Tirupathi Accident: దర్శనానికి వచ్చి.. ప్రాణాలు పోగొట్టుకున్న రిటైర్డ్ డాక్టర్
Tirupathi Accident: కుమార్తెతో కలిసి తిరుపతి గోవిందరాజస్వామి ఆలయానికి వచ్చిన వైద్యుడు చెట్టుకూలడంతో ప్రాణాలు కోల్పోయారు. గురువారం సాయంత్రం గాలివానకు వందల ఏళ్ల నాటి రావిచెట్టు నిలువున చీలిపోయింది. ఆ సమయంలో చెట్టు కింద ఉన్న భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
Tirupathi Accident: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వందల ఏళ్ల నాటి రావిచెట్టు గురువారం సాయంత్రం ఒక్కసారిగా కూలిపోవడంతో కడపకు చెందిన విశ్రాంత వైద్యుడు ప్రాణాలు కోల్పోయారు.
గోవిదంరాజ స్వామి ఆలయ మహాద్వారానికి ఎదురుగా ఉన్న భారీ వృక్షం.. గాలివానకు మొదలు నుంచి రెండు ముక్కలుగా చీలిపోయి అక్కడే ఉన్న భక్తులపై పడింది. ఈ ఘటనలో కడపకు చెందిన రిమ్స్ విశ్రాంత వైద్యుడు డా.రాయదుర్గం గుర్రప్ప తలకు గాయమై అక్కడిక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
గుర్రప్ప కుమార్తె శ్రీ రవళి తిరుపతి నగరంలోని ఓ కళాశాలలో వైద్య విద్య అభ్యసిస్తుంటడంతో ఆమెను చూడటానికి తిరుపతి వచ్చారు. అనంతరం కుమార్తెతో కలిసి దర్శనానికి రాగా చెట్టు కూలిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
తండ్రి మృతదేహం వద్ద కుమార్తె రోదించిన తీరు అక్కడున్న వారిని కలచివేసింది. చెట్టు కూలడానికి ముందు ఆలయంలో వాహనసేవకు వచ్చిన ఏనుగులు చెట్టు కూలిపోవడానికి కొద్ది క్షణాల ముందు భీకరంగా ఘీంకారం చేయడంతో సిబ్బంది వాటిని అదుపు చేశారు. ప్రమాదాన్ని పసిగట్టి ఏనుగులు ఘీంకరిచినట్లు చెబుతున్నారు.
శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని రావిచెట్టు పడిపోయిన విషయం తెలిసిన వెంటనే టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ఎవి ధర్మారెడ్డి, ఇతర అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అధికారులు, సిబ్బందికి తగిన ఆదేశాలు ఇచ్చి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు.
సుమారు 300 సంవత్సరాల నాటి రావిచెట్టు కూలిన సంఘటనలో కడప జిల్లాకు చెందిన డాక్టర్ గుర్రప్ప మృతి చెందడంపై ఛైర్మన్ విచారం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయలేమన్నారు. మృతుడి కుటుంబానికి రూ 5 లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తామని చైర్మన్ తెలిపారు.
ఈ సంఘటనలో ఒకరికి కాలు,మరొకరికి తలకు మరో ఇరువురి గాయాలు అయ్యాయని సుబ్బారెడ్డి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శ్రీ గోవింద రాజస్వామి ఆలయంలో రావి చెట్టుకూలిన సంఘటనలో గాయపడి బర్డ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ఎవి ధర్మారెడ్డి, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్ గురువారం రాత్రి పరామర్శించారు.
తిరుపతికి చెందిన క్షతగాత్రులు చంద్రశేఖర్ , బేబి, నిహారిక ఆరోగ్య పరిస్థితి గురించి వీరు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు.