తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hai Chai Mobile Tea : ఉద్యోగ వేట మాని, ఉపాధి బాట ఎంచుకుని-ఖమ్మంలో ఓ యువకుడి వినూత్న ప్రయోగం

Hai Chai Mobile Tea : ఉద్యోగ వేట మాని, ఉపాధి బాట ఎంచుకుని-ఖమ్మంలో ఓ యువకుడి వినూత్న ప్రయోగం

HT Telugu Desk HT Telugu

10 February 2024, 19:58 IST

    • Hai Chai Mobile Tea : ఉద్యోగాల వేటలో అలసిపోయిన ఓ యువకుడి ఉపాధి బాటపట్టాడు. సరికొత్త ఆలోచనతో మొబైల్ టీ సెంటర్ నడుపుతూ తన భవిష్యతు బంగారు బాట వేసుకున్నాడు.
ఖమ్మంలో ఓ యువకుడి వినూత్న ప్రయోగం
ఖమ్మంలో ఓ యువకుడి వినూత్న ప్రయోగం

ఖమ్మంలో ఓ యువకుడి వినూత్న ప్రయోగం

Hai Chai Mobile Tea : నాన్న రైల్వే కూలీగా పని చేసేవాడు.. ఆయన రెక్కల కష్టంతో చదివిస్తే బీ ఫార్మసీ వరకు పూర్తి చేశాడు.. కొద్దికాలం 15 వేల జీతానికి ఫార్మసీ కంపెనీలో పని చేశాడు. ఎదుగూబొదుగు లేకపోయేసరికి ఆలోచనలో పడ్డాడు. ఈ లోగా తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు. భార్య, పిల్లలతో కొండంత కుటుంబ భారం మీద పడటంతో కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డాడు. ఆ ఆలోచనకు కార్యాచరణగానే ఆ యువకుడు "హాయ్ చాయ్" మొబైల్ టీ సెంటర్ కు శ్రీకారం చుట్టాడు.

ట్రెండింగ్ వార్తలు

Sundilla Parvathi Barrage : ఖాళీ అయిన సుందిళ్ల పార్వతి బ్యారేజీ, చేపల కోసం ఎగబడ్డ స్థానికులు

Wardhannapet Govt Hospital : వర్ధన్నపేటలో దారుణం-ఫోన్లో డాక్టర్ డైరెక్షన్ గర్భిణీకి నర్సులు డెలివరీ, శిశువు మృతి

TS Universities VCs : తెలంగాణలో వీసీల నియామకంపై కసరత్తు, 10 యూనివర్సిటీలకు 1382 అప్లికేషన్లు

WhatsApp Triple Talaq : వాట్సాప్ లో భార్యకు ట్రిపుల్ తలాక్, ఆదిలాబాద్ లో వ్యక్తి అరెస్టు

మొబైల్ టీ

ఖమ్మం జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న తనికెళ్ల గ్రామానికి చెందిన గుండ్ల సందీప్ బీఫార్మసీ వరకు విద్యను అభ్యసించాడు. ఆ తర్వాత హైదరాబాద్ లో ఓ ఫార్మసీ కంపెనీలో ఉద్యోగం చేశాడు. నెలకు వచ్చే రూ.15 వేల జీతం అక్కడి ఖర్చులకే సరిపోయేవి. ఒక్క రూపాయి కూడా మిగిలించే పరిస్థితి లేకపోయేది. దీంతో ఆ ఉద్యోగానికి స్వస్తి పలికి అదే రంగంలో మార్కెటింగ్ చేశాడు. ఉదయం బైక్ ఎక్కితే రాత్రి వరకూ చక్రాలపైనే జీవితం సాగేది. అంత కష్టపడినా గతంకంటే మెరుగైన స్థితి మాత్రం కనిపించలేదు. దీంతో ఏదైనా కొత్త వ్యాపారం సొంతంగా చేయాలన్న ఆలోచనలో పడ్డాడు. ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందనే ఆలోచనా క్రమంలో యూ ట్యూబ్ లో నిత్యం సెర్చ్ చేస్తూ ఉండేవాడు. ఒకానొక దశలో అతనికి ఒక ఆలోచన తట్టింది. అదే మొబైల్ టీ సెంటర్. అనుకున్నదే తడవుగా కార్యాచరణకు శ్రీకారం చుట్టాడు. ఇందుకోసం ఒక పాత ఆటోను కొనుగోలు చేశాడు. దానికి వెనుక భాగంలో టీ కప్పు ఆకృతిలో ఒక క్యాబిన్ ని తయారు చేయించాడు. దీని కోసం సందీప్ రూ.2.5 లక్షలను వెచ్చించాడు. టీ కప్పు రూపంలో ఉన్న క్యాబిన్ తో పాటు ఆటోకు సైతం కాఫీ కలర్ ను వేయించాడు.

రద్దీ ప్రాంతాలే అడ్డాలు

తన సొంత గ్రామమైన తనికెళ్లకు సమీపంలోనే ఉన్న ఖమ్మం జిల్లా కేంద్రమే బిజినెస్ కు అడ్డాగా ఎంచుకున్నాడు. ప్రధాన కూడళ్లలో ఆటోను నిలిపి వ్యాపారం సాగిస్తున్నాడు. సాధారణ చాయ్, కాఫీలతో పాటు అల్లం, మిరియాలు, లెమన్, బాదం, పిస్తా, గ్రీన్ టీలను బయటి వారి కంటే ప్రత్యేకంగా తయారు చేస్తూ అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు. మొబైల్ టీ సెంటర్ రూపానికే కాకుండా తన వద్ద చాయ్ తాగే వ్యక్తులు మళ్లీ, మళ్లీ వచ్చేలా తనదైన స్టైల్ లో రుచిని కూడా జోడిస్తున్నాడు. దీంతో అతని వ్యాపారం ముప్పై చాయ్ లు, అరవై కాఫీలుగా సాగిపోతోంది. ఉద్యోగాలు లేక, సరైన ఉద్యోగం దొరక్క ఆత్మ హత్యలకు పాల్పడుతున్న నేటి యువతకు ఎంతో ఆదర్శంగా సందీప్ నిలుస్తున్నాడు. ఉద్యోగం కంటే మనిషి జీవితం గొప్పదని, లోలోపల దాగున్న ట్యాలెంట్ కు పదును పెడితే భవిష్యత్ కు బంగారు బాట వేసుకోవచ్చని ఈ యువకుడు నిరూపిస్తున్నాడు.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.

తదుపరి వ్యాసం