తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Armed Struggle: జనం నడిపిన విప్లవం… తెలంగాణ సాయుధ పోరాటం

Telangana Armed Struggle: జనం నడిపిన విప్లవం… తెలంగాణ సాయుధ పోరాటం

17 September 2022, 14:25 IST

google News
    • Telangana Peasent Armed Struggle: బాంచెన్ దొర కాళ్లు మొక్కుతా అన్న జనమే బరిగీసి నిలిచారు. బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్ల పోతావ్ కొడుకో నైజాం సర్కరోడా అంటూ నినదించారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాయుధ పంథాను సాగించారు.
తెలంగాణ సాయుధ పోరాటం,
తెలంగాణ సాయుధ పోరాటం, (HT)

తెలంగాణ సాయుధ పోరాటం,

"మన కొంపలార్చిన మన స్త్రీల చెరచిన

మన పిల్లలను చంపి మనల బంధించిన

మానవాధములను మండలాధీశులను

మరచి పోకుండ గురుతుంచుకోవాలె

కసి ఆరి పోకుండ బుసగొట్టుచుండాలె

కాలంబు రాగానే కాటేసి తీరాలి" ..'.... ఇది ప్రజాకవి కాళోజీ చెప్పిన మాటలు. సరిగ్గా ఈ మాటలు వింటే నాటి నైజాం సర్కార్ పాలనలో తెలంగాణ పల్లెల్లోని ప్రజలు ఎలాంటి కష్టాలు పడ్డారో అర్థమవుతోంది. ఈ కష్టాలు, కన్నీళ్లు, వెట్టిచాకిరి, దౌర్జన్యాలు, అత్యాచారాలు, అవమానాలే ఆ మట్టి మనిషులను తట్టిలెపాయి. ఆలోచనలే పునాదుల అయ్యాయి. పనిముట్లే ఆయుధాలయ్యాయి… ! గడ్డి కోసిన చేతులే గొడ్డలను ఎత్తాయి..! దండం పెట్టిన చేతులే కొడవళ్లను పట్టాయి. బంచాన్ దొర కాల్మొక్తా అన్న గొంతులే భూస్వాములు, పటేళ్లు, దొరల అరాచాకలపై గర్జించాయి. ఈ పరిణామాలే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంగా మారాయి.

telangana peasent armed struggle history: తెలంగాణ సాయుధ పోరాటం... మహామహులు చేసిన పోరాటం కానే కాదు... మట్టి మనిషులు చేసిన పోరాటం..! నిజాం సర్కార్ ను నేలమట్టం చేసిన చరిత్ర వారి సొంతం. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం చేసిన ప్రతిఘటన అని చెప్పొచ్చు. బానిసత్వానికి బలైపోయిన వెట్టిజీవుల తిరుగుబాటుకు ప్రతీక అనొచ్చు. జనం నడిపిన విప్లవమే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అని ఒక్క మాటలో చెప్పేయవచ్చు. నైజాం నవాబు పక్కన చేరిన భూస్వామ్యపు పునాదులను పెక్కిల్లించింది ఈ రైతాంగ పోరాటం. నిజాం ప్రభుత్వంతో పాటు పల్లెల్లో భూస్వాముల అరాచాకలకు వ్యతిరేకంగా ప్రజలు వీరోచితంగా పోరాటం నడిపించారు. కత్తుల వంతెన దాటుతూ కదనరంగంలోకి దిగారు. ప్రపంచ చరిత్రలోనే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. చరిత్ర మరవనికి పోరాటానికి 74 ఏళ్లు నిండిపోయాయి.

