AP Wine Shop Tenders 2024 : ఏపీలో మద్యం షాపుల దరఖాస్తుల ఫైనల్ డేటా.. 11 ముఖ్యాంశాలు ఇవే!
AP Wine Shop Tenders 2024 : ఏపీలో మద్యం దుకాణాల లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకునే గడువు ముగిసింది. రేపు అధికారులు డ్రా తీయనున్నారు. ఇటు వైన్ షాపులను దక్కించుకోవడానికి భారీగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 89 వేల 882 అప్లికేషన్లు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లో వైన్ షాపుల లైసెన్స్‌ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. దరఖాస్తుల గడువు ముగిసే సమయానికి దాదాపు 90 వేల దరఖాస్తులు వచ్చాయి. తాజాగా అధికారులు ఫైనల్ డేటాను విడుదల చేశారు. అధికారులు ఆశించిన దానికంటే.. ఎక్కువ ఆదాయం వచ్చింది. ఇక లాటరీ తీసి.. షాపులు కేటాయించడమే మిగిలింది. 14వ తేదీన వైన్ షాపులు కేటాయించనున్నారు.
11 కీలక అంశాలు..
1. మొత్తం 3396 మద్యం దుకాణాలను నోటిఫై చేయగా.. 89 వేల 882 దరఖాస్తులు వచ్చాయి.
2. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి 1797.64 కోట్ల ఆదాయం వచ్చింది.
3. దరఖాస్తుల ద్వారా 1500 నుంచి 1600 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది.
4. ప్రభుత్వ అంచనాలకు మించి దరఖాస్తు రుసుం ద్వారా దాదాపు 1800 కోట్ల ఆదాయం వచ్చింది.
5. ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో ఒక్కో దుకాణానికి సరాసరి 50 దరఖాస్తులు వచ్చాయి.
6. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి దుకాణానికి సరాసరి 25 దరఖాస్తులు దాఖలు అయ్యాయి.
7. రేపే (అక్టోబర్ 14వ తేదీ సోమవారం) మద్యం దుకాణాలకు జిల్లా కేంద్రాల్లో డ్రా తీయనున్నారు.
8. మాన్యువల్ పద్ధతి ద్వారా అధికారులు డ్రా తీయనున్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగనుంది.
9. డ్రా పద్ధతిలో దుకాణం దక్కించుకున్న వ్యాపారులు.. 24 గంటల్లో లైసెన్స్ ఫీజు చెల్లించాలి.
10. ఈనెల 16 నుంచి ఏపీలో ప్రైవేట్ మద్యం దుకాణాలు అందుబాటులోకి రానున్నాయి.
11. ఏపీలో అన్ని బ్రాండ్ల బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించిన ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ప్రివిలేజ్ ఫీజు విధిస్తూ..
భారత్‌లో తయారయ్యే విదేశీ మద్యం ధరకు అదనపు ప్రివిలేజ్ ఫీజు విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఫీజు కింద ఎమ్మార్పీలో చిల్లర కాకుండా తదుపరి పది రూపాయలకు రౌండాఫ్ చేసింది. విదేశీ మద్యం బాటిల్ ఎమ్మార్పీ ధరపై అదనపు ప్రివిలేజ్ ఫీజు విధిస్తూ ఏపీ ప్రభుత్వం సవరణ చేసింది. దీనికి గవర్నర్ ఆమోదం మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
నాలుగు రెట్లు ఎక్కువ..
ఆంధ్రప్రదేశ్‌లో 2017 మార్చిలో చివరిసారిగా ప్రైవేటు మద్యం పాలసీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. అప్పట్లో 4 వేల 380 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. మొత్తం 76 వేల దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దుకాణానికి సగటున 17 నుంచి 18 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు, రిజిస్ట్రేషన్ రుసుముల రూపంలో 2017లో రూ.474 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి అప్పటికంటే తక్కువ దుకాణాలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వానికి రూ.1797.64 కోట్ల ఆదాయం వచ్చింది