తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medico Preethi Case : సైఫ్ కావాలనే ప్రీతీని టార్గెట్ చేశాడు... వరంగల్ సీపీ

Medico Preethi Case : సైఫ్ కావాలనే ప్రీతీని టార్గెట్ చేశాడు... వరంగల్ సీపీ

HT Telugu Desk HT Telugu

24 February 2023, 14:52 IST

    • Medico Preethi Case : సంచలనం సృష్టించిన వరంగల్ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కేసులో కీలక వివరాలు వెల్లడించారు వరంగల్ సీపీ రంగనాథ్. సీనియర్ విద్యార్థి సైఫ్ వల్ల ప్రీతి ఇబ్బంది పడిందని చెప్పారు. సేకరించిన ఆధారాల ద్వారా సైఫ్ ను అరెస్టు చేశామని తెలిపారు.
వరంగల్ సీపీ రంగనాథ్
వరంగల్ సీపీ రంగనాథ్

వరంగల్ సీపీ రంగనాథ్

Medico Preethi Case : వరంగల్ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి ఆత్మహత్యయత్నం కేసుకి సంబంధించిన కీలక విషయాలను వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. పీజీ అనస్థీషియా ద్వితీయసంవత్సరం విద్యార్థి సైఫ్ వేధింపులు తట్టుకోలేకే ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకుందని.. ఆరోపణలు వస్తోన్న వేళ... కేసులో కీలక అంశాలను తెలిపారు సీపీ. వైద్య విద్యార్థిని ప్రీతిని లక్ష్యంగా చేసుకొని సీనియర్ విద్యార్థి సైఫ్ వేధించాడని సీపీ రంగనాథ్ ప్రాథమికంగా వెల్లడించారు. ప్రీతి గతేడాది నవంబర్ లో .. వరంగల్ కాకతీయ కళాశాలలో పీజీ అనస్థీషియాలో చేరిందని... డిసెంబర్ నుంచే సైఫ్ కారణంగా ఆమె ఇబ్బందులు పడుతోందని... ఫోన్ చాట్స్ ద్వారా ఈ విషయం అర్థం అవుతోందని చెప్పారు. సేకరించిన ఆధారాల ద్వారా సైఫ్ ను అరెస్టు చేశామని వివరించారు.

ట్రెండింగ్ వార్తలు

Medak Thunderstrom: మెదక్ జిల్లాలో అకాల వర్షం… పిడుగు పాటుతో తాత మనుమడి మృతి, ధాన్యం కాపాడుకునే ప్రయత్నంలో విషాదం

Hyd Bike Blast: హైదరాబాద్‌లో ఘోరం, బైక్‌‌లో మంటలు ఆర్పుతుండగా భారీ పేలుడు, పలువురికి తీవ్ర గాయాలు

Electrocution : ఉమ్మడి మెదక్ జిల్లాలో విద్యుత్ షాక్ కు గురై నలుగురు దుర్మరణం

IRCTC Tamilnadu Tour Package : 6 రోజుల్లో తమిళనాడులోని ప్రముఖ దేవాలయాల సందర్శన, హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ

"ప్రీతి చాలా ధైర్యస్థురాలు. తెలివైన అమ్మాయి. అలాగే సున్నిత మనస్కురాలు. కళాశాలలో సీనియర్లను జూనియర్లు సార్ అని పిలవాలనే కల్చర్ ఉంది. ఇది బాసిజం తరహాలో ఉందని ప్రీతి భావించింది. ఆమెలో ఉన్న ప్రశ్నించే తత్వమే సైఫ్ కు మింగుడు పడినట్లు లేదు. ఫిబ్రవరి 18న వాట్సాప్ గ్రూప్ లో ఛాటింగ్ చేశారు. గ్రూప్ లో తనని ఉద్దేశించి ఛాట్ చేయడం సరికాదని సైఫ్ కు వ్యక్తిగతంగా ప్రీతి వాట్సాప్ మెసేజ్ పంపింది. ఏదైనా ఉంటే హెచ్ ఓ డీలకు ఫిర్యాదు చేయాలికానీ.. అవమాన పరచవద్దని ఛాట్ చేసింది. ఫిబ్రవరి 20న ఈ విషయాన్ని తండ్రి దృష్టికి ప్రీతి తీసుకెళ్లింది. ప్రీతి తండ్రి నరేందర్.. ఏఎస్ఐ. ఆయన ఏసీపీ, మట్వాడా ఎస్ఐ దృష్టికి ఇదే విషయాన్ని తీసుకెళ్లారు. ఫిబ్రవరి 21న ఉదయం మొదట సైఫ్ తో.. ఆ తర్వాత ప్రీతి హెచ్ ఓ డీతో పోలీసులు మాట్లాడారు. ప్రాక్టీస్ కి సంబంధించిన విషయాలను నేర్పించడానికే కొన్ని సార్లు గట్టిగా చెబుతామని... అది వారి మంచికోసమే అని సైఫ్ చెప్పారు. వేధించాలనే ఉద్దేశం తమకు లేదని తెలిపారు" అని సీపీ రంగనాథ్ వెల్లడించారు.

అయితే... సైఫ్ ఛాట్ హిస్టరీ కూడా పరిశీలించామని, ప్రీతీకి సహకరించవద్దని తోటి విద్యార్థులకు సైఫ్ సూచించినట్లుగా మెసేజ్ లు ఉన్నాయని వివరించారు. సైఫ్ కావాలనే ప్రీతీని టార్గెట్ చేశాడనే విషయం ఛాట్స్ ద్వారా ప్రాథమికంగా అర్థం అవుతోందన్నారు సీపీ. ఒక వ్యక్తి ఇన్ సల్ట్ గా ఫీలయితే అది ర్యాగింగ్ కిందకే వస్తుందన్న ఆయన.. ఆ అమ్మాయినే లక్ష్యంగా చేసుకొని అవహేళన చేస్తున్నట్లు ఛాట్స్ ద్వారా వెల్లడైందని తెలిపారు. సేకరించిన ఆధారాల ద్వారా సైఫ్ ను అరెస్టు చేశామని పేర్కొన్నారు.

వరంగల్ వైద్య విద్యార్ధిని ప్రీతి.. ఫిబ్రవరి 21న ఆసుపత్రిలో శిక్షణలో ఉండగా ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. కేఎంసీలో అనస్థీషియా పీజీ మొదటి సంవత్సరం చదువుతోన్న ఆమె... ఎంజీఎం ఎమర్జెన్సీ ఓటీలో ఉండగా... అనస్థీషియా ఇంజెక్షన్లు తీసుకొని సూసైడ్ అటెంప్ట్ చేసింది. ప్రస్తుతం ఆమెకు హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులతోనే ప్రీతి ఈ అఘాయిత్యానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రీతి ఆత్మహత్యాయత్నానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని రాజకీయ పార్టీల నేతలతో పాటు ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిమ్స్ లో చికిత్స పొందుతున్న విద్యార్థినిని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించారు. ఈ ఘటనపై ప్రభుత్వం కమిటీని నియమించిందని చెప్పారు. విద్యార్థినికి మెరుగైన వైద్యం అందుతోందని.. ఆమె పరిస్థితి కొంత మెరుగుపడిందని పేర్కొన్నారు.

తదుపరి వ్యాసం