Tirupati Crime : తిరుపతిలో ఘోరం - అనుమానంతో భార్య గొంతు కోసి హత్య చేసిన భర్త
తిరుపతి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. అనుమానంతో కట్టుకున్న భార్యను భర్త హత్య చేశాడు. కత్తితో గొంతు కోసి అతి కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తిరుపతి జిల్లాలో ఘోర ఘటన చోటు చేసుకుంది. అనుమానంతో కట్టుకున్న భార్యను భర్తే హత్య చేశాడు. కత్తితో గొంతె కోసి అతి కిరాతకంగా హత్యకు పాల్పడ్డాడు. తల్లి హత్యతో ఇద్దరు పిల్లలు కన్నీరు మున్నీరు అయ్యారు. అయితే హత్య చేసిన తరువాత భర్త నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటన తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం మంగళం గ్రామంలోని గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటన శుక్రవారం ఉదయం బయటపడింది. మంగళం గ్రామంలో రమేష్, రూపవతి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే భార్య రూపవతిపై భర్త రమేష్ అనుమానం పెంచుకున్నాడు. దీంతో వీరి మధ్య తరచూ గొడవులు జరుగుతున్నాయి.
తాజాగా కూడా అనుమానంతోనే భార్య రూపవతితో భర్త రమేష్ గొడవకు దిగాడు. దీంతో భార్య రూపవతి అలిగి తిరుపతి అర్బన్‌లోని ఎస్టీ నగర్‌లో ఉంటున్న తన అమ్మ వద్దకు వెళ్లిపోయింది. ఎన్ని రోజులు కావస్తున్న భార్య రాకపోవడంతో తీసుకురావడానికి రమేష్ తన తండ్రి, తమ్ముడుతో కలిసి అత్తగారింటికి వెళ్లాడు. అక్కడ అత్తగారికి నచ్చజెప్పి భార్యను తీసుకొని మంగళం గ్రామానికి వచ్చాడు.
ఈ నేపథ్యంలో గురువారం రాత్రి రమేష్ మద్యం సేవించి ఇంటికి రావడంతో భార్యాభర్తల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఎందుకు మద్యం తాగావని భార్య రూపవతి నిలదీసింది. దీంతో ఆగ్రహానికి గురైన రమేష్ భార్యపై దాడికి పాల్పడ్డాడు. గొడవ ఇంకా కొనసాగడంతో కన్న బిడ్డలను ఆ గది నుంచి బయటకు పంపించేశాడు. గదికి గడియ పెట్టి భార్య రూపవతిని కత్తితో గొంతె కోసి అతి కిరాతకంగా హత్య చేశాడు.
ఈ సమయంలో పిల్లలు గది బయట నుంచి వద్దని కేకలు వేస్తున్న పట్టించుకోకుండా భార్యను హతమార్చాడు. అయితే భార్య చనిపోయిందని నిర్ధారించుకున్న తరువాత గది తలుపు తెరిచాడు. అప్పటికే బావు రామ్మని ఏడ్చుతున్న పిల్లలకు మీ అమ్మ చనిపోయిందని చెప్పి, గురువారం అర్థరాత్రి సమయంలో నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పరిశీలించారు. అనంతరం మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తల్లిని కోల్పోయిన పిల్లలు, కుమార్తెను కోల్పోయిన కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనతో మంగళం గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని రూపవతి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.