Pingali Venkayya : పింగళి వెంకయ్య జయంతి ఉత్సవాలు..-ap cm pays tributes to pingali venkayya ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pingali Venkayya : పింగళి వెంకయ్య జయంతి ఉత్సవాలు..

Pingali Venkayya : పింగళి వెంకయ్య జయంతి ఉత్సవాలు..

HT Telugu Desk HT Telugu
Aug 02, 2022 12:51 PM IST

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఏపీ సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146 వ జయంతి ఉత్సవాలను ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రారంభించారు.

<p>పింగళి వెంకయ్యకు నివాళులు అర్పిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి</p>
పింగళి వెంకయ్యకు నివాళులు అర్పిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి

జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలను ఏపీ సీఎం ప్రారంభించారు. అజాదీ కా అమృత్ ఉత్సవాలలో భాగంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, పింగళి వెంకయ్య జీవిత చరిత్రపై ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ రేగుళ్ళ మల్లిఖార్జునరావు స్వయంగా చిత్రించిన పింగళి వెంకయ్య చిత్రపటాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించారు. జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలను ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. చిత్తూరు జిల్లా నగరిలో జరిగే కార్యక్రమంలో మంత్రి రోజా పాల్గొన్నారు.

పింగళి వెంకయ్య జన్మస్థలమైన కృష్ణా జిల్లా ‘భట్ల పెనుమర్రు’ గ్రామంలో నిర్వహించే కార్యక్రమానికి మంత్రి జోగి రమేష్‌ హాజరుయ్యారు. తపాలా శాఖ ప్రత్యేకంగా ముద్రించిన పోస్టల్‌ కవర్‌ను మంత్రి ఆవిష్కరించారు. 1921లో విజయవాడలో మహాత్మాగాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్‌ సమావేశంలో పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని జాతీయ జెండాగా గుర్తిస్తూ ఏకగ్రీవంగా నిర్ణయించారు. పింగళి వెంకయ్య జయంతిని రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నందుకు తెలుగు వారంతా గర్గవ పడాలని సీఎం చెప్పారు.

స్వాతంత్య్ర సమరయోధుడికి దేశ వ్యాప్త నివాళులు…

జాతీయ త్రివర్ణపతాక నిర్మాత, స్వాతంత్య్ర యోధుడు, వ్యవసాయ శాస్త్రవేత్త, సాహితీవేత్త, బహుభాషా నిష్టాతుడైన పింగళ వెంకయ్య 1878వ సంవత్సరం ఆగస్టు 2వ తేదీన కృష్ణాజిల్లా దివిసీమలోని భట్ల పెనుమర్రులో జన్మించారు. వెంకయ్య ప్రాధమిక విద్య పెద్ద కళ్లేపల్లిలో జరిగింది. 1890వ సంవత్సరంలో లోయర్‌ సెకండరీ విద్యలో ఉత్తీర్ణుడయ్యాడు. బందరులో హిందూ హైస్కూల్లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. శ్రీలంకకు వెళ్లి కొలంబోలోని సిటీ కళాశాలలో రాజకీయ ఆర్ధిక శాస్త్రాలలో ఉత్తీర్ణుడయ్యారు. లాహోర్‌‌లో దయానంద ఆంగ్లోవేదిక్‌ కళాశాలలో సంస్కృతం, ఉర్ధూ, జపాన్‌ భాషలను అభ్యసించారు.

పలు భాషల్లో ఏకధారగా, గంభీరంగా ఉపన్యాసాలు చేసేవారు. మద్రాసులో కొంత కాలం రైల్వేగార్డుగా పనిచేశాడు. బందరు జాతీయ కళాశాలలో అధ్యాపకుడిగా చేరిన తర్వాత దుగ్గిరాల గోపాలకృష్ణయ్యతో పరిచయం ఏర్పడింది. 22వ ఏట కలకత్తాలో జరిగే జాతీయ కాంగ్రెస్‌ మహాసభలకు వెళ్లారు. జాతీయ కాంగ్రెస్‌ విషయ నిర్ణయ సభకు ఎంపికయ్యారు. 1917లో భారత జాతీయ కాంగ్రెస్‌ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. 1916లో భారతదేశమునకు ఒక జాతీయ పతాకం అనే గ్రంధాన్ని రచించారు. అందులో 30 రకాల పతాకాలను రూపొందించారు. వాటిలో కొద్దిపాటి మార్పులతో నేటి మన జాతీయ పతాకమైంది.

1921, మార్చి 31వ తేదీన బెజవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సమావేశంలో మహాత్మాగాంధీ వెంకయ్యను ఒక జాతీయ పతాకాన్ని చిత్రించి ఇవ్వవలసిందిగా కోరడంతో వెంకయ్య మూడు గంటలలో త్రివర్ణ పతాకాన్ని చిత్రించి ఇచ్చారు. 1922లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.దేశ భక్తుడు, రచయిత, విజ్ఞాన శాస్త్రవేత్త అయిన పింగళ వెంకయ్య 1963, జూలై 4వ తేదీన మరణించారు.

Whats_app_banner