నాటి హైదరాబాద్ సంస్థానం ప్రత్యేకంగా ఉండేది. ఉన్న16 జిల్లాల్లో తెలంగాణ ప్రాంతానికి చెందినవి 8 జిల్లాలు ఉండేవి.మిగతావి కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల పరిధిలో ఉండేవి. ఈ ప్రాంతాలన్నీ నిజాం చేతుల్లో ఉండేవి. నిజాం పాలనలో గ్రామాలన్నీ భూస్వామ్యులు, పెత్తందార్లు,పట్లేళ్లు, పట్వారీల చేతుల్లో ఉండేవి, జామీందర్, దేశ్ ముఖ్ పేరు మీదు రెవెన్యూ వ్యవస్థ నడిచేది. వీరందరూ నిజాం సర్కార్ కు తొత్తులుగా ఉండేవారు. అసలు వీరి పేరు చెబితేనే తెలంగాణ పల్లెలు గజగజ వణికిపోయేవి. వీరు పల్లెల్లో ఉంటూ నిట్టనిలువునా దోచుకునేవారు.నైజాం ప్రభుత్వం విధించే పన్నులను దేశ్ ముఖ్ లు, దేశ్ పాండేలు వసూలు చేసే వారు. ఈ క్రమంలో అనేక ఘోరాలకు పాల్పడేవారు. రైతుల పంటను శిస్తు కింద గుంజుకునేవారు. భూమలను గుంజుకోవటమే కాదు కౌలు రైతులను చిత్రహింసలకు గురి చేసేవారు. ప్రతిదానికి పన్ను కట్టాల్సిందే. గ్రామాల్లో ఉండే దొరలు, భూస్వాములు, పటేళ్లు, పట్వారీల ఇళ్లలో ఏదైనా పండగ జరిగినా... వీరు పన్ను కట్టాల్సిందే.

ఇదిలా ఉంటే వీరి హయాంలో మరో దారుణం వెట్టి చాకిరి. నిర్భంద శ్రమ అని చెప్పొచ్చు. నాడు దొరలకు ఉచితంగా సేవలు చేయాల్సిందే. అన్ని ఉచితంగా సమర్పించుకోవాలి. వీరే కాదు ఊర్లలోకి వచ్చే అధికారులకు కూడా ఇవ్వాలి. ఇవ్వకపోతే దారుణంగా కొట్టేవారు. చిత్రహింసలు పెట్టేవారు. ఇక చదువుకునే పరిస్థితి ఉండేది కాదు. కేవలం ఉర్ధు చదువులే. తెలుగు చదువులు ఉండేవి కావు. అందుకే ఇప్పటికీ తెలంగాణ ప్రాంతంలో చాలా ఉర్ధు పదాలు వాడుకలో ఉంటాయి. ఇక ర్యాలీలు, సభల పేరేత్తే పరిస్థితి ఉండేది కాదు. దొర కనిపిస్తే వంగి దండం పెట్టాలి. కాళ్లకు చెప్పులు కూడా వేసుకోవద్దు. ఇలా దశాబ్ధాల కాలం పాటు నిజాం సర్కార్ తో పాటు భూస్వామ్యుల అరాచకాలు కొనసాగుతూనే వచ్చాయి. రజాకార్లు వచ్చాక పరిస్థితి మరింత దారుణంగా తయారైపోయింది.

ఈ పరిస్థితుల్లోనే ప్రజా ఉద్యమాలు మొదలయ్యాయి. చాలా పల్లెల్లో గ్రామ దళాలు ఏర్పడ్డాయి. జనం ఏకమయ్యారు. పనిముట్లనే ఆయుధాలుగా మార్చారు. 1921లో ఊపందుకున్న ఈ ఉద్యమాలు తెలంగాణవ్యాప్తంగా విస్తరించాయి.నిజాం వ్యవస్థకు వ్యతిరేకంగా, బానిస సంకెళ్ల విముక్తే లక్ష్యంగా కదనరంగంలోకి దిగాయి. ప్రతి పల్లె పోరాటం కేంద్రాలుగా మారాయి. జనం స్వచ్ఛదంగా ముందుకువచ్చారు. సామాన్యులే ముందుడి పోరాడారు. మహిళలు కూడా తుపాకీలు ఎత్తి... భూస్వామ్యులపై దాడులు చేయటం మొదలుపెట్టారు. కారంపొడి, గ్తుపలను చేతబట్టి ఎదురుదాడికి తెగబడ్డారు. ఈ క్రమంలోనే బైరాన్ పల్లి గ్రామం నెత్తుటితో తడిచిపోయింది. రజాకార్లు చేసిన విచక్షణ రహిత దాడిలో ఏకంగా 100 మందికిగాపైగా వీరులయ్యారు.

