Helicopter Ambulance: హెలికాఫ్టర్‌లో గుండె తరలింపు, యువకుడి ప్రాణాలు నిలిపిన ఏపీ సిఎం
Helicopter Ambulance: ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి చొరవతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకుడికి గుండె మార్పిడి శస్త్ర చికిత్స కోసం హెలికాఫ్టర్ ఏర్పాటైంది. గుంటూరులో బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి గుండెను హెలికాఫ్టర్ ద్వారా తిరుపతి తరలించారు.
Helicopter Ambulance: ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తి ప్రాణం నిలిపేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవ చూపించారు. గుంటూరులో బ్రెయిన్ డెడ్ స్థితిలో ఉన్న ఇంటర్ విద్యార్ధి గుండెను తిరుపతి తరలించడానికి ఏకంగా హెలికాప్టర్ వినియోగించారు. దీంతో సకాలంలో గుంటూరు నుండి తిరుపతికి 'గుండె' చేరింది. పద్మావతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించారు.
తిరుపతిలో గుండె మార్పిడి అవసరమైన వ్యక్తి కోసం గుంటూరు నుండి ఏకంగా ప్రత్యేక హెలీకాప్టర్ ద్వారా గుండె తరలించేందుకు సిఎం జగన్ ఆదేశాలతో ఏర్పాట్లు చేశారు. రోడ్డు మార్గం ద్వారా తరలించేసరికి విలువైన సమయం వృథా అవుతుందని భావించి పరిస్థితిని అధికారులు సిఎం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆగమేఘాలపై హెలీకాప్టర్ ను రప్పించి, గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి శస్త్ర చికిత్సకు మార్గం సుగమం చేశారు.
గుంటూరులో ప్రమాద వశాత్తూ బ్రెయిన్ డెడ్ అయిన 18 ఏళ్ల కట్టా కృష్ణ అనే యువకుడి అవయవాలు దానం చేసేందుకు అతని కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. ఇంటర్ సెకండియర్ చదువుతున్న కృష్ణ రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ స్థితికి చేరుకున్నాడు. అతను బ్రతికే అవకాశాలు లేవని, అవయవదానం గురించి కుటుంబ సభ్యులకు వైద్యులు వివరించడంతో అందుకు వారు సమ్మతించారు. దీంతో ఇంటర్ విద్యారధి గుండె మార్పిడి చేసి తిరుపతికి చెందిన 33 ఏళ్ల వ్యక్తిని బతికించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ముఖ్యమంత్రి చొరవతో గుండెను తరలించడానికి హెలికాఫ్టర్ ఏర్పాటు చేశారు. ఆ వెంటనే తిరుపతి పద్మావతి ఆస్పత్రిలో ఆరో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విజయవంతమైంది. బ్రెయిన్‌డెడ్ అయిన 19 ఏళ్ల యువకుడి గుండెను 33ఏళ్ల వ్యక్తికి అమర్చారు.
సీఎం జగన్ చొరవతో రెండేళ్ల క్రితమే టీటీడీ ఆధ్వర్యంలో హార్ట్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. రెండేళ్లలోనే 1900 గుండె ఆపరేషన్లను ఈ ఆస్పత్రిలో నిర్వహించారు. దేశం నలుమూలల నుంచి హృద్రోగాలకు సంబంధించిన రోగులు తిరుపతికి తరలివస్తున్నారు. గుండె మార్పిడి చికిత్సను కూడా విజయవంతంగా నిర్వహించి రికార్డు సృష్టించింది.