YS Sharmila Complaint : మంత్రి KTRపై పోలీసులకు షర్మిల ఫిర్యాదు
05 May 2023, 15:13 IST
- YS Sharmila Latest News:మంత్రి కేటీఆర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. పేపర్ లీక్ కేసులో ఐటీ శాఖపై విచారణ జరిపించాలని కోరారు.
వైఎస్ షర్మిల ఫిర్యాదు
YS Sharmila Police Complaint Against KTR: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక అంశాలు విషయాలు బయటికి వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు.... మరిన్ని విషయాలను బయటికి లాగే పనిలో పడింది. సిట్ విచారణపై హైకోర్టు కూడా సంతృప్తిని వ్యక్తం చేయగా… దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని ఆదేశించింది. మరోవైపు ఈడీ కూడా విచారిస్తోంది. భారీగా నగదు చేతులు మారినట్లు ప్రాథమికంగా గుర్తించింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం... ప్రభుత్వంపై పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల... మంత్రి కేటీఆర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీపై ప్రగతి భవన్ సూచనలతోనే సిట్ దర్యాప్తు జరుపుతోందని షర్మిల ఆరోపించారు.బాధ్యత వహించాల్సిన ఐటీ శాఖ మంత్రి మాకేం సంబంధం అని తప్పించుకున్నారని విమర్శించారు. కంప్యూటర్లకు భద్రత లేనప్పుడు ఇది పూర్తిగా ఐటీ శాఖ వైఫల్యమే అని పేర్కొన్నారు.ఐటీ శాఖపై విచారణ కోరుతూ శుక్రవారం బేగంబజార్ పోలీస్ స్టేషన్ లో మంత్రి కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు. తాము ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
సిట్ దర్యాప్తు ముమ్మరం…
TSPSC Paper Leak: సంచలనం సృష్టించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నా పత్రాల లీక్ వ్యవహారంలో నగదు లావాదేవీలపై సిట్ దృష్టిసారించింది. పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు జరిగిటనట్టు గుర్తించారు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో నిందితుల మధ్య రూ.33.4 లక్షలు చేతులు మారినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ కేసులో కొందరు ప్రశ్నాపత్రాలను విక్రయించి నగదు తీసుకుంటే, మరికొందరు బ్యాంకు ఖాతాలలోకి బదిలీ చేయించుకున్నట్లు గుర్తించారు. ప్రశ్నాపత్రాలను విక్రయించిన కమిషన్ కార్యదర్శి పిఏ పులిదిండి ప్రవీణ్‌కుమార్‌కు ఈ వ్యవహారంలో రూ.16 లక్షలు అందుకున్నట్టు గుర్తించారు.
మరో ఇద్దరు అరెస్ట్…. మొత్తం 22 మంది
మరోవైపు పేపర్ల లీకేజీ వ్యవహారంలో అరెస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా మరో ఇద్దరు నిందితులను సిట్ అధికారులు అరెస్టు చేశారు. వికారాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో పనిచేస్తున్న భగవంత్ కుమార్, అతని సోదరుడు రవికుమార్‌ను సిట్ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. తన తమ్ముడు రవికుమార్ కోసం డాక్యా నాయక్ నుంచి భవంత్ కుమార్ ఏఈ పేపర్‌ను కొనుగోలు చేశాడు. ఏఈ పేపర్ కోసం డాక్యా నాయక్ రూ.2 లక్షలు అడగగా...భగవంత్ కుమార్ రూ.1.75 లక్షలు ఇచ్చారు. డాక్యా నాయక్ బ్యాంక్ లావాదేవీలను సిట్ అధికారులు పరిశీలించగా ఈ వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో భగవంత్ రావు, అతడి సోదరుడు రవికుమార్ ను సిట్ అధికారులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. తన తమ్ముడు రవికుమార్ కోసమే పేపర్ కొనుగోలు చేసినట్లు భగవంత్ కుమార్ ఒప్పుకున్నట్లు సమాచారం. వీరి అరెస్ట్‌తో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితుల సంఖ్య 22కు చేరింది.