పటేళ్లు, దొరలపై ప్రజల పోరాటం కొనసాగుతూనే వచ్చింది. దున్నే వాడికే భూమి అనే నినాదంతో కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో భూపోరాటం కొనసాగింది. ఇందులో నల్గొండ జిల్లా ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. భువనగరి, హుజుర్ నగర్, పోచంపల్లి, వలిగొండ, సూర్యాపేట, రామన్నపేట ఉద్యమ కేంద్రాలుగా వెలిశాయి. రావినారాయణరెడ్డి, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, కమలమ్మ, భీంరెడ్డి నర్సింహ్మారెడ్డి, నర్రా రాఘరవరెడ్డి, ధర్మ బిక్షం వంటి నేతలు ప్రజాపోరాటలకు నాయకత్వం వహించారు. ఇదే సమయంలో గెరిల్లా దాడులు ఊపందకున్నాయి. రజాకార్లను రేణిగుంట రాంరెడ్డి తెగ నరకటం అప్పట్లో పెద్ద సంచనలం. చల్లా సీతారాంరెడ్డి రజాకార్ల క్యాంపులపై మెరుపుదాడులు చేశారు. మల్లు స్వరాజ్యం, ఆరుట్లు కమలాదేవి వంటి వారు రజాకార్లపై పోరాడిన వారిలో ఉన్నారు.

ఈ సాయుధ పోరులో వరంగల్ జిల్లాది మరో ప్రస్థానం. దొరలను ఉరికించి కొట్టిన చరిత్ర ఈ గడ్డ సొంతం. దొడ్డికొమరయ్య, చాకలి ఐలమ్మ, షేక్ బందగి వంటి వారు తొలితరం అమరులుగా నిలిచారు. వీర బైరాన్​ పల్లి పోరాట ఘటన మరో జలియన్ బాగ్ అని చెప్పొచ్చు. కడవెండి, పరకాల, ఖిలా వరంగల్ గ్రామాల్లో భూపోరాటం కొనసాగింది. పరకాల చరిత్ర కూడా చాలా గొప్పది. సెప్టెంబర్ 2, 1947లో పరకాలలో రజాకార్లు జరిపిన విచక్షణరహిత కాల్పుల్లో 21 మంది అమరులయ్యారు. ఇది స్వాత్రంత్య పోరాటంలో కీలక ఘట్టం అని కూడా చెప్పొచ్చు. పరకాలలో నిర్మించిన అమరదాం స్థూపంపై పేర్లు కూడా ఉంటాయి. జనగాం, ఖిలాషాపూర్, దెవురుపుల వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి.

నల్గొండ, వరంగల్, కరీంనగర్ వంటి ప్రాంతాలే కాదు మహబాబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా సాయుధ పోరాటం కొనసాగింది. మహబూబ్ నగర్ జిల్లాలోని అప్పంపల్లిలో రజాకార్లు జరిపిన ఫైరింగ్ లో దాదాపు 11 మంది అమరులయ్యారు. కరీంనగర్ లో బద్ధం ఎల్లారెడ్డి, అనభేరి ప్రభాకర్ ముందువరుసలో ఉండి పోరాడారు. పన్నుల పత్రాలను తగలబెట్టి.. నైజాం అరాచాకాలపై గర్జించిన వ్యక్తిగా అనభేరికి పేరుంది. ఆయన్ను తెలంగాణ భగత్ సింగ్ అని కూడా అంటారు. అనభేరి ప్రభాకర్ ను రజాకార్లు దారుణంగా కాల్చి చంపారు. 1948 సెప్టెంబర్ 17 సైనిక చర్య తర్వాత నిజాం సంస్థానం భారత యూనియన్ లో కలిసిపోయింది. ఇది జరిగినప్పటికీ తెలంగాణలో పల్లెల్లో పరిస్థితులు మారలేదు. కమ్యూనిస్టు పార్టీల నేతలు సాయుధ పోరాటాన్ని కొనసాగించారు. భూస్వామ్యుల భూములను స్వాధీనం చేసుకునే పనిలో పడ్డారు.

ఇలా 1946 నుంచి 1951 వరకు జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దాదాపు 4వేల మందికి పైగా అసువులు బాసారు. వారి పోరాట ఫలితంగానే చాలా పల్లెలోని పేదలకు భూమలు దక్కాయి. అందుకే తెలంగాణలో ఏ పోరాటం జరిగినా… సాయుధ రైతాంగా పోరాట ప్రస్తావన వస్తూనే ఉంటుంది. అమరవీరులను తలుచుకునే ఉంటుంది…!

తదుపరి వ్యాసం