Night Curfew| ఏపీలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేత.. నిర్ణయం తీసుకున్న సీఎం జగన్
ఇకపై రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. కరోనా వ్యాప్తి తగ్గిన కారణంగా ఆంక్షలు సడలిస్తున్నట్లు పేర్కొన్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
కరోనా మహమ్మారి కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోవిడ్ వ్యాప్తి తగ్గినందున నైట్ కర్ఫ్యూ తొలగిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. అయితే కర్ఫ్యూ తొలగించిన కోవిడ్ నిబంధనలను పాటించాల్సిందేనని, మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాల్సిందేనని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులో సమీక్ష నిర్వహించిన సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్ సమీర్ శర్మతో పాటు ఇతర వైద్య, ఆరోగ్య ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కరోనా పరిస్థితుల గురించి ముఖ్యమంత్రికి వారు వివరించారు.
రాష్ట్రంలో తగ్గిన కోవిడ్ వ్యాప్తి..
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి గణనీయంగా తగ్గిందని, యాక్టీవ్ కేసుల రేటు 0.82 శాతానికి పడిపోయిందని అధికారులు సీఎంకు తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి వివరించారు.
దీంతో రాత్రి కర్ఫ్యూ అవసరం లేదని, అయితే మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాల్సిందేనని ముఖ్యమంత్రి వారిని ఆదేశించారు. పబ్లిక్ ప్రదేశాలు, దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కరోనా నిబంధనలు తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఫీవర్ సర్వే కొనసాగిస్తూ లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేసే ప్రక్రియ అలాగే కొనసాగించాలని చెప్పారు.
వైద్యారోగ్య శాఖలో నియామకాల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. సిబ్బంది తప్పనిసరిగా ఆస్పత్రుల్లో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆస్పత్రుల్లో అడ్మినిస్ట్రేషన్ పనులు, చికిత్స బాధ్యతలను వేరు చేయాలని అధికారులకు సూచించారు. నిపుణులైన వారికి పరిపపాలన బాధ్యతలను అప్పగించాలని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. స్పెషలిస్టు వైద్యులకు వారి వేతనంలో 50 శాతం, వైద్యులకు 30 శాతం మేర ప్రత్యేక ప్రోత్సాహకంగా ఇచ్చేలా మార్గదర్శకాలు రూపొందించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు.
సంబంధిత కథనం