Letter to CJI : కోడికత్తి కేసులో జోక్యం కోరుతూ సీజేఐకు లేఖ-accused person parents writes letter to cji on nia investigation ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Letter To Cji : కోడికత్తి కేసులో జోక్యం కోరుతూ సీజేఐకు లేఖ

Letter to CJI : కోడికత్తి కేసులో జోక్యం కోరుతూ సీజేఐకు లేఖ

HT Telugu Desk HT Telugu
Jul 10, 2022 10:57 AM IST

వైసీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో నాలుగేళ్ల క్రితం జరిగిన దాడి వ్యవహారంలో దర్యాప్తు నిష్పాక్షికంగా జరగలేదని ఆరోపిస్తూ నిందితుడి తల్లిదండ్రులు భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. నాలుగేళ్లుగా కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదని, తమ కుమారుడిని విడుదల చేయాలని కోరుతూ రెండు పేజీల లేఖను ప్రధాన న్యాయమూర్తికి పంపారు.

<p>కుమారుడిని విడుదల చేయాలంటూ ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖను చూపుతున్న శ్రీనివాసరావు తల్లిదండ్రులు</p>
కుమారుడిని విడుదల చేయాలంటూ ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖను చూపుతున్న శ్రీనివాసరావు తల్లిదండ్రులు

వైసీపీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై నాలుగేళ్ల క్రితం జరిగిన దాడి వ్యవహారంలో నిందితుడు జనుపల్లె శ్రీనివాసరావును విడుదల చేయాలంటూ అతని తల్లి దండ్రులు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు లేఖ రాశారు. నాలుగేళ్లుగా రిమాండ్ ఖైదీగా ఉన్న తమ కుమారుడిని విడిపించాలని వేడుకున్నారు. రెండు పేజీల లేఖను రిజిస్టర్ పోస్టులో సీజేఐకు పంపారు.

2018లో అప్పటి ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డిపై జరిగిన దాడి ఘటనల జనుపల్లె శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రికి టీ అందించే సమయంలో కోడి పందాలకు వాడే కత్తితో ఆయనపై దాడి చేసే ప్రయత్నం చేశాడు. ఈ కేసులో నిందితుడ్ని ఎయిర్‌ పోర్ట్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం ఠాణేలంకకు చెందిన శ్రీనివాసరావు విశాఖపట్నం ఫ్యూజన్‌ ఫుడ్‌ పాయింట్‌లో పనిచేసేవాడు. ముఖ్యమంత్రికి టీ అందిస్తున్నట్లు దగ్గరకు వచ్చి కోడి పందాలకు వాడే కత్తితో ఆయనపై దాడి చేసేందుకు యత్నించాడు. ఈ ఘటనలో నిందితుడిపై హత్యాయత్నం కింద కేసు నమోదైంది. 2018 అక్టోబర్‌ 25న జగన్‌పై దాడి జరగ్గా 75రోజుల తర్వాత నిందితుడికి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఆ తర్వాత ఎన్‌ఐఏకు కేసు దర్యాప్తు బాధ్యతలు అప్పగించడంతో 2019 ఆగష్టు 13న జనుపల్లె శ్రీనివాసరావును అరెస్ట్‌ చేశారు.

దాదాపు మూడున్నరేళ్లుగా రిమాండ్‌లో ఉన్న జనుపల్లె శ్రీనివాసరావును అకారణంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారని అతని తల్లిదండ్రులు తాతారావు, సావిత్రిలు ఆరోపిస్తున్నారు. ఫ్లవర్‌ డెకరేషన్‌ చేయడానికి వాడే కత్తి మాత్రమే ఆ సమయంలో శ్రీనివాసరావు జేబులో ఉందని నిందితుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. నాలుగేళ్లుగా కేసు దర్యాప్తు ముందుకు సాగడం లేదని, విచారణకు ముందుకు సాగకపోవడంతో రిమాండ్ ఖైదీగానే జైల్లో ఉన్నాడని సీజేఐకు తెలిపారు.ఎన్‌ఐఏ అధికారులు ప్రభుత్వ పెద్దల సూచనలతోనే తమ కుమారుడిని జైల్లో ఉంచారని ఆరోపిస్తున్నారు. పోలీసులు, ఎన్‌ఐఏ అధికారులు తమ కుమారుడిని జైల్లోనే ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారని,తమ కుమారుడికి న్యాయ సహాయం అందకుండా అడ్డు పడుతున్నారని ఆరోపించారు.

నిందితుడు జనుపల్లె శ్రీనివాసరావు వ్యవహారం ప్రభుత్వ పెద్దలతో ముడిపడి ఉన్నది కావడంతో బెయిల్ రాకుండా అడ్డుపడుతున్నారని నిందితుడి తల్లి ఆరోపిస్తోంది. కేసు విషయంలో జోక్యం చేసుకుని తమ కుమారుడిని విడిపించాలని వేడుకున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు విశాఖ పర్యటనకు వెళ్లిన సమయంలో జగన్మోహన్‌ రెడ్డిపై దాడి జరిగింది. ఈ దాడి ఎందుకు జరిగిందనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు.పొంతన లేకుండా, రకరకాల వాదనల్ని తెరపైకి తెచ్చి కేసును నీరు గార్చారని రాజకీయ పక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూనే ఉన్నారు.

Whats_app_banner