తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Metro: కొత్త సంవత్సర వేళ.. మెట్రో సేవల పొడగింపు.. ఏ టైం వరకంటే.. ?

Hyderabad Metro: కొత్త సంవత్సర వేళ.. మెట్రో సేవల పొడగింపు.. ఏ టైం వరకంటే.. ?

HT Telugu Desk HT Telugu

30 December 2022, 22:47 IST

    • Hyderabad Metro: న్యూ ఇయర్ వేళ.. హైదరాబాద్ మెట్రో సేవల సమయాన్ని పొడిగించింది. జనవరి 1న తెల్లవారుజామున రెండు గంటల వరకు మెట్రో అందుబాటులో ఉంటుందని ప్రకటించింది.  
హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్ మెట్రో

హైదరాబాద్ మెట్రో

Hyderabad Metro: భాగ్యనగరంలో ప్రయాణికులకి వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తోంది హైదరాబాద్ మెట్రో. ట్రాఫిక్ కష్టాల నుంచి నగరవాసులకి విముక్తి కల్పిస్తోంది. అతి తక్కువ సమయంలో గమ్యాన్ని చేరే వెసులుబాటు కల్పిస్తోంది. దీంతో.. నగరంలో దూరప్రాంతాలకు వెళ్లాలని అనుకునే వారికి మెట్రో బెస్ట్ ఆప్షన్ అవుతోంది. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ఆఫర్లు, అదనపు సేవలతో హైదరబాదీలను మరింతగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో... న్యూ ఇయర్ వేళ నగరవాసులకి గుడ్ న్యూస్ చెప్పింది.. హైదరాబాద్ మెట్రో. సేవల సమయాన్ని పొడిగిస్తూ... కొత్త సంవత్సర సంబరాలకి మరింత జోష్ తీసుకొచ్చింది.

సాధారణంగా... మెట్రో సేవలు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. అయితే... కొత్త ఏడాది వేడుకల్లో భాగంగా చాలా మంది డిసెంబర్ 31న రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము వరకు ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి. పార్టీలు, ఈవెంట్లలో పాల్గొనే వారు లేట్ నైట్ ఇంటికి బయలుదేరుతారు. కొంత మంది కుటుంబాలతో కలిసి న్యూ ఇయర్ నైట్ ను ఆస్వాదించేందుకు రోడ్లపై ప్రయాణిస్తారు. ఈ నేపథ్యంలో.. డిసెంబర్ 31న ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సేవల సమయాన్ని పొడిగించాలని హైదరాబాద్ మెట్రో నిర్ణయించింది. మరో 3 గంటలు అదనంగా... అంటే జనవరి 1న తెల్లవారుజామున 2 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.

కొత్త సంవత్సరం వేళ సురక్షిత ప్రయాణాన్ని అందించేందుకు మెట్రో సేవలు పొడగిస్తున్నామని... హెచ్ఎంఆర్ఎల్ ప్రకటన విడుదల చేసింది. ఆఖరి ట్రైన్.. తెల్లవారుజామున 1 గంటలకు బయలుదేరి.. 2 గంటలకు గమ్యాన్ని చేరుకుంటుందని తెలిపింది. అయితే.. డ్రింక్ చేసిన వారు ప్రయాణికులను ఇబ్బంది పెట్టకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని.. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ప్రయాణికులు అధికారులతో సహకరించాలని, మెట్రో జర్నీలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మెట్రో అధికారులు విజ్ఞప్తి చేశారు.

మెట్రో సేవలు ప్రారంభించిన కొద్ది రోజులకే.. హైదరాబాద్ ప్రజలు జర్నీకి ఫిదా అయ్యారు. అనతికాలంలో మెట్రోలో రోజూ వారీగా ప్రయాణించే వారి సంఖ్య 5 లక్షలు దాటింది. అయితే.. కరోనా సమయంలో ట్రావెల్ చేసే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. సాఫ్ట్ వేర్ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వడంతో.. మెట్రోలో జర్నీ చేసే వారు బాగా తగ్గిపోయారు. గత ఆరు నెలల నుంచి పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవడంతో... నెమ్మదిగా మెట్రో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం ప్రతి రోజూ దాదాపు 4 లక్షల మంది హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారు.

తదుపరి వ్యాసం