తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Double Bed Room Houses : హైదరాబాద్ నగర వాసులకు గుడ్ న్యూస్, ఈ నెల 21న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ

Double Bed Room Houses : హైదరాబాద్ నగర వాసులకు గుడ్ న్యూస్, ఈ నెల 21న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ

08 September 2023, 19:30 IST

    • Double Bed Room Houses : హైదరాబాద్ లో రెండో విడత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈ నెల 21న హైదరాబాద్ పరిధిలో 13,300 ఇండ్లు పంపిణీ చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
హైదరాబాద్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు
హైదరాబాద్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు

హైదరాబాద్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు

Double Bed Room Houses : హైదరాబాద్ లో రెండో విడత డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21న రెండో విడతలో దాదాపు 13,300 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇళ్ల పంపిణీ కార్యక్రమంపై రాష్ట్ర సచివాలయంలో మంత్రులు తలసాని, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అధికారులతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. లబ్దిదారుల ఎంపికలో ప్రజాప్రతినిధుల ప్రమేయంలేదని మంత్రి కేటీఆర్ తెలిపారు. లబ్దిదారులు ఎంపిక పూర్తిగా అధికారుల బాధ్యత అన్నారు. కంప్యూటర్ ఆధారికి డ్రా తీసి లబ్దిదారులను ఎంపికి చేస్తున్నట్లు తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న ఆయన.. ఎంపిక పారదర్శకంగా మీడియా ముందు నిర్వహిస్తామన్నారు. మొదటి దశలో 11,700 ఇళ్లను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేదలకు పంపిణీ చేశామని తెలిపారు. ఇళ్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగితే అధికారులదే పూర్తిస్థాయి బాధ్యత అన్నారు. తప్పు చేసిన అధికారులను ఉద్యోగాల నుంచి తొలగించే స్థాయిలో చర్యలు ఉంటాయని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.

త్వరలో గృహలక్ష్మి పథకం

హైదరాబాద్‌ నగరంలో త్వరలో గృహలక్ష్మి పథకం కూడా అమలుచేస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ పథకానికి సంబంధించి హైదరాబాద్‌ పరిధిలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని మంత్రులు సీఎంను కోరారన్నారు. వారి సూచనలను సీఎం సూచన ప్రాయంగా అంగీకరించారని తెలిపారు. హైదరాబాద్ లో నోటరీ ప్రాపర్టీల అంశం మార్గదర్శకాలు ఇస్తామన్నారు. 58, 59 జీవోలతో ప్రజలకు ఉపశమనం లభించిందన్నారు.హైదరాబాద్‌లో నిర్మిస్తున్న లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు రూ.9100 కోట్లు ఖర్చయిందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

15న మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం

ఈ నెల 15వ తేదీన 9 జిల్లాల్లో మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 15వ తేదీన జరిగే మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం సందర్భంగా ఆయా జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని కేటీఆర్ తెలిపారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందన్నారు. రాష్ట్రంలోని జనగామ, నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, అసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, ఖమ్మం జిల్లాలలో నూతన మెడికల్ కాలేజీలను ఈనెల 15వ తేదీన ప్రారంభించుకోబోతున్నామన్నారు. సీఎం కేసీఆర్ ఒక మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవంలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. దీంతో పాటు ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు కామారెడ్డిలో పాల్గొననున్నారని తెలిపారు. ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు ద్వారా ఆ జిల్లా పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల ప్రజలకు, జిల్లా ప్రజలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. కాబట్టి ఆయా జిల్లాల పరిధిలో ఉన్న శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు 15వ తేదీన జరిగే కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.

తదుపరి వ్యాసం