TDP MLC| తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్టు.. డిగ్రీ ధ్రువపత్రం విషయంలో అభియోగం
తెదేపా నేత, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. తప్పుడు డిగ్రీ ధ్రువపత్రాన్ని సమర్పించారనే ఆరోపణలతో ఆయనను అర్ధరాత్రి 11.30 గంటలకు అదుపులోకి తీసుకున్నారు.
మొన్న అచ్చెన్నాయుడు, నిన్న బుద్దా వెంకన్న ఇలా వరుసగా తెలుగుదేశం పార్టీ నాయుకులను అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. తాజాగా ఈ జాబితాలో తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు కూడా చేరారు. అశోక్ బాబు డిగ్రీ చదవకపోయినా చదివినట్లు తప్పుడు ధ్రువ పత్రం సమర్పించారనే ఆరోపణలతో గురువారం నాడు సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలో రాత్రి 11.30 గంటల సమయంలో ఓ వివాహ వేడుకకు హాజరైన ఇంటికి చేరుకున్న ఆయనను మఫ్టీలో మాటు వేసి అరెస్ట్ చేశారు. ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు, శుక్రవారం కోర్టుకు హాజరపరచనున్నట్లు సమాచారమిచ్చారు.
వివరాల్లోకి వెళ్తే అశోక్ బాబు వాణిజ్య పన్నుల శాఖలో ఏసీటీవోగా పనిచేసే సమయంలో బీకాం డిగ్రీ చదవకపోయినా, చదివినట్లు తప్పుడు ధ్రువపత్రాన్ని సమర్పించారని విజయవాడకు చెందిన ఓ వ్యక్తి లోకాయుక్తాకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన లోకాయుక్త వాణిజ్యపన్నుల శాఖ నుంచి నివేదిక తెప్పించుకుని సమగ్ర దర్యాప్తు కోసం సీఐడీకి ఫిర్యాదు చేయాలని ఆ శాఖాధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయనపై ఐపీసీ 477ఏ, 465, 420 తదితర సెక్షన్లపై కేసు నమోదు చేశారు.
తెరపైకి పాత కేసు..
అశోక్ బాబు డిగ్రీ చదవకుండానే చదివినట్లుగా ధ్రువపత్రాన్ని సమర్పించినట్లుగా ఉమ్మడి రాష్ట్రంలోనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై అప్పట్లో శాఖాపరమైన విచారణ జరిగింది. తాను ఎలాంటి తప్పుు చేయలేదని ఆయన వివరణ ఇచ్చారు. ఈ అంశంపై విజిలెన్స్ అధికారులు సైతం విచారణ జరిపి ఆయనపై వచ్చిన అభియోగాలను ఉపసంహరించారు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే ఈ కేసు ముగిసింది. తాజాగా మళ్లీ తెరపైకి వచ్చింది.
ప్రభుత్వం కక్ష కట్టింది: చంద్రబాబు
తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు ఉద్యోగుల సమస్యలపై పోరాడుతున్నందుకే ప్రభుత్వం ఆయనపై కక్ష కట్టిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వీస్ మేటర్స్‌లో తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారని ఆరోపించారు. అర్ధరాత్రి అదుపులోకి తీసుకోవాల్సినంత అవసరమేముందని, జగన్ సర్కారు చేస్తున్న ప్రతి తప్పునకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అర్ధరాత్రి అక్రమంగా అశోక్ బాబును అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్ బాబు పేర్కొన్నారు.
సంబంధిత కథనం