తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tsrtc Offer : విజయవాడ రూట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన ఆర్టీసీ

TSRTC Offer : విజయవాడ రూట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన ఆర్టీసీ

HT Telugu Desk HT Telugu

13 April 2023, 13:50 IST

    • TSRTC Latest News: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ఆర్టీసీ. హైదరాబాద్‌-విజయవాడ రూట్‌లో ప్రయాణించే వారికోసం డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది.
తెలంగాణ ఆర్టీసీ ఆఫర్
తెలంగాణ ఆర్టీసీ ఆఫర్

తెలంగాణ ఆర్టీసీ ఆఫర్

TSRTC Discount Offer: గత కొంతకాలంగా వినూత్న నిర్ణయాలతో ఆర్టీసీని బలోపేతం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అడుగులు వేస్తోంది. ఓ వైపు ప్రస్తుతం ఉన్న భారాన్ని తగ్గించుకోవటంతో పాటు... ప్రయాణికులను ఆకర్షించేలా మార్పులు తీసుకువస్తోంది. ఇప్పటికే పలు ఆఫర్లను ప్రకటించింది. మరోవైపు పక్క రాష్ట్రాలకు కూడా సరికొత్త సర్వీసులను నడుపుతోంది. ఇదిలా ఉంటే…హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వారికోసం డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది.

హైదరాబాద్‌-విజయవాడ రూట్‌లో 10 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీని ప్రకటించింది. ఈ మార్గంలో వెళ్లే సూపర్‌ లగ్జరీ, రాజధాని ఏసీ సర్వీసుల్లో రానుపోనూ ఈ రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ నెల ౩౦ వరకు 10 శాతం డిస్కౌంట్‌ నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొంది. ఈ రాయితీ వల్ల ఒక్కొక్కరికి రూ.40 నుంచి 50 వరకు ఆదా అవుతుందని వెల్లడించింది. ఈ రాయితీని ప్రయాణికులు వినియోగించుకోవాలని ఓ ప్రకటనలో కోరింది. టికెట్ల రిజర్వేషన్ కోసం http://tsrtconline.in ను సంప్రదించాలని వివరించింది.

ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో కిలోమీటర్‌ ఆధారంగా నెలవారీ బస్‌పాస్‌లు మంజూరు చేయాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమల్లో ఉన్న శ్లాబ్‌ విధానాన్ని ఎత్తివేసింది. ఇక టోల్‌ ప్లాజా రుసుం కూడా బస్‌పాస్‌తో పాటే వసూలు చేయనుంది. ప్రస్తుతం నెలవారీ బస్‌పాస్‌ దారులకు టోల్‌ప్లాజా రుసుంను వేరుగా వసూలు చేస్తున్నారు. బస్‌ పాస్‌ చూపించి.. ప్రతి రోజూ టోల్‌ప్లాజా టికెట్‌ను వారు తీసుకోవాల్సి ఉండేది. తాజాగా ఆ విధానాన్ని సంస్థ ఎత్తివేసింది. ఇక టోల్‌ రుసుంతో పాటే నెలవారీ బస్‌పాస్‌ను మంజూరు చేయనుంది.

రాష్ట్రంలో 15వేల వరకు నెలవారీ బస్‌పాస్‌లున్నాయి. 100 కిలోమీటర్ల లోపు ప్రయాణించే వారికి 'మంత్లీ సీజన్‌ టికెట్‌' పేరుతో పాస్‌లను సంస్థ ఇస్తోంది. ఈ పాస్‌ తీసుకుంటే సాధారణ చార్జీతో పోల్చితే 33 శాతం రాయితీని ఇస్తోంది. 20 రోజుల చార్జీతో 30 రోజులు ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తోంది. తాజా నిర్ణయంతో ఉద్యోగం, వృత్తి, వ్యాపారాల రీత్యా నిత్యం ఎక్స్ ప్రెస్ బస్సుల్లో రాకపోకలు సాగించే వారికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం