Telugu News Updates 03 February : కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత….
- కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కె.విశ్వనాథ్ అపోలో ఆస్పత్రితో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కె.విశ్వనాథ్ మృతి పట్ల సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. విశ్వనాథ్ మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు.1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా రేపల్లెలో కాశినాథుని విశ్వనాథ్ జన్మించారు. గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశారు. ఆ తర్వాత వాహిని స్టూడియోస్‌లో సౌండ్ ఆర్టిస్టుగా సినీ కెరీర్‌ను మొదలుపెట్టారు. 1965లో వచ్చిన ఆత్మగౌరవం సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన కె.విశ్వనాథ్ ఎన్నో అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు.
Fri, 03 Feb 202304:56 PM IST
గవర్నర్ చెప్పాలి…
గవర్నర్ అసెంబ్లీలో చదివిన ప్రసంగం అంతా.. నిన్నటి వరకు ఆమె మాట్లాడిన దానికి భిన్నంగా ఉందన్నారు కాంగ్రెస్ నేత మల్లు రవి. ఆమె ఎందుకు పూర్తిగా యూటర్న్ తీసుకుందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
Fri, 03 Feb 202304:49 PM IST
షర్మిల ఫైర్…
YS Sharmila Padayatra in Warangal District: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగుతోంది. వర్ధన్నపేట నియోజకవర్గంలో పర్యటించిన ఆమె... బీఆర్ఎస్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రుణమాఫీ నుంచి దళితబంధు వరకు కేసీఆర్ వన్నీ మోసాలే అని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కేసీఆర్ అని ఆరోపించారు. తెలంగాణ సొమ్మును లూటీ చేసి, దేశంలోనే అత్యంత సంపన్న రాజకీయ నాయకుడిగా ఎదిగాడని ఆరోపించారు. హిడెన్ బర్గ్ మీద ఎలాగైతే చర్చ జరుగుతుందో.. కేసీఆర్ అవినీతి మీద కూడా చర్చ జరగాలని వ్యాఖ్యానించారు.
Fri, 03 Feb 202304:30 PM IST
గ్రూప్ 4 దరఖాస్తులు
TSPSC Group 4 Recruitment 2022 Updates: తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే గ్రూప్ 1,2,3 4 నోటిఫికేషన్లు రాగా... మరోవైపు ఇతర శాఖలోని పోస్టులు కూడా భర్తీ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. దాదాపు అన్నీ ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభం కాగా... పలు ఉద్యోగాల రాత పరీక్ష తేదీలను ప్రకటించింది. ఇదిలా ఉండగా జూలై 1వ తేదీన గ్రూప్ 4 పరీక్ష నిర్వహించనున్నారు. అయితే ఇవాళ్టి(ఫిబ్రవరి 3)తో దరఖాస్తుల గడువు ముగిసింది.
Fri, 03 Feb 202303:57 PM IST
నోటిఫికేషన్
వరంగల్ లోని నిట్ (నేషనల్ ఇనిస్ట్యూట్ ఇఫ్ టెక్నాలజీ) ఉద్యోగ నోటిఫికేన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 10 రకాల నాన్ టీచింగ్ సిబ్బంది పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 29 ఉద్యోగాలను రెగ్యూలర్ పద్దతిలోనే రిక్రూట్ చేయనుంది. ఈ మేరకు విడుదల చేసిన నోటిఫికేషన్ లో పోస్టుల వివరాలతో పాటు.. అర్హతలను పేర్కొంది.
Fri, 03 Feb 202301:34 PM IST
బ్రహ్మోత్సవాలు
ఈసారి ఫిబ్రవరి 11 నుంచి 21 వరకు మహాశివరాత్రి బ్రహోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల రోజుల్లో.. ఆలయ దర్శన విధానాల్లో కీలక మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు రెండు రోజుల ముందు 9వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత 23వ తేదీ వరకు 15 రోజులపాటు శివ స్వాములు జ్యోతిర్ముడి సమర్పణకు ఏర్పాట్లు చేయనున్నారు. ఇరుముడి ధారణస్వాములకు మాత్రం 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్ధిష్ట వేళలో మల్లిఖార్జునిడి స్పర్శదర్శనం కల్పించనున్నారు.
Fri, 03 Feb 202301:05 PM IST
ప్రమాదం
వరంగల్ సిటీలోని అండర్ బ్రిడ్జి ప్రాంతంలో ఉన్న స్క్రాప్ దుకాణంలో ఈ ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో చుట్టపక్కల వారు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. కరెంట్ షార్ట్ సర్క్యూట్ తోనే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మొత్తం ఏడు ఫర్నిచర్ షాప్ లతోపాటు ఫర్టిలైజర్ షాప్, పాత ఇనుప సామాను షాపులు అగ్నికి పూర్తిగా కాలిపోయాయి.
