తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Rera : ఇకపై రియల్‌ ఎస్టేట్‌ కేసులకు సత్వర పరిష్కారం - వర్చువల్‌ విచారణకు 'రెరా' శ్రీకారం

TS RERA : ఇకపై రియల్‌ ఎస్టేట్‌ కేసులకు సత్వర పరిష్కారం - వర్చువల్‌ విచారణకు 'రెరా' శ్రీకారం

30 August 2023, 9:47 IST

    • Telangana RERA Updates :తెలంగాణ రాష్ట్ర రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. వర్చువల్‌ విధానంలో కేసుల విచారణను ప్రారంభించింది. 
టీఎస్ రెరా
టీఎస్ రెరా

టీఎస్ రెరా

Telangana State Real Estate Regulatory Authority : తెలంగాణ రాష్ట్ర రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కీలక నిర్ణయం తీసుకుంది. రియల్ ఎస్టేట్ కేసుల సత్వర విచారణకు వర్చువల్‌ విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రెరా ఛైర్మన్ ఎన్‌.సత్యనారాయణ ఈ సేవలను మంగళవారం ప్రారంభించారు.సీనియర్‌ సిటిజన్లు, దూరప్రాంతాల వారికి ఇబ్బందులు కలుగుతున్నందున.. వర్చువల్‌ విధానాన్ని ప్రారంభించినట్లు రెరా ఛైర్మన్‌ పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల సౌలభ్యం కోసం నూతన టెక్నాలజీతో ఈ విధానాన్ని అమలు చేయనున్నామని వెల్లడించారు. ఫిర్యాదుదారులు ఎక్కడి నుంచైనా వర్చువల్‌ హియరింగ్‌కు హాజరుకావచ్చని స్పష్టం చేశారు.

ఇప్పటివరకూ కేసుల పరిష్కారానికి ఫిర్యాదుదారులు, కక్షిదారులు వ్యక్తిగతంగా రెరా బెంచి ముందు హాజరు కావాల్సి వచ్చేది. ఫలితంగా కక్షిదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకున్న రెరా... ఈ దిశగా నిర్ణయం తీసుకుంది.

మరో 3 సంస్థలకు నోటీసులు

TS RERA issued Show Cause Notices: రెరా అనుమతి లేకుండా ప్లాట్ల విక్రయాలు చేపట్టిన 3 స్థిరాస్తి సంస్థలకు నోటీసులు జారీచేసింది. ఈ మేరకు ప్రకటన విడుదలైంది. ఇందులో హైదరాబాద్‌లోని నాని డెవలపర్స్‌ (ఆలేరు, యాదాద్రిలో లక్ష్మీనరసింహ కంట్రీ-3 వెంచర్లు), ఖైరతాబాద్‌లోని ఆర్నా ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ (మహేశ్వరం వద్ద వెంచర్‌), కర్మన్‌ఘాట్‌లోని అష్యూర్డ్‌ ప్రాపర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (నాగార్జునసాగర్‌ రహదారిలోని చింతపల్లి, శ్రీశైలం మార్గంలోని ఆమనగల్లు ప్రాంతంలో అరణ్య పేరుతో వెంచర్లు) సంస్థలు ఉన్నాయి.

గత వారం కూడా ఐదు రియల్ ఎస్టేట్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది రెరా(రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ). ప్రీ లాంచింగ్ పేరుతో ప్లాట్ల అమ్మకాలు చేయడం, అనుమతి లేకుండా అదనపు నిర్మాణాలు చేపట్టడం సరికాదని తేల్చి చెప్పింది. రెరా రిజిస్ట్రేషన్ లేకుండా ప్లాట్ల విక్రయాలు చేస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఆయా సంస్థలు 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఐదు సంస్థలు ఇవే:

-భువన తేజ ఇన్ఫ్రా,

-రాధే గ్రూప్ రియల్ ఎస్టేట్స్

-టీఎంఆర్ సంస్థ

-ఓం శ్రీ బిల్డర్లు డెవలపర్స్‌

-సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ కంపెనీలు రెరా నోటీసులు అందుకున్న వాటిల్లో ఉన్నాయి.

రెరా నిబంధనలు పాటించని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై చర్యలు తప్పవని తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఎన్. సత్యనారాయణ హెచ్చరిచారు. ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో మోసాలు జరుగుతున్న నేపథ్యంలో రెరాలో నమోదు చేసుకున్న రియల్ ప్రాజెక్టుల్లో మాత్రమే ఇళ్లను కొనుగోలు చేయాలని కొనుగోలుదారులకు సూచించారు.

కేంద్రం స్థిరాస్థి నియంత్రణ ప్రాధికార సంస్థ (RERA: రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) చట్టాన్ని 2017లో తీసుకొచ్చింది. రియల్ ఎస్టేట్ మోసాలను అరికట్టి కొనుగోలుదారులకు రక్షణ కల్పించేందుకు కేంద్రం ఈ చట్టం తెచ్చింది. ఈ చట్టం ఆధారంగా రాష్ట్రాలు చట్టం చేసి కట్టుదిట్టంగా అమలు చేస్తున్నాయి. ఇది ఇంటి కొనుగోలుదారులకు భద్రత కల్పించడంతో పాటు రియల్ ఎస్టేట్ పెట్టుబడులను కూడా ప్రోత్సహిస్తుంది.

తదుపరి వ్యాసం