22 నుంచి 31 వరకు బదిలీలకు అవకాశం కల్పించింది. అయితే రేపట్నుంచే ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది.
AP Govt Employees Transfers : ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్యోగుల బదిలీ నిషేధాన్ని సడలిస్తూ... ఈ నెల 22 నుంచి 31 వరకు ఉద్యోగుల బదిలీలు చేపట్టనుంది. ఉద్యోగుల వినతుల, పాలన కారణాల అనుగుణంగా బదిలీలకు అవకాశం కల్పించింది. రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసిన వాళ్లకు రిక్వెస్ట్‌పై బదిలీకి అవకాశం కల్పించనున్నారు. ఐదేళ్లు ఒకే చోట పనిచేసిన ఉద్యోగుల బదిలీ మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. 2023 ఏప్రిల్ నాటికి 5 ఏళ్లు ఒకచోట పనిచేసిన వాళ్లు అందరూ బదిలీలకు అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే టీచర్లతో పాటు ఇతర ఉద్యోగులకు విడివిడిగా నిబంధనలు జారీ చేసింది.
జూన్ 1 నుంచి బదిలీలపై మళ్లీ నిషేధం
2022 జూన్‌లో చివరిగా ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్యోగుల బదిలీలకు కొంత కాలం పాటు నిషేధాన్ని సడలించారు. అప్పట్లో ఐదేళ్ల పైబడిన ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పించింది. వ్యక్తిగత వినతులు, పరిపాలనా సౌలభ్యం కోసం ట్రాన్స్ ఫర్స్ చేశారు. 2021 డిసెంబర్ లో ఉద్యోగుల పరస్పర బదిలీలకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ప్రస్తుతం బదిలీలపై పూర్తి నిషేధం తొలగించి పూర్తి స్థాయి బదిలీలకు అవకాశం కల్పించడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బదిలీలపై జూన్ ఒకటో తేదీ నుంచి మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుంది. అయితే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.
రేపట్నుంచే టీచర్ల బదిలీలు
ఏపీలో రేపటి నుంచి టీచర్ల బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి అయిన తర్వాతే పదోన్నతుల ప్రక్రియ చేపడతామన్నారు. ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశం అనంతరం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై సమావేశంలో చర్చించినట్లు స్పష్టం చేశారు. నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా బదిలీలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.
పదోన్నతులపై కీలక నిర్ణయం
అదే విధంగా 675 ఎంఈవో-2 పోస్టులకు గురువారం జీవో జారీ చేయనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. 350 మంది గ్రేడ్ -2 ప్రధానోపాధ్యాయులు, 9269 మంది ఎస్జీటీలకు పదోన్నతులు కల్పిస్తామని ప్రకటించారు. 1746 మంది పీజీ ఉపాధ్యాయుల పునర్విభజన ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం అవుతందని స్పష్టం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి చేస్తామన్నారు. ఉద్యోగ సంఘాలు కోర్టులకు వెళ్లి బదిలీల ప్రక్రియను అడ్డుకోవద్దని మంత్రి బొత్స విజ్ఞప్తి చేశారు.