ADR Report : నారా లోకేష్‌ రిచెస్ట్ ఎమ్మెల్సీ…-adr report findings on ap legislative council members ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Adr Report : నారా లోకేష్‌ రిచెస్ట్ ఎమ్మెల్సీ…

ADR Report : నారా లోకేష్‌ రిచెస్ట్ ఎమ్మెల్సీ…

HT Telugu Desk HT Telugu
Aug 14, 2022 07:53 AM IST

ఆంధ్రా ఎమ్మెల్సీల్లో సగం మందికి పైగా నేర చరితులేనని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫర్మ్స్‌ తాజా నివేదిక వెల్లడించింది. ఏపీ మండలిలో ఉన్న 58మంది సభ్యుల్లో 48మంది వివరాలను విశ్లేషించిన తర్వాత ఈ విషయం స్పష్టమైంది.

శాసనమండలిలో నారా లోకేష్ రిచెస్ట్ ఎమ్మెల్సీ
శాసనమండలిలో నారా లోకేష్ రిచెస్ట్ ఎమ్మెల్సీ

పెద్దల సభగా భావించి ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిలో సగం మందికి పైగా నేర చరితులేనని తేలిపోయింది. అభ్యర్ధులు తమకు తాముగా ఇచ్చిన అఫిడవిట్లలో నేర చరిత్రను వెల్లడించడంతో ఈ విషయం వెల్లడైంది. శాసన మండలి సభ్యుల్లో 20మందికి పైగా క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వైసీపీకి సభలో 26మంది సభ్యులున్నారు. వారిలో 13మంది సభ‌్యులు వివిధ రకాల నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. టీడీపీ సభ్యుల్లో 46శాతం మంది సభ్యులు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఏపీ శాసన మండలిలో ఉన్న 58మంది సభ్యుల్లో 48మంది నామినేషన్ పత్రాలు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉండటంతో వాటి ఆధారంగా అభ్యర్ధుల విద్యార్హత, క్రిమినల్ కేసులు, వయసు, ఆదాయం, ఆస్తుల వివరాలను ఏడిఆర్‌ విశ్లేషించింది. టీడీపీ ఎమ్మెల్సీలు అంగర రామ్మోహన్‌, బచ్చుల అర్జుడు నామినేషన్ పత్రాలు అందుబాటులో లేకపోవడం, నామినేటెడ్ ఎమ్మెల్సీలు అఫిడవిట్లు సమర్పించాల్సిన అవసరం లేకపోవడంతో 48మందినే ప్రమాణికంగా తీసుకున్నారు.

ఏపీ మండలిలో ఉన్న సభ్యుల్లో 75శాతం మంది కోటీశ్వరులని తేలింది. మొత్తం సభ్యుల్లో 36మంది సభ్యులు కోట్లకు పడగలెత్తారని గుర్తించారు. వైసీపీ ఎమ్మెల్సీలలో 22మంది కోటీశ్వరులు ఉంటే టీడీపీ ఎమ్మెల్సీలలో 11మంది కోటీశ్వరులున్నారు. ఆస్తులు, ఆదాయ క్రమంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అత్యంత సంపన్నుడిగా ఉన్నారు. నారాలోకేష్‌కు రూ.369కోట్ల రుపాయల ఆస్తులున్నాయి. ఆయన తర్వాతి స్థానంలో నెల్లూరు ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి ఉన్నారు. నారాయణ రెడ్డికి రూ.101 కోట్ల రుపాయల ఆస్తులున్నాయి. మూడో స్థానంలో రూ.36కోట్లతో ఎమ్మెల్సీ మాధవరావు నిలిచారు. స్వతంత్ర ఎమ్మెల్సీ పి.రఘువర్మకు అతితక్కువగా రూ.1,84,527 ఆస్తులు మాత్రమే ఉన్నాయి. పదికోట్ల రుపాయల ఆస్తులున్న ఎమ్మెల్సీలు 12మంది ఉండగా, రూ.5-10కోట్ల మధ్య ఆస్తులున్న వారు 19మంది ఉన్నారు. రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకు ఆస్తులున్న వారు 11మంది, రూ.20లక్షల్లోపు ఆస్తులున్న వారు ఒకరున్నారు. ఎమ్మెల్సీల సగటు ఆస్తి రూ.16.26కోట్లు ఉంది.

ఎమ్మెల్సీలలో ఎనిమిది మంది 5-12తరగతుల వరకు చదువుకోగా 40మంది గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. వీరిలో ఇద్దరు డాక్టర్లు, 8మంది పోస్టు గ్రాడ్యుయేట్లు, ఐదుగురు గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్స్‌, నలుగురు ఇంటర్‌, ఒకరు పది, ఒకరు ఐదు చదువుకున్నారు.

ముగ్గురిపై తీవ్ర నేరాభియోగాలు….

తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో దువ్వాడ శ్రీనివాస్‌పై హత్యాయత్నం, చోరీ, దోపిడీ కేసులు ఉన్నాయి. గంగుల ప్రభాకర్‌ రెడ్డిపై మారణాయుధాల వినియోగం, అల్లర్లు, దాడుల కేసులు నమోదయ్యాయి. కాకినాడ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌పై వివిధ వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టారనే అభియోగాలున్నాయి.

టాపిక్