తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Politics: తెలంగాణలో హైవోల్టేజ్ రాజకీయం… 'ఆట' ఇప్పుడే మొదలైందా..!

Telangana Politics: తెలంగాణలో హైవోల్టేజ్ రాజకీయం… 'ఆట' ఇప్పుడే మొదలైందా..!

18 May 2022, 6:16 IST

    • తెలంగాణ గట్టుపై పొలిటికల్ హీట్ మొదలైంది... కాదు కాదు అగ్ర నేతల టూర్లతో కుతకుత ఉడికిపోతోంది. అధికార టీఆర్ఎస్ తగ్గేదేలే అంటూ కౌంటర్లు విసురుతోంది. వచ్చే ఎన్నికల్లోనూ తమదే విజయమని తేల్చి చెబుతోంది. ఎన్నికలకు ఏడాది ముందుగానే తెలంగాణ గట్టుపై హైవోల్జేజ్ రాజకీయం నడుస్తోంది.
తెలంగాణలో పొలిటికల్ హీట్
తెలంగాణలో పొలిటికల్ హీట్ (HT)

తెలంగాణలో పొలిటికల్ హీట్

రాహుల్ వచ్చారు...ఓరుగల్లు డిక్లరేషన్ తో వార్ డిసైడ్ చేసేశారు. అమిత్ షా వచ్చారు.. తుక్కుగూడ వేదికగా కేసీఆర్ సర్కార్ పై గర్జించారు. టార్గెట్ కేసీఆర్ అంటూ క్లియర్ కట్ గా చెప్పేశారు. అయితే బీజేపీ.... బీ టీం టీఆర్ఎస్ అని రాహుల్ అంటే... కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందన్నారు షా జీ. అంతేనా అవినీతి అంటే టీఆర్ఎస్... టీఆర్ఎస్ అంటే అవినీతి అన్న రేంజ్ లో ఆరోపణలు గుప్పించారు. గూలాబీ దళం నుంచి రీసౌండ్ గట్టిగానే ఉంది. ఇద్దరి అగ్రనేతల కామెంట్స్ పై తీవ్రస్థాయిలో స్పందించారు. పొలిటికల్ టూరిస్టులు వస్తుంటారు.. వెళ్తూ ఉంటారు.. ఇక్కడ ఉండేది కేవలం కేసీఆరే అంటూ తేల్చి చెప్పేశారు. సీన్ కట్ చేస్తే కూల్ గా నడుస్తున్న రాజకీయం... రంజుగా మారిపోయింది. భానుడి భగభగలా మండిపోతోంది...! ఫలితంగా వచ్చే ఎన్నికల కోసం ఇప్పుడే రాజకీయ మంటలు అంటుకుంన్నట్లు అయింది. ఇక ఉద్యమాల గడ్డపై రాజకీయ రణక్షేత్రానికి ఆజ్యం పడినట్లే పిక్చర్ కనిపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

10 Years Telangana: ఉమ్మడి రాజధాని గడువు మరో పక్షం రోజులే.. జూన్‌2 తర్వాత ఆస్తుల స్వాధీనం చేసుకోవాలని సిఎం రేవంత్ ఆదేశం

BRS RakeshReddy: బీఆర్ఎస్ లో 'రాకేశ్ రెడ్డి' పంచాయితీ!కోఆర్డినేషన్ మీటింగ్‌ కు ముఖ్య నేతలంతా డుమ్మా

TS CPGET 2024 : టీఎస్ సీపీగెట్ నోటిఫికేషన్ విడుదల, మే 18 నుంచి అప్లికేషన్లు ప్రారంభం

Road Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు- ఆరుగురు మృతి, 14 మందికి గాయాలు

టార్గెట్ 2023..!

తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ అగ్ర నేతల పర్యటనలను చూస్తే... ఆయా పార్టీల టార్గెట్ స్పష్టంగా అర్థమవుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఇరు పార్టీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ... కేడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ మరింత జాగ్రత్త పడుతోంది. పార్టీలోని అసమ్మతి రాగాలకు చెక్ పెట్టేలా రాహుల్ దిశానిర్దేశం చేశారు. రైతుల డిక్లరేషన్ ప్రకటిస్తూ సమరశంఖం పూరించారు. ఇక ఎవరితోనూ పొత్తులు ఉండవని... ఈ విషయంపై ఎవరు కూడా మాట్లాడవద్దని తేల్చి చేపేశారు. రైతు డిక్లరేషన్ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. కష్టపడే వారికి మాత్రం టికెట్లు వస్తాయన్నారు. మరోవైపు తెలంగాణ ఇచ్చామంటూ సెంటిమెంట్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. అగ్రనేత సూచనలతో ఇప్పటికే 'రైతు రచ్చబండ' కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ కాంగ్రెస్. ప్రతి గ్రామంలో ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరగాలని.. రైతు డిక్లరేషన్ ను ప్రజల దగ్గరికి తీసుకెళ్లేలా కార్యాచరణ ప్రకటించింది. దీని ద్వారా ఎన్నికలకు ఏడాదిన్నర ముందే ప్రజల్లో ఉండేలా అడుగులు వేస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి పుల్ ఫామ్ లోకి రావాలని భావిస్తోంది. ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలన్న కసి ఆ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

బీజేపీ 'మిషన్ తెలంగాణ'...