Fri, 03 Feb 202311:17 AM IST
సీఎంకు రేవంత్ లేఖ
రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. గడిచిన నాలుగేళ్లలో రెండు విడతల్లో కలిపి మొత్తం మీరు మాఫీ చేసింది కేవలం రూ.3,881 కోట్లు మాత్రమే అని గుర్తు చేశారు. ఇంకా రూ.20,857 కోట్లు మాఫీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. దళిత సామాజిక వర్గానికి మీరు తీరని అన్యాయం చేశారన్న రేవంత్ రెడ్డి... తొలి దళిత ముఖ్యమంత్రి మొదలు, ప్రతి కుటుంబానికి మూడెకరాలు భూమి వరకు ఒక్కటంటే ఒక్క హామీని నెరవేర్చలేదని లేఖలో ప్రస్తావించారు. దళితబంధు పేరుతో ఆ వర్గాలను మరోసారి వంచించేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. పథకం అమలు తీరు చూస్తే ఊరికో కోడి... ఇంటికో ఈక అన్నట్లు తయారైందని ఎద్దేవా చేశారు.
Fri, 03 Feb 202309:53 AM IST
భేటీ
BRS Expand in Andhrapradesh: బీఆర్ఎస్... ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్..! ఎవరూ ఊహించని విధంగా ఏపీకి చెందిన కొందరు ముఖ్య నేతలు గులాబీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఈ పరిణామం తెలుగు రాజకీయాల్లో తెగ చర్చకు కూడా దారి తీసింది. మరోవైపు కేసీఆర్ టార్గెట్ గా వైసీపీ, కాంగ్రెస్ పార్టీలే కాదు మరిన్ని పక్షాలు కూడా కాస్త ఘాటుగానే స్పందించాయి. రాష్ట్ర విభజనకు కారణమైన కేసీఆర్... ఏపీలో పార్టీని ఎలా విస్తరిస్తారని కూడా ప్రశ్నించాయి. ఇక పవన్ వంటి నేతలు స్వాగతించారు. కేసీఆర్ - జగన్ వ్యూహంలో భాగంగానే పలువురు ఏపీ నేతలు బీఆర్ఎస్ లో చేరారనే వాదన కూడా బలంగా తెరపైకి వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా విశాఖ వేదికగా జరిగిన ఈ భేటీ అత్యంత ఆసక్తికరంగా మారింది. దీనిపై రకరకాలుగా ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి.
Fri, 03 Feb 202309:52 AM IST
డ్రోన్ కలకలం
శ్రీకాకుళం జిల్లాలో ఓ డ్రోన్ కలకలం సృష్టించింది. భావనపాడు సమీపంలో మత్స్యకారుల వలకు చిక్కింది. విమానాన్ని పోలిన 10 అడుగుల డ్రోన్ లభ్యం కావడంతో మత్స్యకారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డ్రోన్లపై టార్గెట్ బన్షీ అని స్టిక్కర్లు అతికించి ఉన్నాయి. దాదాపు 111 కిలోల బరువు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై మెరైన్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆకతాయిల పనా లేక ఏదైనా కుట్ర దాగి ఉందా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు
Fri, 03 Feb 202306:59 AM IST
గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్తత
తెలంగాణలో కొత్తగా నిర్మిస్తున్న సచివాలయంలో అగ్నిప్రమాదం జరగడంతో ఘటనా స్థలాన్ని సందర్శించేందుకు బయల్దేరిన కాంగ్రెస్ నాయకుల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కేసీఆర్, పోలీసులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేశారు. గాంధీ భవన్ నుంచి బయటకు రాకుండా తెలంగాణ కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.
Fri, 03 Feb 202306:52 AM IST
విశ్వనాథ్ అంత్యక్రియల్లో ఏపీ మంత్రి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున దర్శకుడు కె.విశ్వనాథ్ గారి అంత్యక్రియలలో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పాల్గొననున్నారు. హైదరాబాదులో జరుగుతున్న కె.విశ్వనాథ్ గారి అంత్యక్రియలో పాల్గొని ఆయన పార్ధివ దేహాన్నికి నివాళులు అర్పించనున్నారు.
Fri, 03 Feb 202306:48 AM IST
కడప చేరుకున్న సిబిఐ బృందం
మాజీ మంత్రి వైయస్ వివేకానంద హత్య కేసులో సిబిఐ బృందం కడప చేరుకుంది. కడప సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్ లో మరి కాసేపట్లో సిబిఐ విచారణకు హాజరుకానున్నారు. కడప సెంట్రల్ జైల్లో ఇప్పటికే రిమాండ్ లో ఉన్న దేవి రెడ్డి శంకర్ రెడ్డి, యాదాటి సునీల్, ఉమా శంకర్ రెడ్డిలను సిబిఐ విచారించే అవకాశం ఉంది.
