తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Guidelines On Stray Dogs: కుక్కల బెడదపై సర్కార్ ఫోకస్.. గైడ్ లైన్స్ విడుదల

Guidelines On Stray Dogs: కుక్కల బెడదపై సర్కార్ ఫోకస్.. గైడ్ లైన్స్ విడుదల

HT Telugu Desk HT Telugu

23 February 2023, 15:44 IST

    • TS Govt Guidelines On Stray Dogs: కుక్కల దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటన నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లోని వీధి కుక్కల బెడదను నియంత్రించడానికి చర్యలు చేపట్టే దిశగా సిద్ధమైంది. ఈ మేరకు పలు గైడ్ లైన్స్ జారీ చేసింది.
గైడ్ లైన్స్ విడుదల
గైడ్ లైన్స్ విడుదల

గైడ్ లైన్స్ విడుదల

Dog Bite Cases in Hyderabad: వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. వేసవి వస్తున్న నేపథ్యంలో... ఇష్టానుసారంగా దాడులకు దిగుతున్నాయి. తాజాగా ఓ చిన్నారిపై దాడి చేయటంతో మృతి చెందాడు. అదే కాదు... నగరంలోని పలు ప్రాంతాల్లో కూడా వీధి కుక్కల బెడద ఎక్కువైంది. అధికారులు చర్యలు చేపడుతున్నామని చెబుతున్నప్పటికీ... ఏదో ఒక చోట వీటి కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు భయాందోళనకు గురువుతున్నారు. తాజాగా అంబర్ పేట ఘటన నేపథ్యంలో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫలితంగా వీటి నియంత్రణపై ఫోకస్ పెట్టింది తెలంగాణ సర్కార్.

ట్రెండింగ్ వార్తలు

TS Cabinet Expansion : సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మరో ఆరుగురికి ఛాన్స్, ఎవరెవరికి చోటు దక్కనుంది?

Hyderabad Real Estate Scam: హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ రియల్ ఎస్టేట్ స్కామ్, రూ.60 కోట్లు వసూలు చేసిన భారతి బిల్డర్స్

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

కుక్కల బెడదను నియంత్రించే విషయంలో ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది మున్సిపల్ శాఖ. ముఖ్యంగా స్టెరిలైజేషన్ ప్రయత్నాలకు శ్రీకారం చుట్టబోతుంది. అంతేకాదు వీటి నియంత్రణ, నివారణకు సంబంధించి పలు మార్గదర్శకాలు జారీ చేసింది మున్సిపల్ శాఖ. వాటిని చూస్తే.......

మార్గదర్శకాలివే....

పెంపుడు జంతువుల నమోదుకు ప్రత్యేక మొబైల్‌ యాప్‌ ను తీసుకురావటం.

కుక్కల కుటుంబ నియంత్రణ వేగవంతం చేయడం.

కుక్క కాటు ప్రమాదాల నియంత్రణకు చర్యలు.

ఎకువగా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో వెటర్నరీ బృందాలను తరలించి కుక్కలను కట్టడి చేయడానికి తగు చర్యలు చేపట్టడం.

నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో పెంపుడు కుక్కలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించటం.

నగర, మున్సిపాలిటీల పరిధిలో ఉన్న స్లమ్‌ డెవలప్‌మెంట్‌ ఫెడరేషన్స్‌, టౌన్‌ డెవలప్‌మెంట్‌ ఫెడరేషన్స్‌ , రెసిడెంట్‌ కాలనీ వెల్ఫేర్‌ అసోసియేషన్స్‌ సహకారంతో నియంత్రణ చర్యలు చేపట్టడం.

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న హోటల్స్‌, రెస్టారెంట్స్‌, ఫంక్షన్‌ హాల్స్‌, చికెన్‌ , మటన్‌ సెంటర్లు వ్యర్థాలను వీధుల్లో వేయకుండా కట్టడి చేయటం.

జీహెచ్ఎంసీ పరిధి లో హెల్ప్ లైన్ నెంబర్ 04021111111 తీసుకురావటం.

కాలనీ సంఘాలు, బస్తిలలో వచ్చే నెల రోజులు కుక్క కాటు పై అవగహన కల్పించటం.

ఇకపై పెంపుడు కుక్కలకు గుర్తింపు కార్డులు ఇచ్చే చర్యలు.

వీధి కుక్కల దత్తత తీసుకోవడం పై అవగహన చర్యలు విస్తృతం చేయటం.

వీధి కుక్కల అంశంపై హోర్డింగ్స్,పోస్టర్స్, బిల్ బోర్డ్స్ తో ప్రచారం చేయటం.

వేసవి దృష్ట్యా వీధి కుక్కల కోసం ప్రత్యేకంగా నీటి వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవటం.

అంబర్ పేట్ ఘటన.. ఏం జరిగిందంటే..?

Street Dogs Killed young Boy: నాలుగేళ్ళ చిన్నారిని వీధి కుక్కలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆ చిన్నారి చనిపోయాడు. హృదయ విదారక ఘటన హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. నిజామాబాద్‌ జిల్లా ఇందల్‌వాయి మండల కేంద్రానికి చెందిన గంగాధర్‌ నాలుగేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వలస వచ్చాడు. అంబర్‌పేట ఛే నంబరు చౌరస్తాలో ఉన్న ఓ కారు సర్వీస్‌ సెంటర్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. భార్య జనప్రియ, ఆరేళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడు ప్రదీప్‌లతో కలిసి బాగ్‌అంబర్‌పేట ఎరుకుల బస్తీలో నివాసం ఉంటున్నాడు.

ఆదివారం సెలవు కావడంతో గంగాధర్‌ పిల్లలిద్దర్నీ వెంట బెట్టుకుని తాను పని చేస్తున్న సర్వీస్‌ సెంటర్‌‌కు వచ్చాడు. కుమార్తెను పార్కింగ్‌ ప్రదేశం వద్ద ఉన్న క్యాబిన్‌లో ఉంచి, కుమారుడిని సర్వీస్‌ సెంటర్‌ లోపలికి తీసుకెళ్లాడు. కుమారుడు అక్కడే ఆడుకుంటూ ఉండటంతో మరో వాచ్‌మన్‌తో కలిసి పని మీద బయటకు వచ్చాడు. కాసేపు అక్కడే ఆడుకున్న ప్రదీప్‌, తర్వాత అక్క కోసం క్యాబిన్‌ వైపు నడుచుకుంటూ వస్తుండగా వీధి కుక్కలు వెంటపడ్డాయి.

భయపడిన బాలుడు వాటి నుంచి తప్పించుకునేందుకు అటు ఇటూ పరుగులు తీసినా అవి వదల్లేదు. ఒకదాని తర్వాత ఒకటిగా బాలుడిపై దాడిచేశాయి. ఒక దశలో ఓ కుక్క కాలు..మరొకటి చేయి నోటకరచుకుని చెరోవైపు లాగడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. తమ్ముడి ఆర్తనాదాలు విని అక్కడికి వచ్చిన ఆరేళ్ల సోదరి.. పరుగున వెళ్లి తండ్రికి సమాచారమిచ్చింది. గంగాధర్ వచ్చి అదిలించడంతో కుక్కలు బాలుడిని వదిలేశాయి. తీవ్ర గాయాలపాలైన కుమారుడిని తండ్రి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన విషయంలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

మరోవైపు కుక్కల దాడిలో బాలుడి మృతి కేసుపై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యంతోనే బాలుడు చనిపోయాడని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్‌ఎంసీ ఏం చేస్తోందని ప్రశ్నించింది.

తదుపరి వ్యాసం