ఇక బీజేపీ ఏ మాత్రం తగ్గటం లేదు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అన్న స్థాయిలో రాజకీయాలు చేస్తోంది. ప్రజా సంగ్రామయాత్రతో ముందుకొచ్చిన ఆ పార్టీ నాయకత్వం.. రెండో దశ పూర్తి చేసుకోంది. ముగింపు సభకు పార్టీ అగ్రనేత అమిత్ షా ను రప్పించింది. అయితే ఈ సభ వేదికగా ఆయన ప్రసంగం ద్వారా ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. టీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించటం ప్లాన్ లో భాగంగానే కనిపిస్తోంది. దీని ద్వారా బీజేపికి.. టీఆర్ఎస్ కు ఎలాంటి సంబంధం లేదనే సందేశం ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇక తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్... నీళ్లు, నిధులు, నియమకాలు బీజేపీ ద్వారా అమలవుతాయనే విషయాన్ని ప్రస్తావించింది. అయితే ఈ సభలో పెద్దగా కాంగ్రెస్ ను కార్నర్ చేసే ప్రయత్నం ఏ మాత్రం చేయలేదు. దీనికి ఓ లెక్క ఉంది. అధికార టీఆర్ఎస్ ను ఢీకొట్టేంది తామే అని చెప్పే వ్యూహాంలో భాగమనే చెప్పొచ్చు. ఇక ఎంఐఎం, టీఆర్ఎస్ ను అవిభక్త కవలలు అని విమర్శలు గుప్పిస్తూ పాత స్ట్రాటజీని కంటిన్యూ చేసింది. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని అభిప్రాయపడింది. మొత్తంగా ఎన్నికలకు ముందే శంఖం పూరించిన బీజేపీ... ఎన్నికల వరకూ ఇదే జోష్ ను కంటిన్యూ చేయాలని చూస్తోంది. బండి సంజయ్ పాదయాత్ర రాష్ట్రవ్యాప్తంగా ఉండటంతో పాటు అగ్రనేతల పర్యటనలు ఉండేలా వ్యూహాలు రచిస్తోంది.

మరోవైపు గూలాబీ దళం అలర్ట్ అవుతోంది. అగ్రనేతల పర్యటనలను టూరిస్టులతో పోల్చింది. బహిరంగ ప్రశ్నలతో అస్త్రాలను సంధించింది. పర్యటనలకు ముందు తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని నిలదీసింది. ఇక రాహుల్, అమిత్ షా కామెంట్స్ పై ఓ రేంజ్ లో స్పందించింది. సొంత నియోజకవర్గంలో గెలవలేని రాహుల్ తెలంగాణలో పార్టీని గెలిపిస్తారా అంటూ ప్రశ్నించింది. కాంగ్రెస్ అంటేనే స్కాంగ్రెస్ అంటూ కౌంటర్ ఇచ్చింది. ఒక్క ఛాన్స్ కాదు.. పది అవకాలిచ్చినప్పటికీ దేశం కోసం ఏం చేశారని నిలదీసింది. ఇక రాహుల్ సంగతి ఇలా ఉంటే.. అమిత్ షా వ్యాఖ్యలపై భగ్గుమంది. అబద్ధాల బాద్ షా.. అమిత్ షా అని ధ్వజమెత్తింది. తెలంగాణ గడ్డపై పచ్చి అబద్ధాలు ఆడారాని దుయ్యబట్టింది. తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవని హెచ్చరించింది. ముందస్తు కాదు ఏ ఎన్నికలకైనా టీఆర్ఎస్ సిద్ధమేనంటూ సవాల్ విసిరింది. ఇక పార్టీ అధినేత కేసీఆర్ గత కొద్దిరోజులుగా మౌనంగా ఉన్నారు. రాహుల్, అమిత్ షా వ్యాఖ్యలపై మంత్రులు తప్ప ఆయన స్పందించలేదు. దీంతో ఆయన మౌనంపై ఆసక్తి నెలకొంది. అయితే కేసీఆర్ మౌనం వెనుక ఏదో ఒక వ్యూహాం ఉండే ఉంటుందనే చర్చ కూడా నడుస్తోంది. ఇక క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేలా వ్యూహాలు కూడా రచిస్తోంది. మరోసారి ఎన్నికల వ్యూహాకర్త పీకేతో భేటీ అయ్యేందుకు కేసీఆర్ టైం కూడా ఫిక్స్ చేసేశారు. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ కేసీఆర్ అడుగులపై ఆసక్తి నెలకొంది.

మొత్తంగా ఏడాదిన్నరకు ముందే తెలంగాణ గట్టుపై ట్రయాంగిల్ ఫైట్ షురూ అయిందనే చెప్పొచ్చు. గతంలో జరిగిన ఎన్నికలు చూస్తే టీఆర్ఎస్ - కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉండగా.. ఇప్పుడు సీన్ మారింది. అనూహ్యంగా బీజేపీ పుంజుకోవటంతో...సమీకరణాలు మారాయి. సందర్భాన్ని బట్టి అగ్రనేతల పర్యటనలు కూడా ఉండేలా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ప్లాన్ వేస్తున్నాయి. ఈ ఇక్వేషన్స్ మధ్య టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎలాంటి వ్యూహాలతో ముందుకొస్తారనేది చూడాలి. గత ఎన్నికల్లో బంపర్ మెజార్టీ కొట్టిన టీఆర్ఎస్...ఈసారి పోటీని ఎదుర్కొనే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఫైనల్ గా ఒక్క ఛాన్స్ అంటున్న జాతీయ పార్టీలకు తెలంగాణ ప్రజలు అవకాశం ఇస్తారా....? లేక ఇంటి పార్టీగా చెప్పుకుంటున్న టీఆర్ఎస్ నే మరోసారి ఆదరిస్తారా..? అనే చర్చ అప్పుడే మొదలైంది. ఏడాదిన్నరకు ముందే ప్రధాన పార్టీలు రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్న వేళ... వచ్చే ఎన్నికలు టగ్ ఆఫ్ వార్ ను తలపించటం ఖాయంగా కనిపిస్తోంది.

తదుపరి వ్యాసం