Fri, 03 Feb 202306:47 AM IST
తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం
తెలంగాణ శాసనసభా సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ తమిళసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత బిఏసి సమావేవం జరుగనుంది.
Fri, 03 Feb 202306:17 AM IST
వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ
వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ వ్యక్తిగత సిబ్బంది సీబీఐ ఎదుట హాజరుకానున్నారు. ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతి సహాయకుడు నవీన్ సిబిఐ విచారణకు హాజరు కానున్నారు. సీఎంకు ఓఎస్ డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి , నవీన్‌లకు ఎంపీ అవినాష్ కాల్ చేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, నవీన్ లకు సీబీఐ నోటీసులు జారీ చేసింది.
Fri, 03 Feb 202304:21 AM IST
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. అసెంబ్లీ వాయిదా అనంతరం బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. రెండు వారాల పాటు తెలంగాణ అసెంబ్లీ నిర్వహించే యోచనలో సర్కార్ ఉంది.
Fri, 03 Feb 202304:15 AM IST
అచ్చన్నాయుడు సంతాపం…
కళా తపస్వి కె.విశ్వనాథ్ మృతితో కళామతల్లి తన ముద్దు బిడ్డని కోల్పోయిందని కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సినీ దర్శకుడు,నటుడు కె.విశ్వనాథ్ మృతి బాధాకరం. 50కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన అనేక సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారని చెప్పారు. సినిమాల్లో ఏ పాత్ర ఇచ్చినా అందులో జీవిస్తూ వెండితెరపై ఓ వెలుగు వెలిగారన్నారు .విశ్వనాథ్ మృతితో కళామతల్లి తన ముద్దు బిడ్డని కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియ చేశారు.
Fri, 03 Feb 202304:14 AM IST
తెలుగుజాతి ముద్దుబిడ్డ కె విశ్వనాథ్… బాలకృష్ణ
కళాతపస్వి కె విశ్వనాథ్ తెలుగుజాతి ముద్దుబిడ్డ..ఆయన మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకే తీరనిలోటన్నారు నందమూరి బాలకృష్ణ. విశ్వనాథ్ ప్రతి సినిమా ఒక అద్భుత కళాఖండమని, అందుకే ఆయన కళాతపస్వి అయ్యారని చెప్పారు. మన సంస్కృతి, సంగీత, సాహిత్యాల ఔన్నత్యాన్ని దశదిశలా చాటిచెప్పారన్నారు. కె విశ్వనాథ్ మృతితో తెలుగు సినీ పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను. విశ్వనాథ్ గారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని సందేశంలో పేర్కొన్నారు.
Fri, 03 Feb 202304:13 AM IST
కళా తపస్వి కన్నుమూతపై టీడీపీ అధినేత దిగ్భ్రాంతి
ప్రముఖ దర్శకులు, కళా తపస్వి కె. విశ్వనాథ్ మరణ వార్తపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. కళాఖండాలుగా నిలిచిన అనేక చిత్రాలను అందించిన విశ్వనాథ్ మృతి తనను తీవ్రంగా కలచివేసిందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటని చంద్రబాబు నాయుడు అన్నారు. విశ్వనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Fri, 03 Feb 202304:12 AM IST
సిఎం జగన్ సంతాపం….
ప్రముఖ సినీదర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణించడంపై ముఖ్యమంత్రి వైయస్.జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తెలుగు సినీదర్శకుల్లో విశ్వనాథ్ అగ్రగణ్యుడని ముఖ్యమంత్రి కొనియాడారు. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు తన సినిమాల ద్వారా గొప్ప గుర్తింపును తీసుకువచ్చారన్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు, సినీ సాహిత్యానికి, సంప్రదాయ సంగీతానికి, కళలకు.. ముఖ్యంగా తెలుగు చలనచిత్ర రంగానికి ఎనలేని ప్రతిష్టను తీసకువచ్చాయన్నారు. సామాజిక అంశాలను ఇతివృత్తంగా తీసుకుని విశ్వనాథ్ చేసిన సినిమాలు గొప్ప మార్పునకు దారితీశాయన్నారు. విశ్వనాథ్ మహాభినిష్క్రమణం తెలుగు సినీరంగానికి గొప్ప లోటని సీఎం అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్సార్ పేరుమీద రాష్ట్రప్రభుత్వం లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డును విశ్వనాథ్‌గారికి ఇచ్చిన అంశాన్ని ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు. విశ్వనాథ్ కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.