తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Target Kcr : టార్గెట్ కేసీఆర్... ఆ 2 చోట్ల పోటీకి సై అంటున్న కీలక నేతలు - అసలు వ్యూహం ఇదేనా..?

Target KCR : టార్గెట్ కేసీఆర్... ఆ 2 చోట్ల పోటీకి సై అంటున్న కీలక నేతలు - అసలు వ్యూహం ఇదేనా..?

26 October 2023, 15:03 IST

    • Telangana Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. ఓవైపు అభ్యర్థుల విషయంలో ఆచితూచీ అడుగులు వేస్తున్న ప్రధాన పార్టీలు…. కేసీఆర్ విషయంలో మాత్రం ఈసారి సరికొత్త వ్యూహంతో ముందుకొచ్చే పనిలో పడ్డారు. కీలక నేతల ప్రకటనలే ఇందుకు బలం చేకురుస్తున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు - 2023
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు - 2023

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు - 2023

Telangana Assembly Elections 2023 : అసెంబ్లీ ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నాయి తెలంగాణలోని ప్రధాన పార్టీలు. ఇందులో భాగంగా ఆయా పార్టీలు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ ఇప్పటికే ప్రచారాన్ని షురూ చేయగా… ధీటుగా కార్యాచరణను రూపొందించే పనిలో పడింది కాంగ్రెస్. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో… అభ్యర్థుల జాబితాతో పాటు అనుసరించాల్సిన వ్యూహలపై లోతుగా మేథోమథనం చేస్తోంది. మరోవైపు బీజేపీ కూడా మిషన్ తెలంగాణకు పదును పెట్టే పనిలో ఉంది. పార్టీ అగ్రనేతలు వరుస పర్యటనలు చేస్తున్నారు. త్వరలోనే కాంగ్రెస్, బీజేపీ రెండో జాబితాలు కూడా విడుదల కానున్నాయి. ప్రతి నియోజకవర్గాన్ని సీరియస్ గా తీసుకుంటున్న ప్రతిపక్ష పార్టీలు.... గులాబీ బాస్ కేసీఆర్ పై సరికొత్త వ్యూహాలతో గురి పెడుతున్నాయి. గతానికి భిన్నంగా అభ్యర్థులను బరిలో ఉంచేలా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా.... బీజేపీ ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకుంది. ఇక కాంగ్రెస్ కూడా కేసీఆర్ విషయంలో తగ్గేదేలే అన్న ధోరణితో ముందుకెళ్లాలని భావిస్తోంది.

గజ్వేల్ బరిలో ఈటల...

ఇక ఈ ఎన్నికల్లో కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తుండటం ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా వ్యూహన్ని మార్చేశాయి. నేరుగా కేసీఆర్ నే ఢీకొట్టాలని భావించాయి. ఇందులో భాగంగా.... బీజేపీ నేత ఈటల రాజేందర్ రెండు చోట్ల పోటీ చేస్తానని చెప్పారు. అందుకు బీజేపీ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి జాబితాలో రెండు చోట్ల ఈటల పేరు ఖరారైంది. గజ్వేల్ నుంచి ఈటల బరిలో ఉండటంతో..... ఇక్కడి పోరు అత్యంత ఉత్కంఠగా మారింది. కేసీఆర్ ను ఓడించటమే తన లక్ష్యమని ఈటల గట్టిగా చెబుతున్నారు. ఇక్కడ భారీగా ముదిరాజ్ సామాజికవర్గ ఓట్లు ఉండటం తనకు కలిసివస్తుందని భావిస్తున్నారు. ఫలితంగా కేసీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేయాలని ఈటల భావిస్తున్నారు.

సై అంటున్న కాంగ్రెస్ నేతలు..

ఇక ఇటీవలే బీజేపీని వీడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... కాంగ్రెస్ లో చేరారు. మునుగోడులో పోటీ చేస్తానని చెప్పటంతో పాటు... పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే గజ్వేల్ బరిలో ఉంటానని తేల్చి చెప్పారు. కేసీఆర్ ను ఓడిస్తానని సవాల్ విసిరారు. దమ్ముంటే కేసీఆర్... మునుగోడులోనైనా సవాల్ చేయాలని అన్నారు. ఇక టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ పై పోటీకి రెడీ అనేశారు. ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.... కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశిస్తే కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీ చేయటానికి సిద్ధమేనని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఇలా ఎవరైనా సరే పార్టీ ఆదేశిస్తే వారిపై పోటీ చేస్తామని అన్నారు. ఇప్పటికే కామారెడ్డి బరిలో రేవంత్ రెడ్డి ఉంటారనే చర్చ జరుగుతోంది. అందుకు తగ్గటే రేవంత్ రెడ్డి.... వ్యాఖ్యలు చేయటంతో కామారెడ్డి బరి కూడా అత్యంత ఉత్కంఠను రేపుతోంది.

కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్న నేపథ్యంలో... బలమైన అభ్యర్థులను బరిలో ఉంచటం ద్వారా గులాబీ వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేయాలని ఇరు పార్టీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రభావం మిగతా నియోజకవర్గాలపై పడుతుందని.. తద్వారా ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఇబ్బందులు ఎదుర్కొంటుందని అంచనా వేస్తున్నారు. అన్నీ కుదిరితే… కేటీఆర్, హరీశ్ రావ్ పై కూడా బలమైన నేతలను దింపాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.... కాంగ్రెస్ ప్రకటించే రెండో జాబితాలో గజ్వేల్, కామారెడ్డి బరిలో ఎవరు ఉంటారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే ఈ రెండు చోట్ల పోటీపై గులాబీ పార్టీ వర్గాలు మరోలా స్పందిస్తున్నాయి. కేసీఆర్ ను ఢీకొట్టే స్థాయిలో రెండు పార్టీల అభ్యర్థులకు లేదని చెబుతున్నాయి. రెండు చోట్ల కేసీఆర్ బంపర్ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ పోటీ చేసే స్థానాలపై అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. గులాబీ బాస్ మెజార్టీతో గెలుస్తారా…? లేక ఏమైనా సంచలనాలు నమోదవుతాయా..? అన్న చర్చ కూడా జరుగుతోంది.

తదుపరి వ్యాసం